Higher pension: అధిక పింఛను ఆశావహులకు కాస్త ఊరట

ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌) అధిక పింఛను ఆశావహులకు ఊరట లభించింది. రవూర్కెలా కార్యాలయం ప్రతిపాదించిన పార్ట్‌-1, పార్ట్‌-2 విధానాన్ని ఈపీఎఫ్‌వో పక్కన పెట్టింది.

Updated : 15 Dec 2023 14:22 IST

రవూర్కెలా ఫార్ములాను పక్కన పెట్టిన ఈపీఎఫ్‌వో
ఈపీఎస్‌ పేరా 12 ప్రకారమే పింఛను లెక్కించాలని స్పష్టత

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌) అధిక పింఛను (Higher pension) ఆశావహులకు ఊరట లభించింది. రవూర్కెలా కార్యాలయం ప్రతిపాదించిన పార్ట్‌-1, పార్ట్‌-2 విధానాన్ని ఈపీఎఫ్‌వో పక్కన పెట్టింది. ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌) పేరా 12 కింద పేర్కొన్న ఫార్ములా ప్రకారమే పింఛను అందిస్తామని స్పష్టం చేసింది. దీంతో అర్హులందరికీ కొంత ఉపశమనం కలిగినట్లే. గౌరవప్రదమైన పింఛను లభించేందుకు మార్గం సుగమమైంది. దరఖాస్తులు పరిశీలించిన తరువాత అర్హత కలిగిన విశ్రాంత ఉద్యోగులకు పదవీ విరమణ తేదీ నుంచి.. పింఛను మంజూరయ్యే సమయం వరకు రావాల్సిన నెలవారీ పింఛను బకాయిల మొత్తంపై ఆదాయపన్ను (టీడీఎస్‌) మినహాయిస్తామని ప్రకటించింది. ఈ మేరకు అర్హతలపై ఈపీఎఫ్‌వో వివరణ ఇచ్చింది. పింఛను లెక్కింపుపై స్పష్టత రావడంతో ప్రాంతీయ కార్యాలయాలు దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను మొదలు పెట్టాయి. డిమాండ్‌ నోటీసుల మేరకు ఈపీఎస్‌ బకాయిలు చెల్లించిన విశ్రాంత ఉద్యోగులకు త్వరలోనే పింఛను మంజూరు పత్రాలు జారీచేసి, బకాయిలు విడుదల చేసేందుకు కార్యాచరణ చేపట్టాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా సమర్పించిన దరఖాస్తులను ఏకపక్షంగా తిరస్కరించబోమని.. అవసరమైన పత్రాలన్నీ ఉద్యోగి లేదా యజమాని నుంచి తీసుకుని పరిశీలిస్తామని వెల్లడించింది. ఒకవేళ అర్హత లేకుంటే దరఖాస్తులు తిరస్కరిస్తామని పేర్కొంది.

ఈపీఎఫ్‌వో ఏం చెప్పిందంటే..

  • ఉదాహరణకు ఒక ఉద్యోగి 2014 సెప్టెంబరు 1కన్నా ముందు పదవీ విరమణ చేశారనుకుందాం. ఆ ఉద్యోగికి పింఛను చెల్లింపు 2014 సెప్టెంబరు 1కి ముందు ప్రారంభమవుతుంది. అప్పుడు ఆయన చివరి 12 నెలల వేతన సగటు ఆధారంగా పింఛను లెక్కిస్తారు.
  • మరో ఉద్యోగి 2014 సెప్టెంబరు 1 కన్నా ముందు.. 58 ఏళ్ల వయసు నిండకుండానే ఉద్యోగ విరమణ చేశారనుకుందాం. అలాగే మరో కేసులో ఉద్యోగి 2014 సెప్టెంబరు 1 తరువాత 58 ఏళ్లు నిండాక పదవీ విరమణ చేశారనుకుందాం. వీరిద్దరికీ 2014 సెప్టెంబరు 1 తరువాత నుంచి పింఛను ప్రారంభమయ్యే పరిస్థితి ఉంటుంది కనుక.. వారి చివరి 60 నెలల సగటు వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని పింఛను లెక్క కడతారు.
  • ‘ఎ’ అనే ఒక ఉద్యోగి ఓ సంస్థలో 2015 జనవరి 1 నాటికి 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేశారనుకుందాం. అప్పుడు ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం ఆయన పదవీ విరమణ వయసును 60 ఏళ్లుగా కాకుండా.. 58 ఏళ్లుగానే లెక్కిస్తారు. ఎందుకంటే ఆ ఉద్యోగికి 58 ఏళ్లు నిండగానే ఈపీఎస్‌ నుంచి బయటకు వచ్చేసినట్లే. దీని ప్రకారం ఆయన ఉద్యోగ విరమణ 2014 సెప్టెంబరు 1 కన్నా ముందుగానే అయినట్లు పరిగణిస్తారు. దీంతో ఈపీఎస్‌ నుంచి బయటకు వచ్చిన నాటికి చివరి 12 నెలల వేతన సగటు తీసుకుని పింఛను అర్హత వేతనాన్ని ఖరారు చేస్తారు.
  • ఉదాహరణకు ‘బి’ అనే ఉద్యోగి ఓ సంస్థలో 50 ఏళ్లకే (2012 జనవరి 1 నాటికి) ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు 58 ఏళ్ల తర్వాత నుంచి.. అంటే 2014 సెప్టెంబరు 1 తరువాత పింఛను ప్రారంభమవుతుంది. అందువల్ల ఉద్యోగ విరమణ చేసిన నాటికి చివరి 60 నెలల సగటు వేతనాన్ని తీసుకుని పింఛను లెక్కిస్తారు.
  • ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఒక ఉద్యోగి 2030లో పదవీ విరమణ చేస్తారనుకుంటే, ఆయన పదవీ విరమణ చేసిన తరువాత పింఛను లెక్కింపు ప్రారంభమయ్యే నాటికి ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌)-1995 చట్టంలో అప్పటికి అమల్లో ఉన్న నిబంధనల మేరకు పింఛను లెక్కిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని