డిజిటల్‌లోనే సమస్తం

తెలంగాణ ఎన్నో ప్రత్యేకతల ఖజానా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కట్టడాలు, వింతలు, విశేషాలు వర్తమాన అంశాల సమ్మిళితం. వీటన్నింటి సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరిచి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రస్తుత తరంపై ఉంది.

Published : 29 Dec 2022 02:56 IST

రిపాజిటరీ ఏర్పాటుకు ఐటీ శాఖ సమాయత్తం
తెలంగాణ డిజిటల్‌ మీడియా విభాగంలో త్వరలో ఆరంభం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నో ప్రత్యేకతల ఖజానా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కట్టడాలు, వింతలు, విశేషాలు వర్తమాన అంశాల సమ్మిళితం. వీటన్నింటి సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరిచి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రస్తుత తరంపై ఉంది. రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సాహిత్య, పురావస్తు, వారసత్వ సంపదకు సంబంధించిన సమాచారం వేర్వేరు వ్యక్తులు, సంస్థల నియంత్రణలో ఉండటంతో సమాచార సేకరణ ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ప్రత్యేకంగా రుసుములు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రజలకు ఉచితంగా ఈ సమాచారం అందించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలంగాణ డిజిటల్‌ మీడియా విభాగం ఓ మహత్తర క్రతువును త్వరలోనే చేపట్టబోతోంది. సమాచారాన్ని డిజిటల్‌ రూపంలో తెలంగాణ డిజిటల్‌ రిపాజిటరీ పేరిట భద్రపరచనుంది. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. డిజిటల్‌ మీడియా విభాగానికి దిలీప్‌ కొణతం సంచాలకుడిగా వ్యవహరిస్తుండగా.. ప్రాజెక్టు సమన్వయకర్తగా నరేందర్‌రెడ్డి ఉన్నారు.

పొందుపరిచే వివరాలు

తాళపత్రాలు, పుస్తకాలు, ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, డాక్యుమెంట్లు ఇలా ఏ రూపంలో ఉన్నా రిపాజిటరీలో పొందుపరచనున్నారు. ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న సమాచారం సేకరించే పనులు చేపట్టారు. పురాతన ప్రతులు, విశేషాలు, ఫొటోలు, వీడియోల వంటి సమాచారం ఉంటే తెలియజేయాలని మీడియా విభాగం సూచిస్తోంది. డిజిటల్‌ రిపాజిటరీలోని సమాచారాన్ని ఇంటర్నెట్‌ సాయంతో ప్రజలు పొందే వీలుంటుంది. నగరంలో ప్రస్తుతం జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో ప్రత్యేక స్టాల్‌ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు.

రిపాజిటరీ ప్రధాన లక్ష్యాలు

* తెలంగాణ అస్తిత్వాన్ని బలోపేతం చేయడం.
* కనుమరుగయ్యే దశలో ఉన్న ప్రతులు, ఆధారాలు, వస్తువుల డిజిటలీకరణ.

* డిజిటల్‌ ప్రతులను అంశాల వారీగా అమర్చి, సులువుగా గుర్తించే సూచీల రూపకల్పన.
* సమాచారాన్ని ఎక్కడైనా సులువుగా పొందేలా చేయడం.

* అందరికీ ఉపయుక్తంగా ఉండే అంశాలను పొందుపరచడం.
* సమాచార సేకరణలో పౌర సమాజాన్ని భాగస్వాములను చేయడం.


రిపాజిటరీ అభివృద్ధిలో వాలంటీర్లుగా చేరొచ్చు

తెలంగాణ ప్రాశస్త్యాన్ని భావి తరాలకు అందించడమే ప్రాజెక్టు లక్ష్యం. డిజటల్‌ రిపాజిటరీ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములవ్వాలి. సలహాలు, సూచనలు అందించాలి. అందుకు digital-repository@telangana.gov.inలో   సంప్రదించవచ్చు. విద్యార్థులు, యువత, ఇతర ఔత్సాహికులు వాలంటీర్లుగానూ చేరొచ్చు. రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని రిపాజిటరీలో పొందుపరచాలని భావిస్తున్నాం.

నరేందర్‌రెడ్డి, ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని