WhatsApp: అదనపు డివైజ్‌లో వాట్సాప్‌ కావాలా..? అయితే ఇలా తప్పక చేయాల్సిందే!

వాట్సాప్‌లో జరిగే సంభాషణల నుంచి షేర్‌ చేసే మీడియా ఫైల్స్‌కు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ భద్రత ఉన్నట్లే.. యూజర్ల వాట్సాప్‌ ఖాతా వివరాలు ఇతరుల చేతికి చిక్కకుండా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది.

Published : 05 Jun 2022 19:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌లో జరిగే సంభాషణల నుంచి షేర్‌ చేసే మీడియా ఫైల్స్‌ వరకు మూడో కంటికి తెలియకుండా ఉండేందుకు కంపెనీ ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌తో భద్రత కల్పిస్తోంది. అదేవిధంగా యూజర్ల వాట్సాప్‌ ఖాతా వివరాలు ఇతరుల చేతికి చిక్కకుండా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇందులో భాగంగా యూజర్‌ తన వాట్సాప్‌ ఖాతాలోకి లాగిన్ అయ్యేప్పుడు డబుల్ వెరిఫికేషన్‌ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌తో ఖాతాదారులకు అదనపు భద్రత లభిస్తుందని వాట్సాప్‌ కమ్యూనిటి బ్లాగ్‌ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ బీటా వెర్షన్‌ను ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. 

ఎలా పనిచేస్తుందంటే..

యూజర్‌ ఏదైనా కొత్త డివైజ్‌లో వాట్సాప్‌ ఖాతాను లాగిన్ చేయాలనుకుంటే సాధారణంగా వెరిఫికేషన్‌ కోసం పంపే ఎస్సెమ్మెస్‌తోపాటు అదనంగా మరో వెరిఫికేషన్‌ కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే కొత్త డివైజ్‌లో వాట్సాప్‌ కోసం యూజర్‌ ఫోన్‌ నంబర్‌ టైప్‌ చేసి వెరిఫికేషన్‌ కోడ్‌ ఎంటర్‌ చేసిన వెంటనే స్క్రీన్‌ మీద పాప్‌-అప్‌ మెసేజ్‌ కనిపిస్తుంది. ‘‘ మీరు టైప్‌ చేసిన నంబర్‌తో వాట్సాప్‌ ఖాతాను మరో డివైజ్‌లో ఉపయోగిస్తున్నారు. ఒకవేళ కొత్త డివైజ్‌లో కూడా ఉపయోగిస్తుంది మీరే అయితే.. మరో వెరిఫికేషన్‌ కోడ్‌ ఎంటర్‌ చేయాలి. ప్రస్తుతం మీరు ఎంటర్‌ చేసిన కోడ్‌ టైమర్‌ ముగిసిన వెంటనే మరో వెరిఫికేషన్‌ వస్తుంది. అప్పటి వరకు వరకు వేచి చూడండి’’ అని ఉంటుంది. తర్వాత యూజర్‌ మొబైల్‌కు వచ్చే రెండో వెరిఫికేషన్‌ కోడ్‌ను టైప్‌ చేస్తేనే యూజర్లు మరో డివైజ్‌లో వాట్సాప్‌ను ఉపయోగించుకోగలరని వాబీటాఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్‌తో యూజర్ల వాట్సాప్‌ ఖాతాలు హ్యాక్‌ అవ్వకుండా అడ్డుకోవడంతోపాటు, వాట్సాప్‌ ద్వారా జరిగే మోసాలను అరికట్టవచ్చని వాట్సాప్ భావిస్తోంది. అలానే యూజర్లు తమ మొబైల్‌కు వచ్చే వెరిఫికేషన్‌ కోడ్‌లను ఇతరులతో షేర్‌ చేసుకోవద్దని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. 

ఇదేకాకుండా వాట్సాప్‌ అన్‌డూ మెసేజ్‌ డిలీషన్‌, మెసేజ్‌ ఎడిట్‌ వంటి రెండు కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనుంది. వీటిలో అన్‌డూ మెసేజ్‌ డిలీషన్‌ ఫీచర్‌తో యూజర్లు చాట్‌లో అనుకోకుండా డిలీట్‌ చేసిన మెసేజ్‌లను మళ్లీ రీస్టోర్‌ చేసుకోవచ్చు. మెసేజ్‌ ఎడిట్‌ ఫీచర్‌తో వాట్సప్‌లో ఏదైనా మెసేజ్‌ పంపిన తర్వాత తప్పలు ఉంటే వాటిని సరిచేసుకోవచ్చు. మెసేజ్‌ను పంపిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేస్తే కాపీ, ఫార్వార్డ్ ఆప్షన్లతోపాటు ఎడిట్ అనే ఆప్షన్‌ కూడా కనిపిస్తుందట. ప్రస్తుతం ఈ రెండు ఫీచర్లు కూడా పరీక్షల దశలో ఉన్నాయి. త్వరలోనే వీటిని యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని