చప్పుళ్లు వినే టీషర్ట్‌!

మనం ధరించే టీషర్టే గుండె లయను గమనిస్తే? మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు మైక్రోఫోన్‌లాగా పనిచేసే వినూత్న ‘శ్రవణ ఫైబర్‌’ అల్లికతో దీన్ని సుసాధ్యం చేయనున్నారు.

Published : 23 Mar 2022 00:20 IST

నం ధరించే టీషర్టే గుండె లయను గమనిస్తే? మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు మైక్రోఫోన్‌లాగా పనిచేసే వినూత్న ‘శ్రవణ ఫైబర్‌’ అల్లికతో దీన్ని సుసాధ్యం చేయనున్నారు. వంగినప్పుడు విద్యుత్‌ సంకేతాలను పుట్టించే ‘పీజోఎలక్ట్రిక్‌’ పదార్థంతో ఈ ఫైబర్‌ను తయారుచేశారు మరి. ఇది అచ్చం చెవి మాదిరిగా.. శబ్దాన్ని యాంత్రిక కంపనాలుగా.. తర్వాత విద్యుత్‌ సంకేతాలుగా మారుస్తుంది. ఈ దారంతో తయారైన టీ షర్టు ధరిస్తే గుండె చప్పుడు వంటి చిన్న చిన్న శబ్దాలనూ గుర్తిస్తుంది. అంటే చొక్కానే స్టెతస్కోప్‌గా మారుతుందన్నమాట. దీంతో నిరంతరం గుండె కొట్టుకునే తీరును, శ్వాస తీసుకునే విధానాన్ని పసిగట్టొచ్చు. మన చెవి వ్యవస్థ స్ఫూర్తితోనే ఈ ‘వినే ఫైబర్‌’ను తయారుచేశారు. మనకు వినిపించే చప్పుళ్లు స్వల్ప ఒత్తిడి తరంగాలుగా గాలిలో ప్రయాణిస్తాయి. ఇవి చెవికి చేరుకున్నప్పుడు కర్ణభేరి కంపిస్తుంది. ఇవి చిన్న ఎముకల ద్వారా లోపలి చెవిలోకి.. అక్కడ్నుంచి వర్తులాకార కాక్లియాలోకి చేరతాయి. కాక్లియాలో విద్యుత్‌ సంకేతాలుగా మారి, శ్రవణ నాడి ద్వారా మెదడుకు చేరుకుంటాయి. మెదడు వీటిని విశ్లేషించి ఆయా చప్పుళ్లను గుర్తించేలా చేస్తుంది. నిజానికి వినగలిగే స్థాయిలోని చప్పుళ్లకు అన్ని వస్త్రాలు కంపిస్తాయి. కానీ ఇవి చాలా చాలా బలహీనంగా ఉంటాయి. అందుకే వీటిని గుర్తించటానికి పరిశోధకులు వంగటానికి, దారం పోగులతో కలిపి నేయటానికి వీలైన కొత్తరకం ఫైబర్‌ను రూపొందించారు. ఇది అతి తక్కువ స్థాయి నుంచి వాహనాల రొద వంటి పెద్ద శబ్దాలనూ పసిగట్టగలదు. అవి ఏ దిక్కు నుంచి వస్తున్నాయో గుర్తించగలదు. అందుకే దీంతో టీషర్టుల వంటివి తయారుచేస్తే ఎన్నో విధాలుగా ఉపయోగపడలవని భావిస్తున్నారు. ఉదాహరణకు- వివిధ భాగాల్లో ఈ పోచలు ఉండేలా టీషర్టు తయారుచేశామనుకోండి. శబ్ద తరంగాలను పసిగట్టటంలో ఏర్పడే జాప్యం ఆధారంగా ఎటువైపు నుంచి చప్పుడు వస్తోందనేది కచ్చితంగా గుర్తించొచ్చు. పోలీసుల వంటి భద్రతా అధికారులకు ఇదెంతగానో ఉపయోగపడగలదు. చిన్న చిన్న మార్పులతో దీన్ని శబ్దాలను ప్రసారం చేసే విధంగానూ మార్చుకునే వీలుండటమూ గమనార్హం. అప్పుడు చప్పుళ్లను వినటమే కాదు, వాటిని బయటికీ వినిపించగలదు. ఇది వినికిడిలోపం వంటి సమస్యలు గలవారికి మేలు చేయగలదని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని