Updated : 30 Oct 2021 05:05 IST

Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం

గుండెపోటుతో కన్నడ పవర్‌స్టార్‌ కన్నుమూత

ఈనాడు డిజిటల్‌-బెంగళూరు, న్యూస్‌టుడే- బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ): కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ (46) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య అశ్వినీ రేవంత్‌, ఇద్దరు కుమార్తెలు ధృతి, వందిత ఉన్నారు. శుక్రవారం ఉదయం తన ఇంట్లోని జిమ్‌లో రెండు గంటల నుంచి వ్యాయామం చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో, సమీపంలోనే కుటుంబ వైద్యుడి క్లినిక్‌లో ప్రాథమిక చికిత్స పొందారు. అప్పుడే వైద్యులు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే విక్రమ్‌ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆసుపత్రికి వెళ్లేలోపే ఆయనకు మరోసారి తీవ్రమైన గుండెపోటు వచ్చిందని సన్నిహితులు తెలిపారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ పరిస్థితి విషమంగా ఉందని, ఆయన ప్రాణాల్ని కాపాడేందుకు కృషిచేస్తున్నామని గుండె వైద్య నిపుణుడు డాక్టర్‌ రంగనాథ్‌ నాయక్‌ తొలుత వెల్లడించారు. అప్పటికే వేలమంది అభిమానులు, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, మంత్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపటికే సోదరులు శివరాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, ఇతర కుటుంబసభ్యులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు కూడా వచ్చారు. మధ్యాహ్నం 2.20 గంటలకు పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూసినట్లు ప్రకటించారు.

లోహిత్‌.. పునీత్‌.. అప్పు

కన్నడ కంఠీరవుడు డాక్టర్‌ రాజ్‌కుమార్‌ చిన్నకుమారుడు పునీత్‌ ఆరునెలల వయస్సులోనే బాలనటుడిగా సినీ రంగంలోకి ప్రవేశించి, క్రమంగా అగ్రస్థానానికి చేరుకున్నారు. 1975 మార్చి 17న చెన్నైలో జన్మించిన పునీత్‌కు తొలుత లోహిత్‌ అనే పేరు పెట్టారు. కానీ, ఆ పేరుతో అల్పాయుష్కుడు అవుతాడని పండితులు చెప్పడంతో పునీత్‌ అని పేరు మార్చారు. అందరూ ‘అప్పు’ అనే పిలిచేవారు. భక్తప్రహ్లాద, ఎరడు నక్షత్రగళు సినిమాలకు ఉత్తమ బాలనటుడిగా పురస్కారాలు లభించాయి. 2002లో అప్పు సినిమాతోనే హీరోగా నటప్రయాణం మొదలుపెట్టారు.

* పునీత్‌ రాజ్‌కుమార్‌తో సినిమా అంటే తమకు లాభమని నిర్మాతలు అంటారు. కథ నచ్చితేగానీ అంగీకరించేవారు కాదంటారు. అందుకే.. ఏడాదికి ఒకటి రెండు సినిమాలకే పరిమితమయ్యేవారు. ఆయన నటించిన జేమ్స్‌, ద్వైత సినిమాలు ఇంకా విడుదల కావాలి. పునీత్‌ రాజ్‌కుమార్‌కు నేపథ్య గాయకుడిగా మంచి పేరుండేది. పాటలతో వచ్చే ఆదాయాన్ని సమాజసేవకే వినియోగించేవారు. నిర్మాతగా నాలుగు సినిమాలు అందించారు. మరో మూడు నిర్మాణదశలో ఉన్నాయి. 2012లో ఓ ప్రైవేటు ఛానల్‌ రూపొందించిన ‘కన్నడద కోట్యాధిపతి’ (మీలో ఎవరు కోటీశ్వరుడు) రియాలిటీ షో అత్యంత ప్రజాదరణ పొందింది.

* బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో అంతిమ దర్శనానికి ఏర్పాట్లుచేశారు. పునీత్‌ రెండో కుమార్తె అమెరికా నుంచి రావాల్సి ఉండటంతో ఆదివారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక్‌ ప్రకటించారు.


ఉదయమే మరణించారా?

శుక్రవారం ఉదయం 10:30 గంటలకే పునీత్‌ మరణించారన్నది మరో సమాచారం. ఆ సమయానికి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పాల్గొనాల్సిన ఓ కార్యక్రమాన్ని ఉన్నట్టుండి రద్దుచేశారు. అక్కడి నుంచి బొమ్మై విక్రమ్‌ ఆస్పత్రికి చేరుకున్నారు.

* పునీత్‌ మృతి విషయం తెలిసి అభిమాని మునియప్ప గుండెపోటుతో మృతి చెందాడు.

* పునీత్‌ మరణానికి సంతాపంగా మూడురోజుల పాటు కర్ణాటకలో మద్యనిషేధం అమలుచేశారు. పలు విద్యాసంస్థలు పరీక్షలను వాయిదావేశాయి. థియేటర్లను మూసివేశారు.


ప్రముఖుల నివాళి

విధి ఎంతో క్రూరమైన మలుపు తిప్పిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మంత్రులు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తదితరులతో పాటు తెలుగు సినీరంగ ప్రముఖులు పునీత్‌ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.


 


Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని