రామప్ప ఆలయంలో సోమసూత్రం సమస్యకు పరిష్కారం

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని రామప్ప ఆలయంలో సోమసూత్రం (శివలింగ అభిషేక జలం బయటకు వెళ్లే మార్గం) సమస్య పరిష్కారమైంది.

Published : 27 Mar 2024 04:02 IST

వెంకటాపూర్‌, న్యూస్‌టుడే: ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని రామప్ప ఆలయంలో సోమసూత్రం (శివలింగ అభిషేక జలం బయటకు వెళ్లే మార్గం) సమస్య పరిష్కారమైంది. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా రామప్పకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఈ సమస్యను నేరుగా చూసి పరిష్కరించాలని పురావస్తు శాఖ, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడంతో ఈ మేరకు చర్యలు చేపట్టారు.

గర్భగుడిలోని మహాశివుడి అభిషేక జలం సాఫీగా బయటకెళ్లేలా నిర్మాణ సమయంలో రాతితో సోమసూత్రం ఏర్పాటు చేశారు. దశాబ్దాల కిందట వచ్చిన భూకంపం సమయంలో ఆలయంలోని కొన్ని స్తంభాలు, శివలింగం, సోమసూత్రం కుంగిపోయాయి. 2000 సంవత్సరంలో శివలింగాన్ని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పునఃప్రతిష్ఠించారు. భూ అంతర్భాగంలో ఏర్పాటైన సోమసూత్రాన్ని మాత్రం చక్కదిద్దలేకపోయారు. అభిషేకాల సమయంలో వచ్చే జలాన్ని పూజారులు బిందెలతో తోడుకుని బయటకు తీసుకెళ్లేవారు. కిషన్‌రెడ్డి ఆదేశాలతో గత నెల రోజులుగా పురావస్తుశాఖ అధికారులు నిపుణులతో పలుమార్లు చర్చించి కంపనాలు లేని యంత్రాన్ని తెప్పించారు. సోమసూత్రం దారికి అడ్డుగా వచ్చిన రాయిని జాగ్రత్తగా కత్తిరించి పైపును బిగించారు. అక్కడి నుంచి ఆలయ ప్రహరీ వరకు ప్రత్యేక పైపు సాయంతో సోమసూత్రం ద్వారా వచ్చే జలం బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు