Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్‌ డేటా ట్రాకింగ్‌.. నిజమెంత?

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను మెటా సంస్థ ట్రాక్ చేస్తున్నట్లు ఫెలిక్స్‌ క్రాస్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లేదా ఫేస్‌బుక్‌ యాప్‌ నుంచి ఏదైనా యూఆర్‌ఎల్‌ లింక్‌ ఓపెన్‌ చేసినప్పుడు మెటా సంస్థ యూజర్‌ డేటాను ట్రాక్‌ చేస్తున్నట్లు గుర్తించామని ఫెలిక్స్‌ తన బ్లాగ్‌తో పేర్కొ్న్నారు....

Published : 12 Aug 2022 19:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫొటో/వీడియో షేరింగ్‌ కోసం ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను ఉపయోగిస్తుంటారు. ఈ యాప్‌లో చాట్ బ్యాకప్‌ కోసం ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు మెటా సంస్థ వెల్లడించింది. తాజాగా ఐఓఎస్‌లో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను మెటా సంస్థ ట్రాక్ చేస్తున్నట్లు ఫెలిక్స్‌ క్రాస్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లేదా ఫేస్‌బుక్‌ యాప్‌ నుంచి ఏదైనా యూఆర్‌ఎల్‌ లింక్‌ ఓపెన్‌ చేసినప్పుడు మెటా సంస్థ యూజర్‌ డేటాను ట్రాక్‌ చేస్తున్నట్లు గుర్తించామని ఫెలిక్స్‌ తన బ్లాగ్‌తో పేర్కొన్నారు. పాస్‌వర్డ్‌‌, క్రెడిట్‌ కార్డ్ వంటి వాటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సేకరిస్తున్నాయని తెలిపారు. 

ఐఓఎస్‌ యూజర్లలో ఎక్కువ మంది డీఫాల్ట్‌ బ్రౌజర్‌గా సఫారీని ఉపయోగిస్తుంటారు. ఏదైనా యూఆర్‌ఎల్‌ లింక్‌పై క్లిక్ చేస్తే అది సఫారీ బ్రౌజర్‌లో ఓపెన్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లు మాత్రం సఫారీ బ్రౌజర్‌ కాకుండా తమ సొంత బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు తెలిపాయి. ఇందులో మెటా పిక్సెల్‌ అనే కోడ్‌ సాయంతో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో యూజర్ల ప్రతి కదలికను మెటా సంస్థ ట్రాక్‌ చేస్తోందని ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై మెటా సంస్థ స్పందించాల్సి ఉంది. మరోవైపు వెబ్‌సైట్‌, బ్రౌజర్లలో యూజర్‌ యాక్టివిటీ ట్రాక్‌ చేసేందుకు మెటా పిక్సెల్‌ కోడ్‌ను అభివృద్ధి చేసినట్లు ఆ సంస్థ డెవలపర్స్‌ పేజీలో పేర్కొనడం గమనార్హం. ఏదేమైనప్పటికీ, ఈ ఆరోపణలపై మెటా సంస్థ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే. 

ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌ మ్యాప్స్‌, రీల్స్‌తోపాటు ఇన్‌స్టా డ్యూయల్‌ పేరుతో కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసింది. మ్యాప్స్‌ సాయంతో యూజర్లు తమకు నచ్చిన ప్రాంతాలను చేరుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యాప్స్‌ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేసిన 15 నిమిషాల నిడివి ఉన్న వీడియోలు ఇకపై ఆటోమేటిగ్గా రీల్స్‌గా మారిపోతాయి. డ్యూయల్‌ ఫీచర్‌లో వెనుక కెమెరాతో వీడియోను రికార్డు చేస్తూనే.. సెల్ఫీ కెమెరాతో రికార్డు చేసే వ్యక్తి స్పందనను తెలియజేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని