మీ ఫోన్‌ కుశలమేనా?

మంచి కాన్ఫిగరేషన్‌ ఫోన్‌ కొంటాం. ఇంకేంటి? ఎంత కాలమైనా హ్యాపీగా వాడుకోవచ్చు అనుకుంటాం. కొన్ని రోజులకు ఫోన్‌ చిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఏదైనా ఓపెన్‌ చేస్తే నెమ్మదిగా ప్రాసెస్‌ అవ్వడం.. ఏవేవో పిచ్చి పిచ్చి పాప్‌అప్‌ మెనూలు కనిపించడం.. ఫోన్‌ హ్యాంగ్‌ అయిపోవడం.. లాంటి సమస్యలెన్నెన్నో ఎదురవుతుంటాయి. ఎందుకిలా? ఫోన్‌కి ఏమై ఉంటుంది? ఫోన్‌ హ్యాక్‌ అయ్యుండొచ్చు. లేదూ మరేదైనా సమస్య అయ్యుండొచ్చు. అసలు ఎలాంటి సందర్భాల్లో ఫోన్‌ పని తీరు గతి తప్పిందని గ్రహించొచ్చు? ఇవిగోండి కొన్ని విశ్లేషణలు..

Updated : 12 Oct 2022 11:56 IST

ఈ-అతిథి

మంచి కాన్ఫిగరేషన్‌ ఫోన్‌ కొంటాం. ఇంకేంటి? ఎంత కాలమైనా హ్యాపీగా వాడుకోవచ్చు అనుకుంటాం. కొన్ని రోజులకు ఫోన్‌ చిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఏదైనా ఓపెన్‌ చేస్తే నెమ్మదిగా ప్రాసెస్‌ అవ్వడం.. ఏవేవో పిచ్చి పిచ్చి పాప్‌అప్‌ మెనూలు కనిపించడం.. ఫోన్‌ హ్యాంగ్‌ అయిపోవడం.. లాంటి సమస్యలెన్నెన్నో ఎదురవుతుంటాయి. ఎందుకిలా? ఫోన్‌కి ఏమై ఉంటుంది? ఫోన్‌ హ్యాక్‌ అయ్యుండొచ్చు. లేదూ మరేదైనా సమస్య అయ్యుండొచ్చు. అసలు ఎలాంటి సందర్భాల్లో ఫోన్‌ పని తీరు గతి తప్పిందని గ్రహించొచ్చు? ఇవిగోండి కొన్ని విశ్లేషణలు..


 బ్యాటరీ బాగోగులు

ఫోన్‌ సామర్థ్యంలో ఎలాంటి మార్పుండదు. చక్కగా పని చేస్తుంది. ఏ రకమైన సమస్యా ఉందనిపించదు. దీంతో మీ ఫోన్‌ పక్కా ఫిట్‌ అనుకోవద్దు. వెనక మీకు తెలియని అనుమానాస్పద ప్రక్రియ జరుగుతుండొచ్చు? అదే ‘బ్యాటరీ యూసేజ్‌’. బ్యాటరీ వాడకంలో అసాధారణ స్థితిని ఫోన్‌లో గమనిస్తే అప్రమత్తం అవ్వాల్సిందే. అదెలాగంటే.. ఏ కారణం లేకుండా బ్యాటరీ వేడెక్కుతుంది. ఫోన్‌ ఛార్జింగ్‌లో లేనప్పుడు కూడా అసాధారణంగా వేడెక్కుతుంటుంది. ఇలాంటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో మీకు తెలియకుండా రన్‌ అవుతుందనే అర్థం. అవి మాలిషియస్‌ యాప్‌లు అయ్యుండొచ్చు. స్క్రీన్‌ ఆఫ్‌లో ఉన్నప్పుడూ అవి రన్‌ అవుతుంటాయి. బ్యాటరీ వాడకంలో ఇలాంటి పరిస్థితిని గుర్తిస్తే కచ్చితంగా చెక్‌ చేయాలి. ముందుగా ‘సెట్టింగ్స్‌’లోకి వెళ్లి ‘బ్యాటరీ యూసేజ్‌’ని ఓపెన్‌ చేయండి. ఇందులో ఏయే యాప్‌లు ఎంతెంత బ్యాటరీని తీసుకుంటున్నాయో తెలుసుకోవచ్చు. గుర్తు తెలియని యాప్‌లు ఏవైనా ఎక్కువ బ్యాటరీని ఖర్చు చేస్తున్నట్లయితే రివ్యూ చేసి తొలగించాలి. ఈ సమస్యని గుర్తించకుంటే కీలాగర్స్‌, ఇతర ప్రమాదకరమైన వైరస్‌ యాప్‌లు డేటాని దొంగిలించొచ్చు. ఒకవేళ ఎలాంటి గుర్తు తెలియని యాప్‌లు కనిపించకుంటే... ఫోన్‌ని ఒకసారి రీస్టార్ట్‌ చేయండి. అలాగే, ఎక్కువ బ్యాటరీని వినియోగించే యాప్‌లను ‘ఫోర్స్‌ క్లోజ్‌’ చేయండి. ఒకవేళ ఆ యాప్‌లతో అవసరం లేకుంటే అన్‌ఇన్‌స్టాల్‌ చేయండి.


ఫోన్‌ పిచ్చి.. పిచ్చిగా ప్రవర్తిస్తే!

ఫోన్‌ కొన్నాక కొన్ని రోజులు, నెలలకే ఫోన్‌ చిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు ఎప్పుడైనా గమనించారా? ఆటోమేటిక్‌గా రీస్టార్ట్‌ అవ్వడం.. వాటంతటవే యాప్‌లు ఓపెన్‌ అవ్వడం.. ఫోన్‌ హ్యాంగ్‌ అయిపోవడం.. ఇలాంటివి ఎదురైతే! ఏం కాదులే అని తేలికగా తీసుకోవద్దు. సమస్య ఎక్కడుందో ట్రేస్‌ చేయాల్సిందే. ఇందుకు గూగుల్‌ అందించే ‘ప్లే ప్రొటెక్ట్‌’ని ప్రయత్నించొచ్చు. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయక్కర్లేదు. గూగుల్‌ ప్లే యాప్‌ని ఓపెన్‌ చేసి ‘ప్లే ప్రొటెక్ట్‌’ మెనూలోకి వెళ్లి స్కాన్‌ చేయొచ్చు. ప్రాథమికంగా ఏవైనా సమస్యలుంటే ప్రొటెక్ట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో పాటు కొన్ని ప్రత్యేక యాంటీవైరస్‌ టూల్స్‌తో హ్యాకర్ల గుట్టుని కనిపెట్టొచ్చు. అవాస్ట్‌, ఏవీజీ, బిట్‌డిఫెండర్‌.. లాంటి కొన్ని యాంటీవైరస్‌లను ప్రయత్నించొచ్చు. మాల్వేర్‌లను మట్టుపెట్టేందుకు ‘మాల్వేర్‌బైట్స్‌’ని వాడొచ్చు.  


 మీవి కాని యాప్‌లు ఉన్నాయా?

ఫోన్‌ కొన్నప్పట్నుంచీ ఏదో ఒక అవసరానికి రకరకాల యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తుంటాం. మెమరీ సామర్థ్యం మేరకు అవి వందల్లోనూ ఉండొచ్చు. కానీ, ఎప్పుడైనా మీకు తెలియని యాప్‌లు కంటపడ్డాయా? కనిపిస్తే లైట్‌గా తీసుకోవద్దు. ఎందుకంటే.. గుర్తు తెలియని యాప్‌లు మాల్వేర్‌లు అయ్యుండొచ్చు. ఇవి మీరు సందర్శించిన ఏవైనా నకిలీ వెబ్‌సైట్‌లు లేదా యాప్‌ల కారణంగా కొన్ని గుర్తు తెలియని ప్రోగ్రామ్‌లు ఇన్‌స్టాల్‌ అయ్యుండొచ్చు. అవి ఫోన్‌లోని వ్యక్తిగత డేటాని సేకరించి నిర్దేశిత థర్డ్‌ పార్టీ స్థావరాలకు చేరవేస్తాయి. ఇవి ఫోన్‌లో ఉన్నాయని మీకు తెలియనే తెలియకపోవచ్చు. ఇవి బ్యాటరీని పెద్ద వినియోగించుకోవు కూడా. అలాంటప్పుడు వీటిని ‘యాప్‌ మేనేజర్‌’లోకి వెళ్లి రివ్యూ చేసి గుర్తించాలి. సెట్టింగ్స్‌లోని యాప్స్‌ మేనేజర్‌లోకి వెళ్లి ‘ఆల్‌ యాప్స్‌’ని చెక్‌ చేయాలి. ఏవైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే అన్‌ఇన్‌స్టాల్‌ చేసేయండి. ఇలా అన్‌ఇన్‌స్టాల్‌ చేసే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సార్లు ఫోన్‌ ఓఎస్‌కి సంబంధించినవి తొలగించే అవకాశం ఉండొచ్చు. అంతేకాదు.. ఫోన్‌ తయారీ సంస్థలు అందించే ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ యాప్‌లనూ కోల్పోవచ్చు.


డేటా వాడకం సంగతేంటి?

డేటా లేనిదే రోజు గడవదు. ఎవరి ఫోన్‌లో చూసినా ఎక్కువ శాతం అన్‌లిమిటెడ్‌ ప్యాకేజీలే. దీంతో అసలు వాడుతున్న డేటా దేనికి ఖర్చు అవుతోందని ఆలోచించాల్సిన అవసరమే రాదు. కానీ, మీ డేటాని మీకు తెలియకుండా ఎవరైనా ఊడ్చేస్తున్నారేమోనని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఎప్పుడైనా ‘డేటా యూసేజ్‌’ మెనూని చెక్‌ చేశారా? తప్పక చేయాలి. ఎందుకంటే.. మాల్వేర్‌ ప్రోగ్రామ్‌లు, యాప్‌లు ఎక్కువ మొత్తంలో డేటాని నిరంతరం వాడుకుంటూ ఫోన్‌లో డేటాని హ్యాకర్లకు పంపేస్తుంటాయి. అందుకే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘డేటా యూసేజ్‌’ని ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి. సాధారణంగా యూట్యూబ్‌, స్పూటిఫై, ఇతర స్ట్రీమింగ్‌ సర్వీసులు మాత్రమే ఎక్కువ డేటాని తీసుకుంటాయి. అవి కాకుండా మరేవైనా ఇతర సర్వీసులు ఎక్కువ డేటాని ఖర్చు చేస్తున్నట్లయితే ఓ కన్నేయాలి. ఏదైనా నెలలో అసాధారణంగా డేటా ఏదైనా యాప్‌ వల్ల ఖర్చు అయినట్లు అనిపిస్తే వెంటనే చెక్‌ చేయాలి. అలాంటి యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్‌ చేయడం మంచిది. తొలగించే ముందు యాప్‌కి సంబంధించిన వివరాల్ని సరి చూసుకోవాలి.


  అవి కనిపిస్తున్నాయా?

వెబ్‌ విహారం, యాప్‌ల వాడకంలో మధ్య మధ్యలో పొడుచుకొచ్చే పాప్‌అప్‌లు, ప్రకటనలు గుర్తున్నాయా? అప్పుడప్పుడూ ఫోన్‌లో వైరస్‌ ఉందనో.. మీకు లక్షల్లో లాటరీ దొరికిందనో తెరపై దర్శనమిస్తుంటాయ్‌. ఈ మధ్య గూగుల్‌ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పుణ్యమా అని పాప్‌అప్‌లు తక్కువగానే కనిపిస్తున్నాయిగానీ.. వాటిని లైట్‌గా తీసుకోవడం మాత్రం మంచిది కాదు. ఏదో కంగారులో అలా దర్శనమిచ్చిన వాటిపై క్లిక్‌ చేస్తే.. అంతే సంగతులు. ఫోన్‌ వైబ్రేట్‌ అవుతూ ప్రకటనలు కనిపిస్తే.. అప్రమత్తం అవ్వాల్సిందే. ముందూ వెనకా ఆలోచించకుండా బ్రౌజర్‌ లేదా యాప్‌లను క్లోజ్‌ చేయాలి. అవసరం అనుకుంటే ఫోన్‌ని రీబూట్‌ చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని