Moranchapally village: ముందు చెబితే ముప్పు తప్పేది!

అతి భారీవర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు.. పొంగిపొర్లుతున్న చెరువులు తెగి వరదలొచ్చే ప్రమాదం పొంచి ఉన్నా.. ప్రజలను అప్రమత్తం చేయడంలో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లా అధికార యంత్రాంగం విఫలమైందని బాధిత ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Updated : 30 Jul 2023 09:34 IST

వరదపై అధికారులు హెచ్చరికలు ఇవ్వలేదంటున్న జనం
సర్వస్వం కోల్పోయి రోడ్డుపాలైన మోరంచపల్లి వాసులు
కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలదీ అదే స్థితి

ములుగు, జయశంకర్‌ జిల్లాల నుంచి ఈనాడు ప్రతినిధి : అతి భారీవర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు.. పొంగిపొర్లుతున్న చెరువులు తెగి వరదలొచ్చే ప్రమాదం పొంచి ఉన్నా.. ప్రజలను అప్రమత్తం చేయడంలో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లా అధికార యంత్రాంగం విఫలమైందని బాధిత ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువులు అలుగు పారుతున్నా.. వరదను అంచనా వేయడంలో అధికారుల వైఫల్యం తమ ప్రాణాలమీదకు వచ్చిందని వాపోతున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ప్రధాన రహదారిపై ఉన్న మోరంచపల్లి దీనావస్థ ఇది. ఈ గ్రామంపైకి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వచ్చిన వరదల్లో నలుగురు కొట్టుకుపోగా.. రెండు మృతదేహాలే బయటపడ్డాయి. మూడు రోజులైనా.. మరో ఇద్దరి ఆచూకీ తెలియలేదని వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఊళ్లో ఇళ్లముందు కట్టేసిన పాడిపశువులు, లేగదూడలు పది అడుగుల ఎత్తున వచ్చిన వరదలో నుంచి బయటపడటానికి తాళ్లు తెంపుకోలేక ఎక్కడికక్కడే మరణించాయి. ములుగు జిల్లా కొండాయి, దొడ్ల, మల్యాల గ్రామాలదీ ఇదే పరిస్థితి. ఈ పల్లెల్లో వరద మిగిల్చిన నష్టాలను ‘ఈనాడు’ ప్రతినిధి శనివారం పరిశీలించగా.. ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ముందురోజు ఏం చేశారు?

ఈ నెల 27వ తేదీ తెల్లవారుజామున జంపన్నవాగు వరద పెద్ద ఎత్తున మల్యాల, కొండాయి గ్రామాలను చుట్టుముడుతున్నా అధికారులెవరూ కన్నెత్తి చూడలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 27వ తేదీ ఉదయం కొండాయి సర్పంచి కాక వెంకటేశ్వర్లు పలువురికి ఫోన్‌ చేసి.. తమ గ్రామాన్ని వరద చుట్టుముడుతోందని, కాపాడమని కోరినా అధికారులెవరూ వెంటనే స్పందించలేదని చెప్పారు. మల్యాలలో 10 ఇళ్లు వరదలో మునిగిపోయాయి. కొండాయి గ్రామం మొత్తం మునిగిపోగా.. ఎనిమిదిమంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ముందస్తు హెచ్చరికలుంటే వారి ప్రాణాలు దక్కేవని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అధికారుల మధ్య సమన్వయం లేక...

మోరంచపల్లికి ఎగువన దాదాపు 10 కిలోమీటర్లకు అవతల ములుగు వెంకటాపూర్‌ మండలం బూరుగుపేటలోని మారేడుగుండ చెరువు తెగడంతో వరద నీరు మోరంచపల్లి వాగులోకి పోటెత్తింది. భూపాలపల్లి జిల్లా ఘనపూర్‌ మండలంలోని సీతారాంపూర్‌, ధర్మారావుపేట చెరువులు తెగడంతో.. ఆ నీరు కూడా తోడై.. గురువారం తెల్లవారుజామున మోరంచపల్లిని ముంచెత్తింది. ఈ మూడు చెరువులు ముందు రోజే అలుగు పారాయి. బుధవారం సాయంత్రానికి ఆ చెరువుల్లోకి వరద ఎంత వస్తుంది, వాటి కట్టల పరిస్థితి ఏంటనే సమాచారాన్ని ములుగు జిల్లా యంత్రాంగం పక్కనే ఉన్న భూపాలపల్లి జిల్లా అధికారులకు ఎందుకు పంపలేదన్నది కీలకప్రశ్నగా మారింది.


మేమెలా బతకాలి?

- వినోద్‌, నాగరాజు, యువ రైతులు, మోరంచపల్లి

పశువులు వరదలో చనిపోవడంతో పాడిపైనే ఆధారపడి జీవిస్తున్న పలు కుటుంబాలకు జీవనోపాధి కూడా కరవైంది. ఇళ్లు, వేసిన పంటలు కొట్టుకుపోవడంతో ఎలా బతకాలో దిక్కుతోచడం లేదు. ఇళ్ల వద్దకెళ్లి మేటవేసిన బురదను, పాడి పశువుల కళేబరాలను చూస్తుంటే కన్నీరు వస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. కట్టుకోవడానికి దుస్తులు కూడా లేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని