ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య

అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని ‘సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సర్వీస్‌ స్వచ్ఛంద సంస్థ’.

Published : 10 May 2024 03:57 IST

అండగా నిలుస్తున్న ‘సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సర్వీస్‌ స్వచ్ఛంద సంస్థ’

ఈనాడు, హైదరాబాద్‌: అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని ‘సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సర్వీస్‌ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్తోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. ఒంటరి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారికి ఆడపిల్లలుంటే విద్యను అందిస్తోంది. తాజాగా పదోతరగతి ఫలితాల్లో 60 శాతం మార్కులు సాధించి.. తల్లి కానీ.. తండ్రి కానీ లేని ఆడపిల్లలను ఆశ్రమంలో చేర్చుకుని పైచదువులు చదివేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి భార్య అయిన విజయలక్ష్మి 2004లో ఈ సంస్థను ప్రారంభించారు. గుండెపోటుతో భర్త మరణించాక ఒంటరిగా ఆమె పడ్డ ఇబ్బందులు మరెవరూ పడకూడదన్న ఆలోచనతో తొలుత 10 మంది విద్యార్థినులతో ప్రారంభమైన సంకల్పం.. రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది.  ఏటా 80 మంది విద్యార్థినులను చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు వారి పైచదువులకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తున్నారు. ఇక్కడ చదువు పూర్తి చేసుకున్న ముగ్గురు యువతులు అమెరికాలో ఎం.ఎస్‌. పూర్తిచేసి.. అక్కడే కొలువుల్లో స్థిరపడగా.. మరో ముగ్గురు అమెరికాలోనే ఎం.ఎస్‌. చదువుతున్నారు. మరికొందరు హైదరాబాద్‌లోని టీసీఎస్‌, డెలాయిట్‌తో పాటు ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మానాన్నలను కోల్పోయి వచ్చిన మరికొందరు పెళ్లి చేసుకొని కొత్త జీవితంలో అడుగుపెట్టారు. 2009లో ఓ పాఠశాలను ప్రారంభించారు. ఓ దాత స్కూల్‌ భవనం నిర్మించడంతో ఆయన అభ్యర్థన మేరకు ‘‘నిమ్మగడ్డ ఆనందమ్మ మెమోరియల్‌ గర్ల్స్‌ స్కూల్‌ (ఇంగ్లిష్‌ మీడియం)’ను ప్రారంభించారు. అత్యాధునిక మౌలిక వసతులు కల్పించారు. పాఠశాలలో ‘నర్సరీ నుంచి పదో తరగతి’ వరకు ఉండగా.. ప్రస్తుతం 600 మందికి పైగా విద్యార్థినులు చదువుతున్నారు.


ఈ నంబర్లలో సంప్రదించాలి

పదో తరగతి ఫలితాల్లో 60 శాతం మార్కులు వచ్చి తల్లి, తండ్రి లేని ఆడపిల్లలతో పాటు.. అనాథ బాలికలకు అర్హత మార్కులతో ప్రమేయం లేకుండా అవకాశం కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మరిన్ని వివరాలకు 98854 72959, 79952 33348, 70938 00896 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని