కొమ్ముల తోకచుక్క!

12పీ తోకచుక్క తీరే వేరు. ఇందులో చల్లటి అగ్నిపర్వతం దాగుంది మరి. సూర్యుడి వైపు వస్తున్న క్రమంలో పేలిపోయినప్పుడు దీనికి ‘కొమ్ములు మొలవటం’ విశేషం

Updated : 02 Aug 2023 02:34 IST

తోకచుక్క అనగానే ప్రకాశిస్తున్న పొడవైన తోక గుర్తుకొస్తుంది. మరి తోకతో పాటు కొమ్ములూ ఉంటే? నిజంగా విచిత్రమే కదా. 12పీ/పాన్స్‌-బ్రూక్స్‌ తోకచుక్క అంతరిక్షంలో అలాంటి అద్భుతాన్నే సృష్టిస్తోంది.

తోకచుక్క ఇన్‌ఫ్రారెడ్‌ దృశ్యం

12పీ తోకచుక్క తీరే వేరు. ఇందులో చల్లటి అగ్నిపర్వతం దాగుంది మరి. సూర్యుడి వైపు వస్తున్న క్రమంలో పేలిపోయినప్పుడు దీనికి ‘కొమ్ములు మొలవటం’ విశేషం. ఇది అంతరిక్షంలో అతి చల్లటి మాగ్మాను వెలువరిస్తూ, చిన్న నక్షత్రంలా మెరుస్తూ కనువిందు చేస్తోంది. మిగతా తోకచుక్కల మాదిరిగానే 12పీ/పాన్స్‌-బ్రూక్స్‌ కూడా ఘన కేంద్రకంతో ఏర్పడింది. మంచు, దుమ్ము, వాయువులతో నిండిపోయి ఉంది. అంతర్భాగంలోంచి వెలువడే దుమ్ము మేఘం (కోమా) దీని చుట్టూ అలముకొని ఉంది. కానీ ఇతర నక్షత్రాల్లా కాకుండా 12పీ కేంద్రకంలో వాయువు, మంచు చాలా దట్టంగా నిండి ఉండటం వల్ల అతి భీకరంగా పేలిపోయింది. దీంతో కేంద్రకం కవచంలో ఏర్పడిన పగుళ్లలోంచి మంచు ప్రవాహాలు ఉబికి వచ్చాయి. ఫలితంగా సుమారు 100 రెట్లు ఎక్కువ ప్రకాశంతో వెలిగిపోయింది. ఇది శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం కలిగించింది. అంతర్భాగంలోంచి విడుదలైన మంచు స్ఫటికాలు, గ్యాస్‌తో తోకచుక్క చుట్టుపక్కల భాగం ఉన్నట్టుండి బాగా ఉబ్బటం వల్ల సూర్యకాంతిని మరింత ఎక్కువగా భూమి వైపు ప్రతిఫలింప జేస్తోంది. కేంద్రకం చుట్టూ ఉండే కోమా భాగం ప్రస్తుతానికి సుమారు 2.30 లక్షల కిలోమీటర్ల వరకు విస్తరించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది 12పీ కేంద్రకం కన్నా 7వేల రెట్లు ఎక్కువ! ఆసక్తికరమైన విషయం ఏంటంటే- అస్తవ్యస్తమైన కోమా ఆకారం మూలంగా దీనికి కొమ్ములు మొలిచినట్టు కనిపించటం. పెల్లుబికి వచ్చే గ్యాస్‌ను కేంద్రకంలోని ఒక భాగం కొంతవరకు అడ్డుకోవటం వల్ల ఏర్పడిన గంటు దీనికి కారణం కావొచ్చని భావిస్తున్నారు. తోకచుక్క నుంచి వాయువు దూరం పోతున్నకొద్దీ ఇది పెరిగి, కొమ్ములు మరింత స్పష్టంగా కనిపిస్తాయని చెబుతున్నారు. గత 69 ఏళ్లలో ఇంత భీకరంగా ఈ తోకచుక్క పేలటం ఇదే తొలిసారి. మనకు తెలిసిన అతి సుదీర్ఘ కక్ష్య గల తోకచుక్కల్లో 12పీ ఒకటి. ఇది దాదాపు 71 ఏళ్లకు ఒకసారి సూర్యుడిని చుట్టి వస్తుంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ 21న సూర్యుడికి అత్యంత సమీపంలోకి వస్తుంది. మన భూమికి 2024, జూన్‌ 2న అత్యంత సమీపంలోకి వస్తుంది. అప్పుడు రాత్రిపూట ఆకాశంలో కనిపిస్తుంది.
* ఒక్క 12పీలోనే కాదు.. సౌరమండలంలో అత్యధిక అగ్నిపర్వత స్వభావం గల 29పీ/ష్వాస్‌మన్‌- వాచ్‌మన్‌(29పీ) తోకచుక్కలోనూ గత కొన్నేళ్లలో చాలా విస్ఫోటనాలు సంభవించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది కిందటి సంవత్సరం డిసెంబరులో అత్యంత భారీగా విస్ఫోటనం చెందింది. సుమారు 10లక్షల టన్నుల క్రయోమాగ్మాను అంతరిక్షంలోకి వెదజల్లింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని