Updated : 02 Jul 2022 08:54 IST

TS TET: టెట్‌ పేపర్‌-2లో ఉత్తీర్ణత డబుల్‌

దాదాపు సగం మంది పాస్‌
పేపర్‌-1లో భారీగా తగ్గిన ఉత్తీర్ణత శాతం
బీఈడీ వారికీ అవకాశమివ్వడంతో పాసైనవారి సంఖ్య మాత్రం రెట్టింపు
ఫలితాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో ఈసారి పేపర్‌-2 ప్రశ్నపత్రం సులభంగా ఉండటంతో ఉత్తీర్ణత గణనీయంగా పెరిగి 49.64 శాతంగా నమోదైంది. ఆ పేపర్‌కు 2,50,897 మంది హాజరవగా 1,24,535 మంది ఉత్తీర్ణులయ్యారు. గతంలో ఎన్నడూ అది 25 శాతాన్ని మించలేదు. అందులోనూ సైన్స్‌ విభాగంలో సుమారు 58 శాతం మంది గట్టెక్కటం విశేషం. మరోవైపు పేపర్‌-1లో ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయింది. గత రెండు టెట్లలో 54, 57 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈసారి అది 32.68 శాతానికి దిగజారింది. ప్రశ్నపత్రం కఠినంగా ఉండటమే అందుకు కారణమని అభ్యర్థులు, నిపుణులు చెబుతున్నారు. కాకపోతే ఈసారి పాసైన అభ్యర్థుల సంఖ్య గతం కంటే రెట్టింపు కావడం గమనార్హం. ఈనెల 12న జరిగిన టెట్‌ ఫలితాలను శుక్రవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) టీఎస్‌టెట్‌ వెబ్‌సైట్లో ఉంచింది. మొత్తం రెండు పేపర్లకు కలిపి 3,80,589 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. అందులో బీఈడీ చేసిన వారికి ఈసారి పేపర్‌-1 రాసేందుకూ అవకాశం ఇవ్వడంతో వేలమంది రెండు పేపర్లకూ హాజరయ్యారు. మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహించగా.. జనరల్‌ కేటగిరీకి 90, బీసీలు-75, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు 60 మార్కులు వస్తే అర్హత సాధించినట్లు గుర్తిస్తారు. అంటే ఉపాధ్యాయులుగా ఎంపికకు జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్‌సీ) నిర్వహించే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు(టీఆర్‌టీ) రాయడానికి అర్హులవుతారు. టెట్‌ మార్కులకు 20 శాతం, టీఆర్‌టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు.

స్తంభించిన వెబ్‌సైట్‌

విద్యాశాఖ ఫలితాలను వెబ్‌సైట్లో పెట్టగానే ఒకేసారి లక్షల మంది ఫలితాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో సర్వర్‌ సామర్థ్యం సరిపోక చాలాసేపు స్తంభించిపోయింది. అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. ప్రైవేట్‌ వెబ్‌సైట్ల ద్వారా ఫలితాలు తెలుసుకున్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని