రీస్కిన్‌.. స్పర్శనూ గ్రహిస్తుంది

ద్రాక్ష పండు చితికిపోకుండా వేళ్లతో పట్టుకోవటం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అదే రోబోలైతే? మనలాగా వాటికి స్పర్శజ్ఞానం ఎక్కడ ఉంటుంది? ఎంత మృదువుగా పట్టుకోవాలో ఎలా తెలుస్తుంది? రోబోటిక్స్‌, కృత్రిమ మేధ శాస్త్రవేత్తలకు మొదట్నుంచీ ఇది

Published : 10 Nov 2021 01:01 IST

ద్రాక్ష పండు చితికిపోకుండా వేళ్లతో పట్టుకోవటం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అదే రోబోలైతే? మనలాగా వాటికి స్పర్శజ్ఞానం ఎక్కడ ఉంటుంది? ఎంత మృదువుగా పట్టుకోవాలో ఎలా తెలుస్తుంది? రోబోటిక్స్‌, కృత్రిమ మేధ శాస్త్రవేత్తలకు మొదట్నుంచీ ఇది సవాలుగానే నిలుస్తూ వస్తోంది. దీన్ని పరిష్కరించటానికే కానగీ మెలన్‌ యూనివర్సిటీ, మెటా (ఫేస్‌బుక్‌) పరిశోధకులు కొత్తరకం చర్మాన్ని సృష్టించారు. దీని పేరు ‘రీస్కిన్‌’. సాగే ప్లాస్టిక్‌, అయస్కాంత రేణువులతో కూడిన ఇది కృత్రిమ మేధ సాయంతో స్పర్శను గుర్తిస్తుంది. దీనికి ఏదైనా తగిలినప్పుడు అక్కడి ప్లాస్టిక్‌ రూపం మారుతుంది. అప్పుడు అయస్కాంత రేణువులు స్పందిస్తాయి. ఫలితంగా అయస్కాంత క్షేత్రంలో మార్పులు తలెత్తుతాయి. సమీపంలో ఉండే సర్క్యూట్‌ బోర్డు వీటిని గ్రహించి కృత్రిమ మేధకు సమాచారాన్ని అందిస్తుంది. కృత్రిమ మేధ దీన్ని బల ప్రయోగంగా అనువాదం చేస్తుంది. ఇదే స్పర్శజ్ఞానంలా పనిచేస్తుంది. జారిపోవటం, పట్టుకోవటం, విసరటం, చప్పట్లు కొట్టటం వంటివి గుర్తించటానికి రోబోలకు ఉపయోగపడుతుంది. సుమారు 3 మిల్లీమీటర్ల మందంతో కూడిన రీస్కిన్‌ 50వేల ప్రతిచర్యలను తట్టుకోగలదు. అంటే 50వేల సార్లు పనిచేస్తుందన్నమాట. దీనికి తీగలు, సెన్సింగ్‌ బోర్డుల వంటివేవీ అనుసంధానమై ఉండవు. కాబట్టి చాలా పలుచగానూ ఉంటుంది. చవకైన, మన్నికైన దీన్ని రోబోలు, ధరించే పరికరాలు, స్మార్ట్‌ దుస్తుల వంటి వాటికి వాడుకోవచ్చని భావిస్తున్నారు. రోబోటిక్‌ చేతులు, గ్లవుజులతో పాటు కుక్కలకు వేసే షూకు సైతం చాలా అనువుగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని