యాదాద్రి విద్యుత్‌ కేంద్ర వాయుకాలుష్య ప్రభావంపై అధ్యయనం

యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణంతో చుట్టుపక్కల 25 కి.మీ.ల పరిధిలో ఉండే వాయుకాలుష్య ప్రభావం తదితర అంశాలపై మరోసారి సమగ్రంగా అధ్యయనం చేయాలని రాష్ట్ర జెన్‌కో నిర్ణయించింది.

Published : 08 Oct 2022 02:40 IST

జెన్‌కో నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణంతో చుట్టుపక్కల 25 కి.మీ.ల పరిధిలో ఉండే వాయుకాలుష్య ప్రభావం తదితర అంశాలపై మరోసారి సమగ్రంగా అధ్యయనం చేయాలని రాష్ట్ర జెన్‌కో నిర్ణయించింది. ఈ కేంద్రం నిర్మాణం వల్ల వన్యప్రాణుల అభయారణ్యంపై ఏమైనా ప్రభావం ఉంటుందా? అనేది 9 నెలల్లోగా అధ్యయనం చేసి చెప్పాలని కేంద్ర పర్యావరణ శాఖను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు శుక్రవారం తన కార్యాలయంలో సంస్థ సంచాలకులతో సమీక్ష నిర్వహించారు. ఈ విద్యుత్‌ కేంద్రం నిర్మాణం ప్రారంభానికి ముందే 10 కి.మీ.ల పరిధిలో వాయు నాణ్యత, కాలుష్య ప్రభావంపై అధ్యయనం చేసి కేంద్ర పర్యావరణశాఖకు నివేదిక ఇచ్చినట్లు ఆయన చెప్పారు. తాజాగా ఎన్జీటీ ఉత్తర్వుల నేపథ్యంలో 25 కి.మీ.ల పరిధిలో మళ్లీ అధ్యయనం చేస్తామని వివరించారు. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ నివేదిక పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు అటవీ ప్రాంతానికి ఈ కేంద్రం చాలాదూరంలో ఉన్నందున ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు.

హైబ్రిడ్‌ విద్యుత్‌ కేంద్రానికి ఈసీకి దరఖాస్తు

రాష్ట్రంలో కొత్తగా 1,200 మెగావాట్ల హైబ్రిడ్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి ‘పర్యావరణ అనుమతి (ఈసీ)’ కోసం సిద్ధార్థ ఇన్‌ఫ్రా, సర్వీసెస్‌ అనే కంపెనీ కేంద్ర అటవీ, పర్యావరణశాఖకు దరఖాస్తు చేసింది. దీనిపై ఈ నెల 11న విచారణ జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోని నేరడిగొండ, సారంగాపుర్‌ మండలాల పరిధిలో (రాణాపూర్‌ గ్రామం వద్ద) ఈ ప్రాజెక్టు నిర్మించనున్నట్లు కేంద్రానికిచ్చిన దరఖాస్తులో తెలిపింది. ప్రాజెక్టులో భాగంగా సౌర, పవన విద్యుత్‌ ప్లాంట్లతో పాటు ‘పంప్డ్‌’ నిల్వ విధానంలో జలవిద్యుత్‌ కేంద్రం కలిపి హైబ్రిడ్‌ ప్లాంటు నిర్మిస్తామని వివరించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం గురించి తనకు ఎవరూ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ‘ఈనాడు’కు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని