రెండింటినీ కలిపి వాడేద్దాం!

మళ్లీ ఇంటి నుంచే పని చేయాల్సిన పరిస్థితి. నిత్యం ఫోన్‌, ల్యాపీలను యాక్సెస్‌ చేయాల్సిందే. అలాంటప్పుడు రెండింటినీ విడివిడిగా వాడడం ఎందుకు? రెండిటినీ కలిపి వాడేస్తే.. ఫోన్‌లో ఫైల్స్‌ని పీసీలోనే క్షణాల్లో యాక్సెస్‌ చేయాలంటే?..

Updated : 14 Apr 2021 17:09 IST

 ఫోన్‌ని పీసీలోకి తెచ్చే చిట్కాలు


 

మళ్లీ ఇంటి నుంచే పని చేయాల్సిన పరిస్థితి. నిత్యం ఫోన్‌, ల్యాపీలను యాక్సెస్‌ చేయాల్సిందే. అలాంటప్పుడు రెండింటినీ విడివిడిగా వాడడం ఎందుకు? రెండిటినీ కలిపి వాడేస్తే..? ఫోన్‌లో ఫైల్స్‌ని పీసీలోనే క్షణాల్లో యాక్సెస్‌ చేయాలంటే? పని సులభం అవుతుంది.. సమయం ఆదా అవుతుంది. మరైతే, ఫోన్‌ని డెస్క్‌టాప్‌లో యాక్సెస్‌ చేసేందుకు ఉన్న మార్గాలేంటి? ఓ లుక్కేద్దాం పదండి..

వెబ్‌ వాట్సాప్‌ మాదిరిగానే.. 

AirDroid: ఆండ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్లకు ఎంతో దగ్గరైన సర్వీసు ఎయిర్‌డ్రాయిడ్‌. వెబ్‌ వాట్సాప్‌ మాదిరిగానే క్షణాల్లో ఫోన్‌, పీసీలను జత చేసేయొచ్చు. సర్వీసులో సభ్యులై ఒక్కసారి ఫోన్‌ని పీసీకి కనెక్ట్‌ చేస్తే చాలు.. కేవలం ఫైల్స్‌ని ట్రాన్స్‌ఫర్‌ చేయడమే కాదు.. డెస్క్‌టాప్‌లోనే ఫోన్‌ ఆపరేట్‌ చేయొచ్చు. మెసేజ్‌లు చూడొచ్చు.. పంపొచ్చు. నోటిఫికేషన్స్‌ చెక్‌ చేయొచ్చు. పోగొట్టుకున్న ఫోన్‌ని వెతకడం.. ఫోన్‌ కెమెరాని యాక్సెస్‌ చేయడం దీంట్లోని ప్రత్యేక సౌకర్యాలు. డెస్క్‌టాప్‌లోనే యాప్‌లనూ రన్‌ చేయొచ్చు. ఫోన్‌లో డేటాని ఎప్పటికప్పుడు పీసీలోకి బ్యాక్‌అప్‌ చేయొచ్చు. అయితే, ఉచితం వెర్షన్‌లో కొన్ని సౌకర్యాలే అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం సర్వీసుని వాడితే అన్ని ఫీచర్స్‌ని పొందొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://web.airdroid.com/

ఇలా ఆలోచించి చూశారా?

గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌, వన్‌డ్రైవ్‌, బాక్స్‌.కామ్‌.. ఒక సిస్టమ్‌ నుంచి మరో దాంట్లోకి డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేసుకునేందుకు క్లౌడ్‌ సర్వీసుల్ని వాడుకోవచ్చు. ఉదాహరణకు ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ డ్రైవ్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ని వాడుకుని డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. ఎలాగంటే.. ఫోన్‌లో ఏదైనా ఫైల్‌ని పీసీలో పొందేందుకు ముందు ఫోన్‌లో ఉన్న ఫైల్‌ని గూగుల్‌ డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేయాలి. తర్వాత అదే డ్రైవ్‌ని పీసీలో ఓపెన్‌ చేసి ఫైల్‌ని డౌన్‌లోడ్‌ చేయొచ్చు. ఇదే మాదిరిగా అన్ని క్లౌడ్‌ సర్వీస్‌లను వాడుకోవచ్చు. అందుబాటులో ఉన్న అన్ని క్లౌడ్‌ సర్వీసులు మొబైల్‌ యాప్‌ల రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడేయడమే. ఒక్కో క్లౌడ్‌ సర్వీసులో కొంత మేరకు స్టోరేజ్‌ని ఉచితంగా పొందొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https:t.ly/2XFX6Fs

ఒకే నెట్‌వర్క్‌లో ఉంటే చాలు..

Feem: ఇప్పుడు ఇంచుమించు అందరి ఇళ్లలోనూ వై-ఫై నెట్‌వర్క్‌ని వాడేస్తున్నారు. మీరూ అదే కోవలోకి వచ్చేటట్టు అయితే ఇంట్లోని నెట్‌వర్క్‌ని వాడుకుని ఒక డివైజ్‌ నుంచి మరో దాంట్లోకి డేటాని క్షణాల్లో ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు. అందుకు ఈ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి చాలు. ఉదాహరణకు ఇంట్లో పీసీ, ఫోన్‌, ట్యాబ్‌, మ్యాక్‌.. ఇలా ఏవి వాడుతున్నప్పటికీ ఆయా పరికరాల్లో యాప్‌ లేదా అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. విండోస్‌, లినక్స్‌, మ్యాక్‌ ఓఎస్‌లను కూడా యాప్‌ సపోర్టు చేస్తుంది. ఒక్కసారి యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక దాన్ని రన్‌ చేస్తే చాలు. నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉన్న అన్ని డివైజ్‌లు కనిపిస్తాయి. ఇక దేంట్లోకైనా డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేయడం క్షణాల్లో సాధ్యం. ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా ఆఫ్‌లైన్‌లోనూ డేటాని పంపుకోవచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://feem.io/#download

మెసెంజర్‌లనీ వాడుకోవచ్చు..

యాప్‌లు, వెబ్‌ సర్వీసుల వరకూ ఎందుకు? అనివార్యమైనప్పుడు అప్పటికే వాడుతున్న మెసెంజర్‌ల నుంచి కూడా డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు. ఎలాగంటే.. వాట్సాప్‌ మెసెంజర్‌లో మీరు మాత్రమే ఉన్న గ్రూపు ఒకటి క్రియేట్‌ చేసుకోండి. ఫోన్‌లోని డేటాని మీ ‘సెల్ఫ్‌ గ్రూప్‌’లో షేర్‌ చేయండి. తర్వాత సిస్టంలో వెబ్‌ వాట్సాప్‌ ఓపెన్‌ చేసి అదె సెల్ఫ్‌ గ్రూపులోకి వెళ్లి అక్కడ పోస్ట్‌ చేసిన ఫైల్స్‌ని సిస్టంలోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇదే మాదిరిగా Slack, Skypeలలోనూ ఫైల్స్‌ని షేర్‌ చేసుకుని ఎక్కడ కావాలన్నా పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని