WhatsApp: కొత్త ఆప్షన్‌తో డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్‌.. ప్రివ్యూ ఫీచర్‌తో మెసేజ్‌ రియాక్షన్స్‌!

వాట్సాప్ మరో రెండు కొత్త ఫీచర్లను పరీక్షిస్తోంది. డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్‌తో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ మెసేజ్‌లను డిలీట్ చేయడంతోపాటు, మెసేజ్‌ రియాక్షన్స్‌కు ప్రివ్యూ ఫీచర్‌ను పరిచయం చేయనుంది... 

Updated : 12 Aug 2022 14:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గతేడాది వాట్సాప్‌ (WhatsApp) ప్రైవసీ ఫీచర్లలో భాగంగా డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌ (Delete For Everyone) ఫీచర్‌ను పరిచయం చేసింది. యూజర్లు మెసేజ్‌ పంపిన తర్వాత డిలీట్ పర్‌ ఎవ్రీవన్‌ ఫీచర్‌తో నిర్ణీత కాలవ్యవధిలో మెసేజ్‌లను డిలీట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టైమ్‌ లిమిట్‌ 1 గంట 8 నిమిషాల 16 సెకన్లుగా ఉంది. కొత్త అప్‌డేట్‌లో ఈ టైమ్‌ లిమిట్‌ను రెండు రోజుల 12 గంటలకు పెంచనున్నారు. దీంతో ఇతరులకు పంపిన మెసేజ్‌లు రెండు రోజుల 12 గంటల తర్వాత కూడా తమ చాట్ పేజీతోపాటు అవతలి వ్యక్తి చాట్ పేజీ నుంచి కూడా డిలీట్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఈ ఫీచర్‌ ద్వారా ఒక మెసేజ్‌ను మాత్రమే డిలీట్ చేసుకునే వెసులుబాటు ఉంది. వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్‌తో డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌ ద్వారా ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ మెసేజ్‌ల (Bulk Message or Multiple Chats)ను తన చాట్‌ పేజీతో పాటు అవతలి వ్యక్తి చాట్‌ పేజీ నుంచి కూడా డిలీట్ చేయొచ్చు. 

బల్క్‌ మెసేజ్‌ డిలీట్

వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్‌ ఏదైనా మెసేజ్‌పై క్లిక్ చేస్తే డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌ ఫీచర్‌తోపాటు, అదనంగా ఈ ఫీచర్‌ను ఇతర మెసేజ్‌లకు వర్తింపచేయాలా (Apply this Message time to existing chats) అని అడుగుతూ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఒకేసారి రెండు రోజుల 12 గంటలలోపు పంపిన మెసేజ్‌లను చూపిస్తుంది. వాటిని సెలెక్ట్ చేసి ఒకేసారి డిలీట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ వాట్సాప్‌ బీటా వెర్షన్‌ 2.22.16.8 ద్వారా ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో యూజర్లకు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది.  

ప్రివ్యూ రియాక్షన్‌

వాట్సాప్ మెసేజ్‌ రియాక్షన్ ఫీచర్‌తో చాట్ విండోలోని మెసేజ్‌లకు ఎమోజీలతో మన స్పందన తెలియజేయవచ్చు. ఇప్పటి వరకు ఈ ఫీచర్‌లో ఆరు ఎమోజీలు మాత్రమే ఉన్నాయి. త్వరలోనే వాట్సాప్‌లోని అన్ని ఎమోజీలు యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. దీనికి సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్‌ను వాబీటాఇన్ఫో వెల్లడించింది. వాట్సాప్ రియాక్షన్‌ ఫీచర్‌ ద్వారా ఎమోజీలతో యూజర్లు రిప్లై ఇస్తే ఆ జాబితా ఇకపై చాట్‌ పేజీలో పైన కనిపించేలా మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం యూజర్‌ ఎమోజీ రియాక్షన్‌తో రిప్లై ఇచ్చినా తెలియదు. చాట్ పేజీ ఓపెన్‌ చేసి సదరు మెసేజ్‌ను చూస్తేనే ఎమోజీ రియాక్షన్‌తో రిప్లై ఇచ్చినట్లు తెలుస్తుంది. కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్‌తో చాట్ పేజీ, గ్రూప్స్‌లో ఏయే మెసేజ్‌లకు ఎమోజీ రియాక్షన్‌తో రిప్లై ఇచ్చారో వాటి జాబితా చాట్‌ పేజీ పై భాగంలో కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌ 2.22.16.5 ద్వారా బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. పరీక్షల అనంతరం యూజర్లకు పరిచయం చేయనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు