Telangana News: అప్పు మార్పిడి రుణాలేవీ?

ఇటీవల  అప్పులబాధ భరించలేక ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్దపోచారం గ్రామానికి చెందిన  రైతు కాశిమల్ల వీరయ్య(58) పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయనకు రెండెకరాల భూమి ఉండగా  సాగుకు గతంలో అప్పులు చేశారు. వాటిని తీర్చడానికి నాలుగేళ్ల క్రితం ఎకరా భూమిని అమ్మేశారు. మిగిలిన ఎకరంతో పాటు మరో ఎకరం కౌలుకు తీసుకుని మిరప సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో పంటల పెట్టుబడి, కుటుంబ అవసరాలకు రూ.6 లక్షల వరకు అప్పులయ్యాయి. తీర్చే

Updated : 09 May 2022 04:25 IST

రైతులకు రూ.1,770 కోట్లు ఇవ్వాలని నిర్దేశించిన రాష్ట్ర బ్యాంకర్ల సమితి
10 శాతం కూడా ఇవ్వని బ్యాంకులు
అన్నదాతల ప్రైవేటు అప్పుల భారం తీర్చే పథకంపై నిర్లక్ష్యం
ఈనాడు - హైదరాబాద్‌

టీవల  అప్పులబాధ భరించలేక ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్దపోచారం గ్రామానికి చెందిన  రైతు కాశిమల్ల వీరయ్య(58) పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయనకు రెండెకరాల భూమి ఉండగా  సాగుకు గతంలో అప్పులు చేశారు. వాటిని తీర్చడానికి నాలుగేళ్ల క్రితం ఎకరా భూమిని అమ్మేశారు. మిగిలిన ఎకరంతో పాటు మరో ఎకరం కౌలుకు తీసుకుని మిరప సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో పంటల పెట్టుబడి, కుటుంబ అవసరాలకు రూ.6 లక్షల వరకు అప్పులయ్యాయి. తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా అప్పులు తీసుకుని ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు ఓ పథకం ఉంది. కానీ అది నత్తనడకన అమలవుతోంది.

ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి తీసుకున్న రుణాల నుంచి రైతులకు విముక్తి కల్పించే పథకం రాష్ట్రంలో పది శాతం కూడా ఆచరణకు నోచుకోలేదు. ప్రైవేటు రుణాలు తీర్చడానికి వీలుగా ఎలాంటి పూచీకత్తు లేకుండా అన్నదాతలకు అప్పు మార్పిడి రుణం(డెబిట్‌ స్వాపింగ్‌ లోన్‌ -డీఎస్‌ఎల్‌) ఇవ్వాలన్న రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) ఆదేశాలు నిరాదరణకు గురయ్యాయి. నిబంధనల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో డీఎస్‌ఎల్‌ కోటా కింద రైతులకు రూ.1,770 కోట్లు (మొత్తం పంట రుణాల్లో 3%) ఇవ్వాలని ‘రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి’(ఎస్‌ఎల్‌బీసీ) అన్ని బ్యాంకులకు రుణ లక్ష్యాలను నిర్దేశించింది. ఆర్థిక సంవత్సరం పూర్తయినా ఈ మొత్తంలో 10 శాతం కూడా ఇవ్వలేదని తాజాగా అధికార వర్గాలు అంచనాకు వచ్చాయి. ప్రైవేటు అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్న తరుణంలో ఈ పథకంపై దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

డీఎస్‌ఎల్‌ కోటా కింద రుణాల పంపిణీ పెద్దగా జరగలేదని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సాంకేతిక కమిటీ కన్వీనర్‌, తెలంగాణ సహకార అపెక్స్‌ బ్యాంకు(టెస్కాబ్‌) ఎండీ నేతి మురళీధర్‌ ‘ఈనాడు’కు చెప్పారు. ఈ కోటా కింద రుణాలిస్తారనే విషయంపై రైతులకు, బ్యాంకుల సిబ్బందికి పెద్దగా అవగాహన లేకపోవడంతోనే పంపిణీ చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.

పంట రుణాల్లోనూ నిబంధనలు పాటించని బ్యాంకులు

రైతుకు ఉన్న పొలాన్ని బట్టి రూ.లక్షా 60 వేల వరకూ ఎలాంటి పూచీ లేకుండా, పూచీకత్తుతో రూ.3 లక్షల వరకూ పంటరుణం ఇవ్వాలని ఆర్‌బీఐ ఆదేశాలున్నాయి. (ఈ ఆర్థిక సంవత్సరంలో వరి సాగుకు ఎకరాకు రూ.40 వేల రుణం ఇవ్వాలని బ్యాంకర్ల సమితి నిర్ణయించింది) అయినా పట్టాదారు పాసుపుస్తకాలను పూచీకత్తుగా పెట్టుకునే రుణాలిస్తున్నారని, గరిష్ఠంగా రూ.లక్షకు మించి ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.59 వేల కోట్ల పంట రుణాలివ్వాల్సి ఉండగా.. గత ఏడాది డిసెంబరు 31 నాటికి 53 శాతమే పంపిణీ చేశారు.

తిరస్కరిస్తే ఫిర్యాదు చేయవచ్చు

రైతుకు బ్యాంకులో పంట రుణానికి సంబంధించి పాత బాకీ ఉన్నా సరే ప్రైవేటు అప్పులు తీర్చడానికి అదనంగా రుణాలివ్వాలని ఆర్‌బీఐ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. డీఎస్‌ఎల్‌ కింద రుణం ఇవ్వడానికి తిరస్కరిస్తే స్థానిక లోక్‌అదాలత్‌లో ఫిర్యాదు చేయాలని హైకోర్టు సైతం తీర్పు ఇచ్చింది. అయితే ఎక్కువ మంది రైతులకు ఈ విషయం తెలియక బ్యాంకులపై ఫిర్యాదులేమీ చేయడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని