గొర్రెల పంపిణీలో ‘క్యాష్‌బ్యాక్‌’ అట!

గొర్రెల పంపిణీ పథకంలో లబ్ధిదారులకు ‘క్యాష్‌బ్యాక్‌’ ఇస్తానని ప్రచారం చేసిన ఓ ప్రైవేట్‌ వ్యక్తి.. అధికారులకు నజరానాలు అందించి విక్రయదారులకు చెల్లించాల్సిన సొమ్మును తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు.

Published : 14 Mar 2024 04:48 IST

లబ్ధిదారులకు ఇస్తానంటూ ప్రచారం.. అధికారులకు నజరానాలు
లోలోనా సంస్థ పేరిట గుత్తేదారు అక్రమాలు
విజిలెన్స్‌ విచారణలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ పథకంలో లబ్ధిదారులకు ‘క్యాష్‌బ్యాక్‌’ ఇస్తానని ప్రచారం చేసిన ఓ ప్రైవేట్‌ వ్యక్తి.. అధికారులకు నజరానాలు అందించి విక్రయదారులకు చెల్లించాల్సిన సొమ్మును తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. అతనికి పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు సహకరించారని విజిలెన్స్‌ విచారణలో వెలుగులోకి వచ్చింది. గొర్రెల పంపిణీ పథకం కింద లబ్ధిదారులకు మొదటి విడతలో ఒక్కో యూనిట్‌ (20 గొర్రెలు, ఒక పొట్టేలు)కు ప్రభుత్వం రూ.1.25 లక్షల చొప్పున మంజూరు చేసేది. రెండో విడతలో 2021 ఆగస్టు 4 నుంచి యూనిట్‌ ధరను రూ.1.75 లక్షలకు పెంచింది. యూనిట్‌ ధర పెరిగాక సయ్యద్‌ మొయిద్‌ అనే గొర్రెల రవాణా గుత్తేదారు రంగంలోకి దిగాడు. లబ్ధిదారులు గొర్రెల కోసం నేరుగా తమ సంస్థను సంప్రదిస్తే రూ.20 వేల క్యాష్‌బ్యాక్‌ ఇస్తానంటూ లోలోనా క్యాటిల్‌ హాస్టల్‌ పేరిట కరపత్రాలు, గోడపత్రికలను పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్‌, జిల్లా కార్యాలయాల్లో పంచిపెట్టాడు. పథకం నిబంధనల ప్రకారం.. అధికారులు, లబ్ధిదారులు కలిసి నేరుగా విక్రయదారుల వద్దకు వెళ్లి కొనాలి. అనంతరం విక్రయదారుల ఖాతాల్లో అధికారులు సొమ్ము జమ చేయాలి. కానీ, మొయిద్‌ వద్ద దాదాపు 50 వేల యూనిట్లు కొనుగోలు చేసినట్లు అధికారులు రికార్డుల్లో చూపారని విజిలెన్స్‌ ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. 

పోలీసులకు విక్రయదారుల ఫిర్యాదుతో..

గతేడాది ఆగస్టు 13 నుంచి 23 మధ్యకాలంలో ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 18 మంది పెంపకందారుల నుంచి 133 యూనిట్ల కోసం 2,793 గొర్రెలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు, లబ్ధిదారులతో పాటు మొయిద్‌ కూడా ఉన్నాడు. గొర్రెలను మోయిదే కొన్నట్లు విక్రయదారులకు అధికారులు చెప్పారు. రికార్డుల్లో మాత్రం మొయిద్‌ నుంచి శాఖ కొన్నట్లు చూపించారు. అందుకు అధికారులకు మొయిద్‌ ‘క్యాష్‌బ్యాక్‌’ ఇచ్చినట్లు తెలిసింది. విక్రయదారులకు చెల్లించాల్సిన రూ.2.10 కోట్ల సొమ్మును అతని ఖాతాలోకి అధికారులు బదిలీ చేశారు. అతను విక్రయదారుల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉండగా అలా చేయలేదు. నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవటంతో విక్రయదారులు హైదరాబాద్‌కు వచ్చి పశుసంవర్ధకశాఖ ఉన్నతాధికారులను నిలదీశారు. తాము మొయిద్‌ ఖాతాలో డబ్బులు వేశామని, వారికి అతనే ఇవ్వాల్సి ఉందని వారు బదులిచ్చారు. దీంతో అమ్మకందారులు లోలోనా లైవ్‌స్టాక్‌ సంస్థ కార్యాలయానికి వెళ్లి మొయిద్‌ను నిలదీశారు. డబ్బుల కోసం తన వద్దకు రావద్దని.. అధికారుల వద్దకే వెళ్లాలని అతను బెదిరించాడు. దీంతో గచ్చిబౌలి పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. ఇలాంటి మరెన్నో మోసాలు గొర్రెల కొనుగోలులో చేటుచేసుకున్నాయని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. లబ్ధిదారులకు క్యాష్‌బ్యాక్‌ ఇస్తానని మొయిద్‌ ప్రచారం చేసినా.. అధికారులకే దాన్ని చెల్లించాడని అనుమానిస్తున్నారు. అందుకుగాను అతనికి లబ్ధి చేకూర్చేందుకు అధికారులు కావాలనే యూనిట్‌ ధర పెంచారా అన్న కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ముందుగా డైరెక్టరేట్‌ నుంచి సమాచారం తీసుకొని.. జిల్లాల వారీగా విచారణ ప్రారంభించారు. మొయిద్‌ వద్ద ఎన్ని యూనిట్లు కొనుగోలు చేసినట్లు చూపారు.. తదితర అంశాలపై విచారణ జరుపుతున్నారు. నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో ఇప్పటికే విచారణ జరిపినట్లు తెలిసింది. మిగిలిన జిల్లాల్లోనూ అధికారులు పర్యటించనున్నారు. మొయిద్‌, అధికారుల బ్యాంకు ఖాతాలను సైతం సేకరించి, వాటి ఆధారంగా విచారణ ముమ్మరం చేయాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని