Instagram: అశ్లీలతకు ఇన్‌స్టా చెక్‌.. ఆడవాళ్ల ఆన్‌లైన్‌ సేఫ్టీ కోసం కొత్త ఫీచర్‌!

ఆన్‌లైన్ వేధింపుల నుంచి ఆడవాళ్లకు రక్షణ కల్పించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ప్రైవసీ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం...

Updated : 25 Sep 2022 20:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ వేధింపులకు గురవుతున్న వారిలో మహిళలు, ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పలు కంపెనీలు ఆన్‌లైన్‌ భద్రతపై అవగాహన కల్పిస్తూనే, కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నాయి. ఫొటో/వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) కూడా ఆన్‌లైన్ వేధింపుల నుంచి ఆడవాళ్లకు రక్షణ కల్పించేందుకు కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. న్యూడిటీ ప్రొటెక్షన్‌ (Nudity Protection) పేరుతో పరిచయం చేయబోతున్న ఈ ఫీచర్‌ డైరెక్ట్‌ మెసేజ్‌ల ద్వారా వచ్చే అసభ్యకరమైన ఫొటోలను ఫిల్టర్‌ చేస్తుందట. ఇన్‌స్టాలోని హిడెన్ వర్డ్స్‌ (Hidden Words) తరహాలోనే ఈ ఫీచర్‌ పనిచేస్తుందని సమాచారం. ‘‘ఇన్‌స్టాలో వచ్చే మెసేజ్‌లు యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకుండా ఉండేలా నిపుణులతో కలిసి కొత్త ప్రైవసీ ఫీచర్లను అభివృద్ధి చేస్తున్నాం’’ అని మెటా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.  

ఈ ఫీచర్‌కు సంబంధించిన ఫొటోను అలెసాండ్రో ఫౌజీ అనే డెవలపర్ తన ట్విటర్‌ ఖాతాలో షేర్ చేశాడు. ‘‘ఇన్‌స్టాగ్రామ్‌ చాట్స్‌ కోసం న్యూడిటీ ప్రొటెక్షన్‌ను తీసుకొస్తుంది. ఇందులోని టెక్నాలజీ చాట్ సంభాషణల్లో షేర్‌ చేసే ఫొటోలు అభ్యంతరకరంగా ఉంటే వాటిని అవతలి వ్యక్తికి కనబడకుండా చేస్తుంది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఆన్‌లైన్ భద్రతకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌ ఇప్పటికే పేరెంటల్ సూపర్‌విజన్‌ (Parental Supervision), సెన్సిటివ్ కంట్రోల్ (Sensitive Control) వంటి ఫీచర్లను పరిచయం చేసింది. వీటితో పిల్లలు ఇన్‌స్టాలో ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు పర్యవేక్షించవచ్చు. వీటితోపాటు ఇన్‌స్టాలో యువత ఎక్కువ సమయం గడపకుండా ఉండేందుకు టేక్‌ ఏ బ్రేక్‌ (Take A Break) పేరుతో మరో ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్స్ ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగం నుంచి విరామం తీసుకుని కొంత సమయం తర్వాత తిరిగి ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని