క్రోమ్‌ ఓఎస్‌కి పదేళ్లు..: ఇవే కొత్త ఫీచర్లు

విండోస్‌, లినక్స్‌, మ్యాక్‌ ఓఎస్‌ల మాదిరిగానే గూగుల్‌ క్రోమ్‌ ఓఎస్‌తో ఎప్పటి నుంచో క్రోమ్‌బుక్‌లను

Published : 13 Mar 2021 13:50 IST

విండోస్‌, లినక్స్‌, మ్యాక్‌ ఓఎస్‌ల మాదిరిగానే గూగుల్‌ క్రోమ్‌ ఓఎస్‌తో ఎప్పటి నుంచో క్రోమ్‌బుక్‌లను పరిచయం చేస్తోంది. సులువైన ఇంటర్ఫేస్‌తో నెట్టింట్లో సెక్యూర్డ్‌గా విహరించేందుకు అనువుగా రూపొందిన క్రోమ్‌ ఓఎస్‌కి పదేళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో సరికొత్త ఫీచర్లను గూగుల్‌ పరిచయం చేస్తోంది.. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

ఫోన్‌తో అనుసంధానం..

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ని వాడుతున్నట్లయితే క్రోమ్‌బుక్‌ని ఇట్టే కనెక్ట్‌ చేసుకుని వాడేలా ‘ఫోన్‌హబ్‌’ని తీసుకొచ్చారు. దీంతో ఫోన్‌ని బుక్‌ నుంచే సులభంగా కంట్రోల్‌ చేయొచ్చు. అందుకు స్టేటస్‌ ఇన్ఫర్మేషన్‌ బార్‌ పక్కనే ఫోన్‌ ఐకాన్‌ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే.. ఫోన్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్‌, బ్యాటరీ లెవల్‌.. లాంటి మరిన్ని ఆప్షన్లు వస్తాయి. ఫోన్‌లోని హాట్‌స్పాట్‌ని క్రోమ్‌బుక్‌ నుంచే ఎనేబుల్‌ చేయొచ్చు. రింగ్‌ మోడ్‌ని మార్చుకునే వీలుంది. అంతేకాదు.. ఫోన్‌ని ఎక్కడైనా పొగొట్టుకుంటే ‘లొకేట్‌ ఫోన్‌’ ఆప్షన్‌తో ఎక్కడుందో చూడొచ్చు. ఫోన్‌కి వచ్చే మెసేజ్‌లకు బుక్‌ నుంచే స్పందించొచ్చు. ఫోన్‌లో ఓపెన్‌ చేసిన క్రోమ్‌ ట్యాబ్‌లను బుక్‌ నుంచే చూడొచ్చు.

ఇట్టే స్క్రీన్‌ రికార్డింగ్‌

బుక్‌లో ఏదైనా ట్యుటోరియల్‌ తయారు చేయాల్సివస్తే. ఎలాంటి స్క్రీన్‌ రికార్డింగ్‌ టూల్స్‌తో పని లేకుండా ‘స్క్రీన్‌ క్యాప్చర్‌’ సదుపాయాన్ని అందిస్తోంది. దీంతో స్క్రీన్‌షాట్‌లు తీసుకోవడంతో పాటు స్క్రీన్‌ రికార్డింగ్‌ కూడా చేయొచ్చు. ‘ట్విక్‌ సెట్టింగ్స్‌ మెనూ’లో నుంచే ఈ ఆప్షన్‌ని పొందొచ్చు. ఇలా రికార్డు చేసిన వాటిని ‘క్రోమ్‌ ఓఎస్‌ షల్ఫ్‌’లో చూడొచ్చు.

నెట్‌వర్క్‌లు సింక్‌ అవుతాయి..

ఇంచుమించు అన్ని డివైజ్‌ల్లోనూ ఒకే గూగుల్‌ ఎకౌంట్‌ వాడుతుంటాం. అయినప్పటికీ ఏదైనా వై-ఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్‌ అవ్వాల్సివస్తే.. అన్నింటిలోనూ పాస్‌వర్డ్‌లను మాన్యువల్‌గా ఎంటర్‌ చేయాల్సిందే. కానీ, క్రోమ్‌బుక్‌లో ఇకపై అక్కర్లేదు. వాడుతున్న ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వై-ఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్‌ అయి ఉంటే.. క్రోమ్‌బుక్‌ నెట్‌వర్క్‌ పరిధిలోకి రాగానే ఆటోమేటిక్‌గా నెట్‌వర్క్‌కి కనెక్ట్‌ అవుతుంది. దీన్నే ‘వై-ఫై సింక్‌’ ఆప్షన్‌గా పరిచయం అయ్యింది. సెట్టింగ్స్‌లోని ‘కనెక్టడ్‌ డివైజెస్‌’లోకి వెళ్లి ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేయవచ్చు.

రైట్‌క్లిక్‌తో ‘క్విక్‌ ఆన్సర్‌’లు..

నెట్టింట్లో ఏదైనా వెతకాలంటే.. పదానికి అర్థం తెలుసుకోవాలంటే? ముందు సెలెక్ట్‌ చేయాలి.. తర్వాత కాపీ చేసి వెతికితేగానీ ఫలితం దొరకదు. కానీ, క్రోమ్‌ ఓఎస్‌లో అంత కష్టపడక్కర్లేదు. సింపుల్‌గా.. ఏ అంశాన్ని గురించి వెతకాలనుకుంటున్నారో.. ఆ పదం లేదా వాక్యాన్ని సెలెక్ట్‌ చేసి రైట్‌ క్లిక్‌ చేస్తే చాలు. అక్కడే వాటికి అర్థం, ఇతర సమాచారం వచ్చేస్తాయి.

‘నియర్‌బై షేర్‌’ కూడా..

ఆండ్రాయిడ్‌ డివైజ్‌ల్లో పరిచయం చేసిన ఈ ఫీచర్‌ని ఇకపై క్రోమ్‌బుక్స్‌లో కూడా వాడుకోవచ్చు. దీంతో ఫోన్‌ లేదా క్రోమ్‌బుక్స్‌ మధ్య యాప్‌లు, ఫొటోలు, లింక్‌లు, ఇతర డేటా ఫైల్స్‌ని  సులభంగా పంచుకోవచ్చు. 

మరికొన్ని..

ఐకాన్లకి కొత్త రూపం: ఓఎస్‌లోని గ్రాఫిక్‌ ఇంటర్ఫేస్‌ని మెరుగు పరుస్తూ.. అన్ని ఐకాన్లను రీడిజైన్‌ చేశారు. షెల్ఫ్‌, యాప్‌ లాంచర్‌లో అన్నీ కొత్తగా కనిపిస్తాయి. పలు రకాల యాప్‌లకు కూడా కొత్త రూపం ఇచ్చారు.

మీడియా కంట్రోల్స్‌..: ఆడియో ట్రాక్స్‌, ఇతర మీడియా ఫైల్స్‌ని ప్లే చేసి చూసే క్రమంలో ‘క్విక్‌ సెట్టింగ్స్‌ మెనూ’ నుంచే మీడియా కంట్రోల్స్‌ని యాక్సెస్‌ చేయొచ్చు.

‘క్లిప్‌బోర్డు’లో మరిన్ని..: క్రోమ్‌ ఓఎస్‌ క్లిబోర్డులో మరిన్ని యాక్సెస్‌ చేసేలా తీర్చిదిద్దారు. కాపీ చేసినవి, డౌన్‌లోడ్‌ ఫైల్స్‌, స్క్రీన్‌షాట్‌లు, పిన్‌ చేసిన ఫైల్స్‌.. ఇలా అన్నీ క్లిప్‌బోర్డులో కనిపిస్తాయి. అంటే.. గతంలో కాపీ చేసిన వాటిని సులభంగా యాక్సెస్‌ చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని