మోటారు వాహన చట్ట సవరణ.. లక్ష్యానికి విరుద్ధం

మోటారు వాహన ప్రమాదాల్లో గాయపడిన వారు... లేదంటే మృతి చెందిన వారి బంధువులు పరిహారం కోసం 6 నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాలని 2019లో మోటారు వాహన చట్టానికి సవరణ తీసుకురావడం లక్ష్యానికి విరుద్ధంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Updated : 03 Feb 2023 05:25 IST

హైకోర్టు వ్యాఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: మోటారు వాహన ప్రమాదాల్లో గాయపడిన వారు... లేదంటే మృతి చెందిన వారి బంధువులు పరిహారం కోసం 6 నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాలని 2019లో మోటారు వాహన చట్టానికి సవరణ తీసుకురావడం లక్ష్యానికి విరుద్ధంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్‌ 166(3) నిబంధన కింద పరిహారం కోసం దాఖలు చేసిన దరఖాస్తును నిజామాబాద్‌ మోటారు ప్రమాదాల క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నిజామాబాద్‌ జిల్లా మక్లూర్‌ అమ్రాద్‌ గ్రామానికి చెందిన ఎ.నవనీత మరొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీల ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు సహాయకులుగా నియమితులైన సీనియర్‌ న్యాయవాది పి.శ్రీరఘురాం మాట్లాడుతూ.. పరిహారం పొందే హక్కు పౌర ఒప్పందం కానప్పటికీ పరిహారం నిమిత్తం దరఖాస్తు దాఖలు చేయడానికి గడువు మినహాయింపు పొందవచ్చన్నారు. మోటారు వాహనాల చట్టం ఉమ్మడి జాబితాలో ఉందని, క్లెయింలు, ఇతర సమస్యలన్నీ రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని చెప్పారు. ఈ చట్ట సవరణపై ఇటీవల కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలంటూ మరో న్యాయవాది పొన్నం అశోక్‌గౌడ్‌ తీర్పు ప్రతిని అందజేశారు. ప్రతివాదిగా ఉన్న ఐసీఐసీఐ బీమా కంపెనీ తరఫు సీనియర్‌ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ వాదనలు వినిపిస్తూ పిటిషన్‌లో చట్టాన్ని సవాలు చేయలేదన్నారు. ఆరు నెలల గడువుపై వివిధ కోర్టులు వెలువరించిన తీర్పులతో సహా కౌంటరు దాఖలు చేయడానికి గడువు కోరడంతో దీనికి ధర్మాసనం అనుమతిస్తూ విచారణను మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు