Telangana: పశుసంవర్ధకశాఖలో కీలక పత్రాలు మాయం!

మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో కీలక పత్రాలు మాయమయ్యాయని నాంపల్లి స్టేషన్లో కేసు నమోదైంది.

Updated : 10 Dec 2023 08:44 IST

మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ సహా ఆరుగురిపై కేసు
విద్యాశాఖ కార్యాలయం నుంచి ఫైళ్ల చోరీకి మరొకరి యత్నం

ఈనాడు - హైదరాబాద్‌, న్యూస్‌టుడే- నాంపల్లి, అబిడ్స్‌: మాసబ్‌ట్యాంక్‌లోని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో కీలక పత్రాలు మాయమయ్యాయని నాంపల్లి స్టేషన్లో కేసు నమోదైంది. మాజీమంత్రి కార్యాలయంలోకి వెళ్లిన కొందరు వ్యక్తులు సీసీ టీవీ కెమెరాలు నిలిపివేసి, గందరగోళం సృష్టించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అదే ప్రాంతంలోని విద్యాశాఖ పాత కార్యాలయం నుంచి దస్త్రాలను ఓ వ్యక్తి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. మాసబ్‌ట్యాంక్‌ పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఓఎస్డీ కల్యాణ్‌ ఛాంబర్‌ ఉంది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో కిటికీ గ్రిల్స్‌ తొలగించి కొందరు కార్యాలయంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి కీలకపత్రాలు, కంప్యూటర్లలోని హార్డ్‌డిస్క్‌లు ఎత్తుకెళ్లినట్టు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్‌చల్‌ చేశాయి. అదే రోజు రాత్రి అక్కడ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఎం.లక్ష్మయ్య ఆ కార్యాలయ తాళాలు తీసి ఉండటం గమనించారు. అనుమానం వచ్చి చూడగా లోపల ఫైళ్లు, కంప్యూటర్లు, బీరువాలు చిందరవందరగా కనిపించాయి. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మోహన్‌, ఎలీజాన్‌, వెంకటేష్‌, మరో ఇద్దరు ఎటువంటి అనుమతి లేకుండా కార్యాలయంలోకి ప్రవేశించారని లక్ష్మయ్య నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని పత్రాలు మాయమయ్యాయని పశుసంవర్ధకశాఖ అధికారులు మధ్యమండలం డీసీపీ శ్రీనివాస్‌కు తెలపగా.. ఆయన శనివారం సాయంత్రం కార్యాలయాన్ని పరిశీలించారు.

కొత్త ప్రభుత్వం ఏర్పడిన వేళ చోటుచేసుకుంటున్న వరుస ఘటనలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, మాజీ మంత్రుల పేషీల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచి ఫైళ్ల చోరీకి ప్రయత్నం జరిగినట్లు అబిడ్స్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన మధ్య మండలం డీసీపీ శ్రీనివాస్‌, అబిడ్స్‌ ఏసీపీ ఆకుల చంద్రశేఖర్‌, సీఐ టి.నరసింహరాజు, డీఐ నరసింహ తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ కార్యాలయంలోనే విద్యాశాఖ కార్యాలయం ఉంది. శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్‌ ఆటోతో అక్కడికి చేరుకుని సుమారు గంటపాటు వేచి ఉన్నాడు. అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం గమనించిన ఆటో డ్రైవరు పరారయ్యాడు. పోలీసులు అక్కడికి చేరుకుని కార్యాలయంలో.. వాచ్‌మన్‌గా పనిచేస్తున్న స్వామిగౌడ్‌ను విచారించారు. ఆటోలో వచ్చిన వ్యక్తి సంస్థ కార్యాలయంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే మహ్మద్‌ షరీఫ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆటోలో ఏమైనా సామగ్రి తీసుకెళ్లారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డీసీపీ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ మాజీ మంత్రి సబితారెడ్డి కార్యాలయం ఉండేదని, ఆటో తీసుకొచ్చిన వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు. అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

‘దస్త్రాలు మాయమవడం అవాస్తవం’

పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో పత్రాలు మాయమైనట్లు వస్తున్న వార్తలు నిరాధారమని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఓఎస్డీ కల్యాణ్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొమ్మిది నెలల క్రితమే పశుసంవర్ధకశాఖ కార్యాలయాన్ని నూతన సచివాలయానికి తరలించారన్నారు. మంత్రి ఆమోదం కోసం వచ్చే దస్త్రాలను ఎప్పటికప్పుడు అక్కడికే పంపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం మారడంతో ఫర్నిచర్‌, ఇతర సామగ్రిని జీఏడీకి అప్పగించే ప్రక్రియలో భాగంగా మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయానికి వెళ్లామని వివరణ ఇచ్చారు. ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమేనని పేర్కొన్నారు.

దస్త్రాల మాయంపై పటిష్ఠ దర్యాప్తు చేయండి: పీసీసీ

ప్రభుత్వ కార్యాలయాల నుంచి దస్త్రాలు మాయమవుతున్న ఘటనలపై పటిష్ఠ దర్యాప్తు నిర్వహించాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ శనివారం డీజీపీ రవిగుప్తాకు లేఖ రాశారు. గత ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలా దస్త్రాల్ని అపహరిస్తున్నట్లు అనుమానాలున్నాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు