ఆ నలుగురిని నిందితులుగా గుర్తించలేం
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, డా.జగ్గుస్వామి, తుషార్ వెల్లాపల్లి, బూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చాలంటూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది.
బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్‌లపై సిట్ మెమోను కొట్టివేసిన ఏసీబీ కోర్టు
వారిపై ప్రాథమిక ఆధారాల్లేవని వెల్లడి
అవినీతి నిరోధక చట్టం కేసుల్ని సిట్ దర్యాప్తు చేయకూడదనే అంశమూ పరిగణనలోకి
ఈనాడు, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, డా.జగ్గుస్వామి, తుషార్ వెల్లాపల్లి, బూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చాలంటూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. ‘‘మొదటి ముగ్గురు నిందితుల నేరాంగీకార వాంగ్మూలంలో ఎక్కడా ఈ నలుగురి పేర్లు లేవు. ఎఫ్‌ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ తదితరాల్లోనూ ఈ నలుగురి పాత్రపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘అవినీతి నిరోధక చట్టం కింద కేసుల్ని శాంతిభద్రతల పోలీసులుగాని, సిట్‌గాని దర్యాప్తు చేయకూడదనే అంశాన్నీ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటోంది. ఏసీబీలాంటి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ మాత్రమే ఇలాంటి కేసుల్ని విచారణ చేయొచ్చు. ఈ అంశాల ఆధారంగా ఆ నలుగురిని నిందితులుగా గుర్తించాలనే దర్యాప్తు అధికారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం లేదు’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేసు దర్యాప్తులో ఈ నలుగురికి సంబంధించి సాంకేతిక ఆధారాల్ని సేకరించామని సిట్ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంతకుముందు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అయితే అవినీతి నిరోధక చట్టం కింద కేసును విచారించే అర్హత సిట్‌కు లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు.ఈ కేసులో ఇప్పటికే రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ నిందితులుగా ఉన్నారు. గత అక్టోబరు 26న మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వీరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నిందితుల్ని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అనంతరం కేసు దర్యాప్తును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. సిట్ దర్యాప్తులో బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు జగ్గుస్వామి, ఎస్‌ఎన్‌డీపీ నేత తుషార్ వెల్లాపల్లి, కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా గుర్తిస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. తాజాగా ఆ మెమో తిరస్కరణకు గురైంది.
కింకర్తవ్యం
తొలుత అరెస్ట్ చేసిన ముగ్గురి నుంచి సేకరించిన వివరాల ఆధారంగానే కేసులో మిగిలిన నలుగురి పాత్ర ఉన్నట్లు సిట్ గుర్తించింది. వారిని విచారించేందుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీచేసింది. సాధారణంగా ఏదైనా కేసులో నిందితులకు, అనుమానితులకు లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు మాత్రమే 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. సిట్ అలాగే భావించి బీఎల్ సంతోష్, మిగిలిన ముగ్గురికి నోటీసులు ఇచ్చింది. వారిని నిందితులుగా గుర్తించలేమని కోర్టు తేల్చడంతో దర్యాప్తు ఎలా ముందుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టును ఆశ్రయించడం.. ఆ నలుగురినీ సాక్షులుగా పరిగణిస్తూ 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేసి విచారించడం.. కేసును ఏసీబీకి బదిలీ చేయడం.. వంటివి పోలీసుల ముందున్న మార్గాలుగా న్యాయ నిపుణులు చెబుతున్నారు.
సింహయాజి విడుదల నేడు!
కేసులో మూడో నిందితుడు సింహయాజి చంచల్‌గూడ జైలు నుంచి బుధవారం విడుదలయ్యే అవకాశముంది. సింహయాజితోపాటు రామచంద్రభారతి, నందకుమార్‌లకు గత బుధవారమే బెయిల్ మంజూరవటం తెలిసిందే. పూచీకత్తు సమర్పించలేకపోవడంతో ముగ్గురూ జైలులోనే ఉండిపోయారు. సింహయాజి మంగళవారం ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పించారు. అయితే బెయిల్‌పత్రాలు జైలుకు చేరేసరికి ఆలస్యం కావడంతో వెంటనే విడుదల కాలేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: ‘నువ్వు వెళ్లే మార్గం నీ మనస్సుకు తెలుసు.. అటువైపుగా పరుగెత్తు’: విరాట్ కోహ్లీ
-
General News
Polavaram: పోలవరం నిర్వాసితులకు నేరుగా నగదు బదిలీ కుదరదు: కేంద్ర జలశక్తిశాఖ స్పష్టత
-
India News
Parliament: ‘అదానీ - హిండెన్‌బర్గ్’పై పార్లమెంట్లో రగడ.. ఉభయ సభలు రేపటికి వాయిదా
-
Movies News
Director Sagar: ‘స్టూవర్ట్‌పురం దొంగలు’ తీసి చిరంజీవిని కలవలేకపోయిన దర్శకుడు సాగర్
-
India News
Siddique Kappan: 28 నెలల తర్వాత.. కేరళ జర్నలిస్టు కప్పన్ బెయిల్‌పై విడుదల
-
India News
‘మీరు లేకుండా మేం మెరుగ్గా ఉన్నాం’.. బెంగాల్ సీఎంపై వర్సిటీ తీవ్ర వ్యాఖ్యలు..!