Iphone- Pixel: కొత్త మొబైల్స్‌ డిస్‌ప్లే ఇలానే ఉంటుందా?

కొత్త ఫోన్ కొనేముందు మీరు ఎప్పుడైనా డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ ఎంత ఇస్తున్నారనేది చెక్ చేశారా. చాలామంది ధర, ర్యామ్‌, కెమెరా, ప్రాసెసర్‌, బ్యాటరీ గురించి మాత్రమే విచారిస్తారు. కీలకమైన డిస్‌ప్లే గురించి పెద్దగా పట్టించుకోరు. ప్రస్తుతం ఆ ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది...

Published : 25 Jul 2021 15:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త ఫోన్ కొనేముందు మీరు ఎప్పుడైనా డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ ఎంత ఇస్తున్నారనేది చెక్ చేశారా? చాలామంది ధర, ర్యామ్‌, కెమెరా, ప్రాసెసర్‌, బ్యాటరీ గురించి మాత్రమే విచారిస్తారు. కీలకమైన డిస్‌ప్లే గురించి పెద్దగా పట్టించుకోరు. ప్రస్తుతం ఆ ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. మొబైల్ కంపెనీలు అధిక రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఇవ్వడంపై దృష్టి సారిస్తున్నాయి. గూగుల్, యాపిల్ కంపెనీలు త్వరలో తీసుకురానున్న ఫోల్డబుల్ పిక్సెల్ ఫోన్‌, ఐఫోన్ 13 మోడల్స్‌లో 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో డిస్‌ప్లే ఇవ్వనున్నట్లు సమాచారం. 

ఐఫోన్ 13

యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌ 13లో 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో ఆల్వేస్‌-ఆన్‌ డిస్‌ప్లే ఇవ్వనుందట. ఇందుకోసం ఎల్‌టీపీఓ (లో-టెంపరేచర్‌ పాలిక్రిస్టలైన్ ఆక్సైడ్‌) ప్యానెల్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీ ఫోన్ స్క్రీన్‌ రిఫ్రెష్ రేట్‌లో మార్పులు చేసుకుంటూ బ్యాటరీపై భారాన్ని తగ్గిస్తుంది. దానివల్ల ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ కాలం ఉంటుంది. అలానే ఇందులో ఏ15 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారట. ఇది కూడా ఆల్వేస్‌-ఆన్ డిస్‌ప్లే కారణంగా ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోకుండా ఎక్కువ కాలం ఉండేలా సాయపడుతుంది. ఐఫోన్ 13 పెరల్‌, సన్‌సెట్ గోల్డ్ రంగుల్లో తీసుకొస్తున్నారట. ఫాస్ట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్, కొత్త వైడ్‌ యాంగిల్‌ కెమెరా లెన్స్‌ను ఈ ఫోన్‌లో ఇస్తున్నారని తెలుస్తోంది. ఐఫోన్‌ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌ వేరియంట్లో ఫోన్‌ను తీసురానున్నారు. 

గూగుల్‌ ఫోల్డింగ్ పిక్సెల్

గూగుల్ త్వరలో తీసుకురానున్న ఫోల్డింగ్ ఫోన్‌లో కూడా 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో ఎల్‌టీపీఓ డిస్‌ప్లే ఇవ్వనున్నారట. ఇందుకోసం అల్ట్రా-థిన్‌ గ్లాస్‌ టెక్నాలజీతో శాంసంగ్‌ ప్రత్యేకంగా 7.6-అంగుళాల ఫోల్డింగ్ డిస్‌ప్లే తయారుచేస్తున్నట్లు సమాచారం. ఇది గెలాక్సీ జెడ్ సిరీస్‌ పోల్డింగ్ ఫోన్ డిస్‌ప్లే తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ఇది అధిక గ్రాఫిక్ సామర్థ్యం ఉన్న గేమ్స్ ఆడేందుకు అనుకూలంగా ఉంటుంది. అలానే ఇందులో స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్ చిప్‌సెట్ ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. అక్టోబరులో విడుదలకానున్న పిక్సెల్‌ 6, పిక్సెల్ 6 ప్రో మోడల్స్‌తోపాటు పిక్సెల్ ఫోల్డింగ్ ఫోన్ విడుదల కావచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని