Twitter: ఒకే ట్వీట్‌లో ఫొటో, గిఫ్‌, వీడియో.. ట్విటర్‌ కొత్త ఫీచర్‌!

ట్విటర్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో ఫొటో, వీడియో లేదా గిఫ్‌ మూడు మీడియా ఫైల్స్‌ను ఒకేసారి టెక్ట్స్‌తోపాటు ట్వీట్‌ చేయొచ్చు...

Published : 02 Aug 2022 11:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా యాప్‌లలో ట్విటర్‌ ప్రత్యేకం. ఇతర యాప్‌లలో మాదిరి ఇందులో పేరాలకు పేరాల సమాచారం టైప్ చేయలేం. ఒక ట్వీట్‌ 280 పదాలకు మించితే దానికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేయాల్సిందే. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా నోట్స్‌ పేరుతో కొత్త ఫీచర్‌ను ట్విటర్‌ పరిచయం చేయనుంది. అలానే ట్వీట్‌ తర్వాత దాన్ని ఎడిట్ చేసుకునేందుకు వీలుగా ఎడిట్‌ ట్వీట్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఇప్పటివరకు ఫొటో, వీడియో లేదా గిఫ్‌.. మూడింటింలో ఏదో ఒక మీడియా ఫైల్‌ను మాత్రమే టెక్ట్స్‌తోపాటు ట్వీట్‌ చేసే అవకాశం ఉంది. కొత్తగా రాబోతున్న ఫీచర్‌తో ఈ మూడు మీడియా ఫైల్స్‌ను ఒకేసారి టెక్ట్స్‌తోపాటు ట్వీట్‌ చేయొచ్చు. ఫొటో, వీడియో, గిఫ్‌ మూడింటిని కలిపి ట్వీట్ చేయొచ్చన్నమాట. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలోని యూజర్స్‌తో పరీక్షిస్తున్నారు. 

‘‘ట్విటర్‌ ఉపయోగించే యూజర్స్‌లో ఎక్కువ మంది విజువల్స్‌ సాయంతో సంభాషించుకుంటున్నట్లు గుర్తించాం. ఎక్కువగా ఫొటోలు, గిఫ్‌లు, వీడియోలను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మూడు రకాల మీడియాలను ఒకేసారి ట్వీట్ చేయలేరు. త్వరలో పరిచయం చేయనున్న ఫీచర్‌తో యూజర్స్‌  మూడు ఫార్మాట్లలోని మీడియాఫైల్స్‌ను ఒకేసారి ట్వీట్ చేయొచ్చు. అక్షరాలతో చెప్పలేని ఎన్నో భావాలను మీడియాఫైల్స్‌తో మరింత సమవర్ధవంతంగా వ్యక్తపరచగలరు’’ అని ట్విటర్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫీచర్‌తోపాటు ఫొటో డిస్క్రిప్షన్‌, కస్టమ్‌-బిల్ట్‌ టైమ్‌లైన్స్‌ పేరుతో కొత్త ఫీచర్లను కూడా ట్విటర్‌ పరీక్షిస్తోంది. ఫొటో డిస్క్రిప్షన్‌తో ట్వీట్‌లో పోస్ట్‌ చేసే ఫొటోకు సమాచారం యాడ్ చేయమని యూజర్‌కు గుర్తుచేస్తుంది. కస్టమ్‌-బిల్ట్‌ టైమ్‌లైన్స్‌తో ట్విటర్‌లో యూజర్ వెతికే సమాచారం, అనుసరించే ఖాతాల ఆధారంగా కంటెంట్‌ను చూపిస్తుంది. ఈ మూడు ఫీచర్లు పరీక్షల అనంతరం యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని