Twitter: ఫొటో డిస్‌క్రిప్షన్‌ మర్చిపోయారా..? ట్విటర్‌ గుర్తుచేస్తుంది!

ట్విటర్‌లో ఫొటో పోస్ట్‌ చేసేప్పుడు డిస్‌క్రిప్షన్‌ యాడ్ చేయడం మర్చిపోతే యూజర్‌కు గుర్తుచేసేలా కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. దానితో కస్టమ్‌-బిల్ట్‌ టైమ్‌లైన్‌ పేరుతో మరో ఫీచర్‌ కూడా అందుబాటులోకి రానుంది... 

Updated : 16 Jul 2022 15:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అత్యవసర సమయాల్లో సహాయం కోసమో లేదా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు అందించే సేవల్లో ఏదైనా లోపం ఉంటే సంబంధిత శాఖ మంత్రులు, అధికారులకు తెలిసేలా ట్విటర్‌లో వారిని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేస్తుంటారు. దీంతో వారు సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతుంటారు. మనసులోని భావాలను ఇతరులతో పంచుకునేందుకు తీసుకొచ్చిన ట్విటర్‌.. నేడు సమస్యల పరిష్కారానికి మాధ్యమంగా ఉపయోగపడుతుండటం గమనార్హం. ట్విటర్‌ కూడా యూజర్ల అవసరాలకు అనుగుణంగా వారికి అనువైన, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తుంటుంది. తాజాగా  మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌ యూజర్లు ట్విటర్‌లో ఫొటో పోస్ట్‌ చేసే ముందు దానికి సంబంధించిన సమాచారం యాడ్ చేయమని గుర్తుచేస్తుంది. ప్రస్తుతం పది శాతం మంది యూజర్లతో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు ట్విటర్‌ తెలిపింది. త్వరలోనే పూర్తిస్థాయిలో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. 

యూజర్లు ఫొటో ట్వీట్‌ చేసేటప్పుడు వాటికి డిస్‌క్రిప్షన్‌ యాడ్ చేయడం వల్ల సాధారణ యూజర్లతోపాటు, ఫొటో గురించి మరింత సమాచారం తెలుసుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుందని ట్విటర్‌ తెలిపింది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక యూజర్లు సెట్టింగ్స్‌లో యాక్సస్‌బులిటీలోకి వెళితే ఇమేజెస్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే డిస్‌క్రిప్షన్‌ రిమైండర్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని ఎనేబుల్ చేస్తే మీరు ఫొటో ట్వీట్ చేసే ప్రతిసారి దానికి డిస్‌క్రిప్షన్‌ యాడ్‌ చేయమనే రిమైండర్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ప్రస్తుతం ఫొటో ట్వీట్‌లో ఫొటో అప్‌లోడ్ చేసిన తర్వాత కింద యాడ్‌ డిస్‌క్రిప్షన్‌ ఆప్షన్‌ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ఫొటోకు సంబంధించిన సమాచారం యాడ్ చేయొచ్చు. ఫొటోకు డిస్‌క్రిప్షన్‌ ఉందని యూజర్‌కు తెలిసేలా ఫొటోపై ఎడమవైపు కింద చివర ఆల్ట్‌ (ALT) అని కనిపిస్తుంది. 

ఈ ఫీచర్‌తో పాటు ట్విటర్‌ కస్టమ్‌-బిల్ట్‌ టైమ్‌లైన్స్‌ (Custom-Built Timelines) పేరుతో మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. యూజర్‌ ట్విటర్‌లో వెతికే సమాచారం, అనుసరించే వారి ఖాతాల ఆధారంగా కంటెంట్‌ ముందుగా యూజర్‌కు ఈ టైమ్‌లైన్‌లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అమెరికా, కెనడాలోని యూజర్ల ద్వారా పరీక్షిస్తున్నారు. త్వరలోనే అన్ని రీజియన్లలో యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని ట్విటర్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని