మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలి: ఐకార్‌ డీడీజీ శర్మ

వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ టీఆర్‌ శర్మ పిలుపునిచ్చారు.

Published : 10 May 2024 04:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ టీఆర్‌ శర్మ పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత మొక్కజొన్న పరిశోధనా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సుమారు 165 దేశాల్లో మొక్కజొన్న ప్రధాన పంటగా మానవాళికి పోషకాహారంగా ఉందని, బేబీకార్న్‌, స్వీట్‌కార్న్‌లకు ఆదరణ పెరుగుతోందని తెలిపారు. కోళ్లు, పశువులకు దాణాగా ఉపయోగపడటంతో పాటు ముడి పదార్థంగా ఇథనాల్‌ సహా అనేక ఉత్పత్తులు తయారవుతున్నాయని అన్నారు. భారత్‌ నుంచి మొక్కజొన్న ఎగుమతులకు డిమాండ్‌ ఉందని తదనుగుణంగా శాస్త్రవేత్తలు ఉత్పాదకతను పెంపొందించాలని, ఇతర పంటల మాదిరిగానే మొక్కజొన్న సాగులోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించాలని శర్మ సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు, రిజిస్ట్రార్‌ రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మొక్కజొన్న ప్రధాన పంట అయినా ప్రాంతాలవారీగా ఉత్పత్తి, ఉత్పాదకతల్లో అంతరాలున్నాయని వాటిని అధిగమించేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఐకార్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరళ్లు ప్రధాన్‌, యాదవ్‌లు, భారత మొక్కజొన్న పరిశోధన సంస్థ సంచాలకుడు జాట్‌, నోడల్‌ అధికారి రమేశ్‌ కుమార్‌, మొక్కజొన్న పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త నగేశ్‌ కుమార్‌, విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్షిక నివేదికను విడుదల చేసి, అధిక ఉత్పత్తి సాధించిన రైతులు, ఉత్పత్తి సంఘాల ప్రతినిధులను సన్మానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని