తొలి ట్వీట్‌ సరదా

ప్రపంచవ్యాప్తంగా ట్విటర్‌ ఎంత ప్రాచుర్యం పొందిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సూటిగా, సుత్తిలేకుండా.. తక్కువ పదాల్లోనే సమర్థంగా అభిప్రాయాలను వ్యక్తీకరించుకునే సామాజిక మాధ్యమ వేదికగా కోట్లాదిమంది హృదయాలను కొల్లగొడుతోంది....

Published : 20 Apr 2022 01:59 IST

ప్రపంచవ్యాప్తంగా ట్విటర్‌ ఎంత ప్రాచుర్యం పొందిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సూటిగా, సుత్తిలేకుండా.. తక్కువ పదాల్లోనే సమర్థంగా అభిప్రాయాలను వ్యక్తీకరించుకునే సామాజిక మాధ్యమ వేదికగా కోట్లాదిమంది హృదయాలను కొల్లగొడుతోంది. ఇప్పుడంటే రోజూ కోట్లాది ట్వీట్లు పుట్టుకొస్తున్నాయి గానీ తొలి ట్వీట్‌ ఏదో తెలుసా? ‘జస్ట్‌ సెటింగ్‌ అప్‌ మై ట్విటర్‌’ అనే ఐదు పదాల వాక్యమే. ట్విటర్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాక్‌ డోర్సే 2006లో మే 21న దీన్ని ట్వీట్‌ చేశారు. ఇప్పుడిది ఎన్‌ఎఫ్‌టీ (నాన్‌-ఫంజిబుల్‌ టోకెన్‌) రూపంలో మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

జాక్‌ డోర్సే చేసిన తొలి ట్వీట్‌ను క్రిప్టో వ్యాపారవేత్త సినా ఎస్టవీ ముచ్చటపడి రూ.22,18,63,050 (29 లక్షల డాలర్లు) వెచ్చించి మరీ కొన్నారు. ఆయన దీన్ని ఎన్‌ఎఫ్‌టీ రూపంలో ఇటీవల రూ.367,16,16,000 (4.8 కోట్ల డాలర్లు) ధరకు వేలానికి పెట్టారు. వచ్చే డబ్బులో సగాన్ని వితరణ కార్యక్రమాలకు దానం చేస్తాననీ ప్రకటించారు. కానీ పెద్దగా స్పందన లభించలేదు. రూ.10,70,657  (14,000 డాలర్లు) కన్నా తక్కువ ధరే పలుకుతోంది. మంచి ధర వస్తేనే దీన్ని అమ్ముతానని, లేకపోతే ఎప్పటికీ అమ్మనని ఎస్టవీ చెబుతున్నారు. చివరికి ఈ వేలం కథ ఎలా ముగుస్తుందో తెలియదు కానీ ట్విటర్‌ చరిత్రలోకి తొంగి చూస్తే తొలి ట్వీట్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు చాలానే కనిపిస్తాయి.

పొట్టి సందేశాల స్ఫూర్తితో

ట్విటర్‌ను జాక్‌ డోర్సే, ఇవాన్‌ విలియమ్స్‌, నోవా గ్లాస్‌, బిజ్‌ స్టోన్‌ కలిసి స్థాపించారు. డోర్సే 2006లో విలియమ్స్‌ దగ్గరికి వెళ్లి ఎస్‌ఎంఎస్‌ల వంటి పొట్టి సందేశాలతో స్నేహితులతో ముచ్చటించే ఇంటర్నెట్‌ సేవల గురించి చర్చించారు. దీనికి స్టాట్‌.యూఎస్‌ అని పేరు పెట్టారు. కానీ డోర్సే అంతకన్నా మంచి పేరు గురించి ఆలోచిస్తుండగా ట్విటర్‌ అనే పదం తట్టింది. దీని అర్థం- ‘అంత ప్రాముఖ్యంలేని సమాచారం కాసేపు పెల్లుబుకటం, పక్షుల కిలకిల రావాలు’. ట్విటర్‌ సేవల ఉద్దేశమూ ఇదే. లోగో కూడా ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది. అయితే ట్విటర్‌.కామ్‌ డొమైన్‌ పేరును అప్పటికే ఎవరో తీసేసుకున్నారు. దీంతో ‘ఐ’, ‘ఇ’ అక్షరాలు లేకుండా twttr.com గా కొంతకాలం కొనసాగింది. ట్విటర్‌ డొమైన్‌ను కొన్న తర్వాత twitter.com గా స్థిరపడింది.

అనూహ్యంగా..

ఐదు పదాల తన ట్వీట్‌ చరిత్రాత్మకంగా మారుతుందని డోర్సే కూడా ఊహించలేదు. ఇది తొలి ట్వీట్‌గా పేరు పొందింది గానీ నిజానికి ట్విటర్‌ సేవలను ఆరంభించటానికి చాలా ముందుగానే తాను తొలి ట్వీట్‌ను రాశానని డోర్సే చెబుతుంటారు. ‘‘నాకు చిన్నతనంలో పటాలంటే చాలా ఆసక్తి. పద్నాలుగేళ్ల వయసులో కొరియర్‌ సేవల కోసం ప్రోగ్రామ్స్‌ను క్రియేట్‌ చేయటానికి కోడ్‌ రాయటం నేర్చుకున్నాను. ఇలాంటి ఒక సంస్థ కోసం పనిచేస్తున్న సమయంలోనే.. 2001లో నగరంలో సరకులు ఎక్కడెక్కడ, ఎలా బట్వాడా అవుతున్నాయనేది సచిత్రంగా నా మెదడులో గూడు కట్టుకున్నట్టు గుర్తించాను. కానీ ఇందులో మనుషులు లేరు. అందుకే నా బ్లాక్‌బెర్రీ ద్వారా స్నేహితులందరికీ మెయిల్‌ సందేశాలు పంపించటానికి ఒక ప్రోగ్రామ్‌ను సృష్టించాను. గోల్డెన్‌ గేట్‌ పార్కుకు వెళ్లినప్పుడు ‘ఐయామ్‌ ఎట్‌ ద బైసన్‌ ప్యాడాక్‌ వాచింగ్‌ ద బైసన్‌’ అని ఒక పొట్టి సందేశాన్ని మిత్రులకు పంపించాను. నిజానికి నేను పంపించిన తొలి ట్వీట్‌ ఇదే. అదీ ట్విటర్‌ ప్రారంభం కావటానికి ఐదేళ్ల ముందే. అయితే ఎవరూ దీన్ని సరిగా గ్రహించలేదు. మెసేజ్‌ను చూసినవారంతా అపార్థం చేసుకున్నట్టుగానే స్పందించారు. ఆ క్షణంలో నేనేం చేస్తున్నానో, ఏం చేశానో రాయటం ఎందుకు అని అందరూ అన్నారు’’. ఇది డోర్సే చెప్పిన తొలి ట్వీట్‌ కథ. అంటే ఓ విచిత్ర పదం, కొన్ని జంతువులతో ట్వీట్ల ప్రస్థానం ఆరంభమైందన్నమాట. మొదట్లో ఎవరికీ పెద్దగా పట్టనిదే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి అభిప్రాయ వ్యక్తీకరణ సాధనంగా మారిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని