ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో యూఎస్‌ కాన్సులేట్‌ కీలకం

అమెరికా- భారత్‌ ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాల బలోపేతంలో హైదరాబాద్‌లో నిర్మించిన అమెరికన్‌ కాన్సులేట్‌ కీలక భూమిక పోషిస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి (ప్రిన్సిపల్‌ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్‌) వేదాంత్‌ పటేల్‌ అన్నారు.

Published : 23 Mar 2023 04:07 IST

అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికా- భారత్‌ ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాల బలోపేతంలో హైదరాబాద్‌లో నిర్మించిన అమెరికన్‌ కాన్సులేట్‌ కీలక భూమిక పోషిస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి (ప్రిన్సిపల్‌ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్‌) వేదాంత్‌ పటేల్‌ అన్నారు. అమెరికా కాన్సులేట్‌కు సంబంధించి దక్షిణాసియాలోనే అతిపెద్ద సొంత భవనాన్ని హైదరాబాద్‌లో నిర్మించామని, భారత దేశంతో ఉన్న బలమైన బంధాన్ని ఇది గుర్తు చేస్తోందని పేర్కొన్నారు. అమెరికా విదేశీ విధానాలపై శ్వేతసౌధంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.2,800 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లో సువిశాల ప్రాంగణంలో నిర్మించిన నూతన కాన్సులేట్‌ గురించి ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు అమెరికా వీసా సేవలు అందించటంతోపాటు.. హైదరాబాద్‌లో ఉన్న వాణిజ్య అవకాశాలను దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక సాంకేతికతతో ఆ భవనాన్ని నిర్మించాం. ఈ నెల 20న ఆ భవనం నుంచి సేవలు ప్రారంభించాం. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థి వీసాలతోపాటు వాణిజ్య, పర్యాటక, డిపెండెంట్‌ వీసాలకూ డిమాండ్‌ ఉంది. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో అమెరికన్‌ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వాటన్నింటికీ కాన్సులేట్‌ వేదిక అవుతుంది. వాణిజ్య సంబంధాలను విస్తృతం చేయడంలో హైదరాబాద్‌ కాన్సులేట్‌ కార్యాలయం ఎంతో దోహపడుతోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కూడా లింక్డ్‌ ఇన్‌ ద్వారా వివరించారు’’ అని వేదాంత్‌ పటేల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు