విదేశీ పర్యటనలు ఇక భారమే!

ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారు ఉపశమనం కోసం ఇటీవల విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. ముఖ్యంగా కొవిడ్‌ తర్వాత ఇలాంటి వారి సంఖ్య పెరిగింది.

Updated : 15 Aug 2023 10:21 IST

టూర్‌ ప్యాకేజీ మొత్తంపై 20% టీసీఎస్‌ విధింపు
అక్టోబరు నుంచి అమల్లోకి కొత్త విధానం

ఈనాడు, హైదరాబాద్‌: ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారు ఉపశమనం కోసం ఇటీవల విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. ముఖ్యంగా కొవిడ్‌ తర్వాత ఇలాంటి వారి సంఖ్య పెరిగింది. అయితే... విదేశీ పర్యాటకంపై కొత్త పన్ను విధానం ప్రభావం చూపనుంది. టూర్‌ ఆపరేటర్ల ద్వారా ప్యాకేజీ రూపంలో వెళ్లేవారు టీసీఎస్‌ కింద (ట్యాక్స్‌ కలెక్షన్‌ ఎట్‌ సోర్స్‌) ముందస్తుగా చెల్లించే పన్ను భారీగా పెరగడమే ఇందుకు కారణం. అదనంగా చెల్లించాల్సిన పన్నును ఆదాయపు పన్నులో మినహాయింపు పొందే అవకాశమున్నా... దాని కోసం ఏడాదిపాటు ఎదురుచూడాల్సి వస్తుంది.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌ దేశాలు సహా ఆసియాలోని చైనా, సింగపూర్‌, వియత్నాం, ఇండోనేసియా, శ్రీలంక, గల్ఫ్‌ దేశాలకు పర్యాటకులు పెద్దసంఖ్యలో వెళుతుంటారు. ఇలాంటి వారిలో చాలామంది టూర్‌ ఆపరేటర్లను ఆశ్రయిస్తుంటారు. వీరి ద్వారా విదేశీ పర్యటనలు చేసేవారు... ప్రస్తుతం టూర్‌ ప్యాకేజీ మొత్తంలో 5% పన్ను చెల్లిస్తున్నారు. అక్టోబరు ఒకటి నుంచి అది 20 శాతానికి పెరగనుంది. వైద్యం, విద్య అవసరాలకు వెళితే మాత్రం మినహాయింపు ఉంది. కొవిడ్‌ తర్వాత విమాన ఛార్జీలు భారీగా పెరగడంతో విదేశీ పర్యటనలకు వెళ్లేవారి ఖర్చులూ అధికమయ్యాయి. ఇవి చాలవన్నట్లు పన్ను భారం అదనంగా పడనుంది. ఒక కుటుంబ విదేశీ టూర్‌ ప్యాకేజీ రూ.5 లక్షలు అనుకుంటే... ఆ మొత్తంపై టీసీఎస్‌గా మరో రూ.లక్ష చెల్లించాలి. టూర్‌ ఆపరేటర్ల ద్వారా కాకుండా విదేశాలకు సొంతంగా వెళితే మాత్రం టీసీఎస్‌ ప్రభావం ఉండదు. టీసీఎస్‌ భారాన్ని తగ్గించుకోవడానికి పర్యాటకులు విదేశీ పర్యాటక వెబ్‌సైట్లను, ఏజెంట్లను ఆరా తీస్తున్నారు. పర్యాటక వీసా, రానుపోను విమాన టికెట్లు టూర్‌ ఆపరేటర్ల ద్వారా తీసుకుని, విదేశాల్లో హోటల్‌ గదులు, వాహనాల బుకింగ్‌లు సొంతంగా చేసుకుంటే టీసీఎస్‌ భారం తగ్గుతుంది.

దేశీయ పర్యాటకానికి మేలు

కొత్త విధానం దేశీయ పర్యాటకం పెరిగేందుకు దోహదం చేస్తుందని పర్యాటక నిపుణులు చెబుతున్నారు. విదేశాలకు వెళ్లేందుకు పెద్దమొత్తంలో టీసీఎస్‌ చెల్లించాల్సి వస్తుండటంతో పర్యాటకులు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తారని అభిప్రాయపడుతున్నారు. విదేశాలకు వెళ్లి రావడం బదులు మన దేశంలోని పర్యాటక ప్రాంతాల్ని చూసొచ్చేందుకు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు.


మధ్య తరగతిపై అధిక ప్రభావం

టీసీఎస్‌ పెంపు ప్రభావం మధ్య తరగతి పర్యాటకులు, టూర్‌ ఆపరేటర్లపై అధికంగా పడుతుంది. ఏదైనా దేశానికి ఒక కుటుంబం వెళితే టీసీఎస్‌ రూపంలోనే మరో రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు పన్నుగా చెల్లించాలి. ఈ మొత్తాన్ని వెనక్కి పొందే అవకాశముంది. ఐటీ రిటర్నుల సమయంలో ఈ వివరాలను సమర్పిస్తే ఆదాయపు పన్నులో సర్దుబాటు చేస్తారు. ఒకవేళ చెల్లించాల్సిన ఆదాయపు పన్ను లేకుంటే సొమ్ము రిఫండ్‌గా వస్తుంది. అయితే... ఈ మొత్తాన్ని ముందస్తుగా చెల్లించడానికి సమకూర్చుకోవడం మధ్యతరగతి పర్యాటకులకు కష్టమైన విషయమే. ఈ ఇబ్బందుల్లేకుండా కొందరు విదేశీ వెబ్‌సైట్ల ద్వారా టూర్‌ ప్యాకేజీలకు ఆరా తీస్తున్నారు. అప్పుడు పన్ను భారం తగ్గినా ఏదైనా సమస్య వస్తే ఇక్కడి ఆపరేటర్ల మాదిరి, వారిని ప్రశ్నించలేరు.

వాల్మీకి హరికిషన్‌, డైరెక్టర్‌ స్కాల్‌ ఇంటర్నేషనల్‌, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని