ట్విటర్‌ ఫీచర్‌ ఫేస్‌బుక్‌లో..ఏంటో తెలుసా?

తమ వినియోగదారులను ఆకకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తుంటాయి సామాజిక మాధ్యమ సంస్థలు. అయితే కొన్నిసార్లు తమకంటే ముందుగా ఇతర కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తే మిగతా కంపెనీలు అదే తరహా ఫీచర్లను తమ యూజర్లకు అందిస్తుంటాయి...

Published : 06 Jul 2021 22:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తుంటాయి సామాజిక మాధ్యమ సంస్థలు. అయితే కొన్నిసార్లు తమకంటే ముందుగా ఇతర కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తే మిగతా కంపెనీలు అదే తరహా ఫీచర్లను తమ యూజర్లకు అందిస్తుంటాయి. ఇటీవల క్లబ్‌హౌస్‌లోని లైవ్‌ ఆడియో రూమ్స్‌ తరహా ఫీచర్‌ను ఫేస్‌బుక్ తన యూజర్స్‌ కోసం తీసుకొచ్చింది. తాజాగా ట్విటర్‌లోని థ్రెడ్‌ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌ యూజర్స్‌ కోసం పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనివల్ల యూజర్స్ తాము ముందుచేసిన పోస్ట్‌కి అనుసంధానంగా మరో పోస్ట్ చెయ్యొచ్చు. ఫేస్‌బుక్ ఇప్పటికే ఈ ఫీచర్‌ను పరిక్షించేందుకు ఎంపిక చేసిన కొంతమంది యూజర్స్‌కి అనుమతినిచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్లను కొందరు నెటిజన్లు షేర్ చేశారు.

ట్విటర్‌లో ట్వీట్‌ టైప్‌ చేసేప్పుడు అక్షరాల సంఖ్యపై పరిమితి ఉండటం వల్ల థ్రెడ్‌ ఫీచర్‌ను పరిచయం చేశారు. దానివల్ల యూజర్స్‌ ముందు చేసిన ట్వీట్‌కు కొనసాగింపుగా తాము చెప్పాలనుకున్న విషయాన్ని వరుస ట్వీట్ల ద్వారా షేర్ చేసుకోవచ్చు. అయితే ఫేస్‌బుక్‌లో అక్షరాల సంఖ్యపై పరిమితిలేదు. ఒక పోస్ట్‌లో 63 వేల అక్షరాలు టైప్ చెయ్యొచ్చు. దానివల్ల పెద్ద సమాచారాన్ని కూడా ఒకే పోస్ట్‌లో షేర్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో జరిగే లైవ్‌ ఈవెంట్ల సంబంధించిన సమాచారం షేర్ చేసుకునేవారికి థ్రెడ్‌ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుందని పలువురు సామాజిక మాధ్యమ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఫీచర్‌ను యూజర్స్‌ అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారా..లేక ఎంపిక చేసిన కొద్ది మంది యూజర్స్‌కి మాత్రమే పరిమితం చేస్తారా అనే దానిపై స్పష్టతలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని