పాత డబ్బులే ఇవ్వలే.. కొత్తవి కుట్టించేదెలా?

విద్యార్థులకు గతేడాది కుట్టించిన ఏకరూప దుస్తులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం దర్జీలకు ఇంతవరకు చెల్లించలేదు.

Published : 20 Mar 2023 03:36 IST

ఏకరూప దుస్తులపై ప్రధానోపాధ్యాయుల తర్జనభర్జన
రాష్ట్రంలో దర్జీలకు రూ.26.79 కోట్ల బకాయిలు

గరిడేపల్లి, న్యూస్‌టుడే: విద్యార్థులకు గతేడాది కుట్టించిన ఏకరూప దుస్తులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం దర్జీలకు ఇంతవరకు చెల్లించలేదు. ఈ పరిస్థితుల్లో రానున్న విద్యాసంవత్సరానికి అవసరమైన దుస్తులను కుట్టించడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వం పాత బకాయిలనే చెల్లించకపోగా.. దర్జీలతో కొత్త దుస్తులను ఎలా కుట్టించాలని ప్రధానోపాధ్యాయులు తర్జనభర్జన పడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు(యూనిఫాం) ఉచితంగా అందిస్తుంది. గతేడాది 26,79,497 మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టించి ఇచ్చింది. మండలాల వారీగా వస్త్రం సరఫరా చేస్తున్న ప్రభుత్వం స్థానికంగా ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో యూనిఫాంలు కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేస్తుంది. అందుకు ఒక జతకు రూ.50 చెల్లిస్తోంది. ఈ ధర పెద్దగా గిట్టుబాటు కాకపోయినా.. కొన్ని రోజులు పని దొరుకుతుందన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల దర్జీలు కుట్టి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అందుకు సంబంధించి దర్జీలకు రూ.26.79 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాటిని ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో దర్జీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు.. తాజాగా 2023-24 విద్యాసంవత్సరానికి ముందస్తుగానే కొలతలు తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత బకాయిలు ఇవ్వనిదే కొత్త దుస్తులు ఎలా కుట్టించాలి? దర్జీలకు ఏం సమాధానం చెప్పాలి అని? ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్థుల ఏకరూప దుస్తుల పంపిణీకి అవాంతరాలు తలెత్తకుండా పాత బకాయిలు వెంటనే మంజూరు చేయాలని ప్రధానోపాధ్యాయులు, దర్జీలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని