గేమోత్సాహంగా..

కంప్యూటర్‌ మీద అవతలి వారితో గేమ్‌ ఆడుతున్నారు. హఠాత్తుగా పీసీ 50 మిల్లీసెకండ్ల పాటు నిలిచిపోయింది. అంతే గేమ్‌లో ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది.

Updated : 12 Oct 2022 03:06 IST

కంప్యూటర్‌ మీద అవతలి వారితో గేమ్‌ ఆడుతున్నారు. హఠాత్తుగా పీసీ 50 మిల్లీసెకండ్ల పాటు నిలిచిపోయింది. అంతే గేమ్‌లో ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది. మరి గేమ్స్‌ ఆడుతున్నప్పుడు కంప్యూటర్‌ ఫ్రీజ్‌ కాకుండా చూసుకోవటమెలా?


ఇంటర్నెట్‌ ఇబ్బందులు లేకుండా

ఇంటర్నెట్‌ స్పీడ్‌ స్థిరంగా, సిగ్నల్‌లో జాప్యం లేకుండా చూసుకోవటం ముఖ్యం. వెబ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి speedtest.net  లేదా dslreports.com వంటి స్పీడ్‌ టెస్టింగ్‌ సర్వీసుల్లోకి వెళ్తే వేగాన్ని తెలుసుకోవచ్చు. తగినంత ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఉండేలా చూసుకోవాలి. చాలా గేమ్స్‌కు 10 ఎంబిట్స్‌ స్పీడ్‌ సరిపోతుంది. అయితే మొత్తం వీడియో స్ట్రీమింగ్‌ కావాలనుకుంటే 50-100 ఎంబిట్స్‌ స్పీడ్‌ తప్పనిసరి. మిల్లీసెకండ్లలో జాప్యం తలెత్తినా గెలుపు చేజారినట్టే. వైఫై సెటింగ్స్‌ను మార్చుకోవటం, రూటర్‌ను గేమింగ్‌ కంప్యూటర్‌కు దగ్గరగా ఉండేలా చూసుకోవటం.. కంప్యూటర్‌ను, రూటర్‌ను కేబుల్‌తో కనెక్ట్‌ చేసుకోవటం ద్వారా ఇంటర్నెట్‌ సంకేతాలు, స్పీడ్‌ స్థిరంగా ఉండేలా చూసుకోవచ్చు. ఏదైనా తేడా ఉంటే ఇంటర్నెట్‌ ప్రొవైడర్‌నూ మార్చుకోవాల్సి రావొచ్చు.

అనవసర యాప్స్‌ కట్టడి

గేమ్‌ వాడుకునే మెమరీ, పవర్‌ ప్రాసెసింగ్‌లను ఏవైనా యాప్స్‌ వినియోగించుకుంటున్నటయితే వేగం మందగిస్తుంది. అన్ని బ్రౌజర్‌ విండోలు, అనవసర ఛాట్‌ యాప్స్‌ను క్లోజ్‌ చేయటం మంచిది. గేమ్‌తో సంబంధం లేనివాటినీ కట్టేయాలి. ఒక్క దీంతోనే చాలావరకు సమస్య కుదురుకుంటుంది. మెమరీని, ప్రాసెసింగ్‌ పవర్‌ను ఎక్కువగా వాడుకునే యాప్స్‌ను తెలుసుకోవటానికి విండోస్‌ టాస్క్‌ మేనేజర్‌ సాయం తీసుకోవచ్చు. దీనిలోని ‘మోర్‌ డిటెయిల్స్‌’ బటన్‌ను క్లిక్‌ చేస్తే రన్‌ అవుతున్న ప్రోగ్రామ్‌లన్నీ కనిపిస్తాయి. మెమరీ, సీపీయూలను ఎక్కువగా వాడుకుంటున్న ప్రోగ్రామ్‌లన్నింటినీ క్లోజ్‌ చేయాలి.

యాంటీవైరస్‌ సక్రమంగా

చాలామంది గేమ్‌ ప్రియులు యాంటీవైరస్‌, ఇంటర్నెట్‌ సెక్యూరిటీ సొల్యూషన్లను ఆపేయటమే మంచిదని భావిస్తుంటారు. కొందరైతే శాశ్వతంగా అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తుంటారు కూడా. నిజానికిది ఉపయోగపడదు సరికదా, గేమ్‌ వేగమూ నెమ్మదిస్తుంది. పీసీ వేగం మీద అంతగా ప్రభావం చూపని, గేమింగ్‌కు ప్రత్యేకించిన యాంటీవైరస్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అలాగే గేమ్‌ ఆడనప్పుడు మాత్రమే స్కాన్‌ చేసేలా సమయాన్ని నిర్దేశించుకోవాలి. గేమింగ్‌ మోడ్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి. ఇది ఫుల్‌స్క్రీన్‌ యాప్‌ రన్‌ అవుతున్నప్పుడే ఆటోమేటిక్‌గా ఆన్‌ అవుతుంది. పీసీని ఫుల్‌ స్కాన్‌ చేయదు. డేటాబేస్‌లను అప్‌డేట్‌ చేయదు. అందువల్ల ఎలాంటి డిస్టర్బెన్స్‌ ఉండదు.

విండోస్‌ అప్‌డేట్‌ సరిగా

కొన్ని విండోస్‌ 10 సబ్‌సిస్టమ్‌లు వెనకాల పనిచేస్తూ హఠాత్తుగా వేగం నెమ్మదించేలా చేయొచ్చు. ముఖ్యంగా విండోస్‌ అప్‌డేట్‌ దేనినైనా డౌన్‌లోడ్‌ చేసి, ఇన్‌స్టాల్‌ చేస్తున్నప్పుడు పీసీ సామర్థ్యం గణనీయంగా పడిపోతుంది. అందువల్ల గేమ్‌ ఆడనప్పుడే అప్‌డేట్‌ అయ్యేలా షెడ్యూల్‌ను సెట్‌ చేసి పెట్టుకోవాలి. విండోస్‌ 10 సెటింగ్స్‌ను ఓపెన్‌ చేసి ‘విండోస్‌ అప్‌డేట్‌’లోకి వెళ్లి ‘ఛేంజ్‌ యాక్టివ్‌ అవర్స్‌’ మీద క్లిక్‌ చేయాలి. దీన్ని సెట్‌ చేసుకుంటే ఆ సమయంలో పీసీ రీస్టార్ట్‌ కాకుండా చూసుకోవచ్చు.

పీసీ శుభ్రంగా

రోజురోజుకీ కంప్యూటర్‌ వేగం తగ్గుతూ వస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం జంక్‌ ఫైల్స్‌, యాప్స్‌ పోగవటం. కాబట్టి ఎప్పటికప్పుడు తాత్కాలిక ఫైళ్లు, ఆర్కైవ్‌ను క్లీన్‌ చేయటం.. అనవసర పత్రాలను డిలీట్‌ చేయటం.. ఆడని ఇతర గేమ్స్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేయటం మంచిది. పీసీ క్లీనర్‌ వంటి యాప్స్‌ ఇందుకు తోడ్పడతాయి.


గేమ్స్‌ వీడియో సెటింగ్స్‌ మెరుగ్గా

గేమ్‌ మరీ అతిగా రిసోర్సులను వాడుకుంటున్నా, గ్రాఫిక్స్‌ కార్డు తగినంత ప్రాసెసింగ్‌ పవర్‌ను అందించకపోతున్నా ఆటలోని మజాను పూర్తిగా ఆస్వాదించలేం. తక్కువ డిటెయిల్‌ లెవెల్‌ను సెట్‌ చేసుకోవటం, గేమ్‌ సెటింగ్స్‌లో రిజల్యూషన్‌ను తగ్గించుకోవటం ద్వారా సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. గేమ్‌ సెటింగ్స్‌ సపోర్టు చేసినట్టయితే ఎఫ్‌పీఎస్‌ ఇండికేటర్‌ను స్విచాన్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్‌ గేమ్స్‌ కోసమైతే 60 కన్నా ఎక్కువ ఎఫ్‌పీఎస్‌ ఉంటే మంచిది.


పవర్‌ సెటింగ్స్‌ మీద కన్ను

ది ల్యాప్‌టాప్‌లకు సరిపోయేదే అయినా కంప్యూటర్లకూ ముఖ్యమే. ఏసీ పవర్‌ మీద ఆడేలా చూసుకోవాలి. బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ మోడ్‌ను ఏనేబుల్‌ చేసుకోవాలి. దీనికి తేలికైన మార్గం- టాస్క్‌బార్‌లో బ్యాటరీ గుర్తును క్లిక్‌ చేసి, స్లైడర్‌ను పూర్తిగా కుడివైపునకు జరిపితే ‘బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌’ సెటింగ్స్‌ కనిపిస్తాయి.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని