రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లేవారు.. పత్రాలను వెంట ఉంచుకోవాలి

Published : 19 Mar 2024 02:46 IST

సరిహద్దు చెక్‌పోస్టులు 24 గంటలూ పనిచేస్తాయి
ఈసారి 85 ఏళ్లు దాటిన వారికే ఇంటి నుంచి ఓటు
ఏప్రిల్‌ 15 వరకు ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చు
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున.. రూ.50 వేలకు పైగా నగదును వెంట తీసుకువెళ్లే వారు అందుకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని, లేకుంటే అధికారులు స్వాధీనం చేసుకుంటారని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. బీఆర్కే భవన్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘గతంలో 80 సంవత్సరాలు దాటిన వారికి ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయం ఉండగా.. ఈ దఫా ఆ వయసు 85 సంవత్సరాలకు పెరిగింది. దివ్యాంగుల విషయంలో గత నిబంధనలే అమలవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 85 సంవత్సరాలు దాటిన ఓటర్లు 1,94,822 మంది, దివ్యాంగ ఓటర్లు 5,26,340 మంది ఉన్నారు’’ అని వివరించారు.

అసెంబ్లీ ఎన్నికల తరవాత 12.49 లక్షల మంది ఓటర్ల నమోదు

ఓటు నమోదుకు ఏప్రిల్‌ 15 వరకు అవకాశం ఉందని వికాస్‌రాజ్‌ వెల్లడించారు. అప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఓటు హక్కు కల్పిస్తామని తెలిపారు. ఓటు నమోదు, నియోజకవర్గ మార్పు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ‘‘ఓటర్ల జాబితాలో సవరణల ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేశాం. గత అసెంబ్లీ ఎన్నికల తరవాత రాష్ట్రంలో 12,49,625 మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారు. 8,58,491 మంది పేర్లను జాబితా నుంచి తొలగించగా... 7.69 లక్షల మంది తమ వివరాలను సరి చేసుకున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి. 57 వేల బ్యాలెట్‌ యూనిట్లు, 44 వేల కంట్రోల్‌ యూనిట్లు, 48 వేల వీవీ ప్యాట్స్‌ ఉన్నాయి. ఈవీఎంల తొలిదశ తనిఖీ ప్రక్రియను ఇప్పటికే పూర్తిచేశాం. సిబ్బందికి వివిధ దశల శిక్షణ పూర్తయింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలే కంటోన్మెంట్‌ ఉపఎన్నికకూ వర్తిస్తుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను నియోజకవర్గ ఎన్నికల అధికారి స్థాయిలోనే ముద్రించాలని స్పష్టంచేశాం. ఈవీఎం యంత్రాలపై ఏర్పాటు చేసే అభ్యర్థుల వివరాలతో కూడిన పత్రాలను రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ముద్రణాలయంలో ముద్రిస్తాం. ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయనున్నాం’’ అని వెల్లడించారు. సమావేశంలో ఎన్నికల అధికారులు లోకేశ్‌కుమార్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, సత్యవాణి పొల్గొన్నారు.

రూ.50 వేలకుపైగా నగదు తరలింపునకు బ్యాంకుల నుంచి విత్‌డ్రా రశీదులు, చెల్లింపుల పత్రాలు, నగలకు అయితే సంబంధిత ఆర్డర్‌ కాపీ, తరలింపు పత్రం తదితరాలను వెంట ఉంచుకోవాలని అధికారులు ఇప్పటికే వెల్లడించారు.


1.80 లక్షల మంది సిబ్బంది..

ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేశాం. ఎన్నికల కోసం సుమారు 1.80 లక్షల మంది సిబ్బందిని, శాంతిభద్రతల పరిరక్షణకు 60 వేల మంది సిబ్బందితోపాటు 145 కంపెనీల సీఐఎస్‌ఎఫ్‌ వారిని వినియోగించనున్నాం. అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులు 24 గంటలూ పని చేసేలా ఏర్పాట్లుచేశాం. అన్నిటినీ సీసీ కెమెరాలతో అనుసంధానం చేశాం.


మండలి ఉపఎన్నిక యథాతథం..

శాసనమండలి ఉపఎన్నిక ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుంది. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గానికి మార్చి 28న పోలింగ్‌, ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్‌ వెల్లడించింది. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక కోసం ఓటర్ల నమోదు సాగుతోంది.

వికాస్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని