ఓయూలో నీటి కొరత.. విద్యుత్తు కోతలు!

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీటికొరత.. విద్యుత్తు కోతల అంశం వివాదంగా మారింది. ఈ రెండింటి కారణంగా మే 1 నుంచి విద్యార్థుల వసతి గృహాలను మూసేస్తామంటూ చీఫ్‌ వార్డెన్‌ కొమరెల్లి శ్రీనివాస్‌ మార్చి 18న జారీ చేసిన ఉత్తర్వు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ ఉత్తర్వును ఎక్స్‌లో పోస్ట్‌ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది.

Published : 30 Apr 2024 04:22 IST

మే 1 నుంచి హాస్టళ్ల మూత అంటూ చీఫ్‌ వార్డెన్‌ ఉత్తర్వు
దానిని ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన కేసీఆర్‌
విచారణకు ఆదేశించిన ఉపముఖ్యమంత్రి భట్టి  
సమస్యలు లేవని తేల్చిన అధికారులు
చీఫ్‌ వార్డెన్‌కు షోకాజ్‌ నోటీసు జారీ

ఈనాడు, హైదరాబాద్‌, లాలాపేట, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీటికొరత.. విద్యుత్తు కోతల అంశం వివాదంగా మారింది. ఈ రెండింటి కారణంగా మే 1 నుంచి విద్యార్థుల వసతి గృహాలను మూసేస్తామంటూ చీఫ్‌ వార్డెన్‌ కొమరెల్లి శ్రీనివాస్‌ మార్చి 18న జారీ చేసిన ఉత్తర్వు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ ఉత్తర్వును ఎక్స్‌లో పోస్ట్‌ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. వసతి గృహాలను మూసేస్తే ఆందోళన చేపడతామని విద్యార్థి సంఘాల ప్రతినిధులు నెల్లి సత్య, జీవన్‌లు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. మహిళా వసతి గృహంలో నీటి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని శనివారం రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నిరసన చేపట్టినట్లు ఏఐఎస్‌ఎఫ్‌ కార్యదర్శి నెల్లి సత్య తెలిపారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఓయూలో ఈ దుస్థితిని కాంగ్రెస్‌ పాలనలో చూస్తున్నామని మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో కరెంట్‌ కోతలే లేవని దబాయించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన విద్యుత్తు శాఖ, జలమండలి ఇంజినీర్లు ఓయూలో పరిస్థితిని పరిశీలించారు. నీటికొరత, కరెంట్‌ సమస్య లేవని ప్రభుత్వానికి తెలిపారు. ఓయూ అంతర్గత సమస్యగా పేర్కొన్నారు. తప్పుడు ప్రకటన ఇచ్చిన చీఫ్‌ వార్డెన్‌కు షోకాజు నోటీసు ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెప్పారు. విద్యార్థులు సెలవుల్లోనూ ఇక్కడే ఉండి చదువుకోవచ్చని ప్రకటించారు.

అదనంగా తాగునీటి సరఫరా: సుదర్శన్‌రెడ్డి, జలమండలి ఎండీ

ఓయూ అధికారులు చేసుకున్న ఒప్పందం ప్రకారం విశ్వవిద్యాలయ ప్రాంగణానికి రోజుకు 505 కిలో లీటర్ల కంటే అదనంగా నీటిని సరఫరా చేస్తున్నట్లు జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం 1,271 కిలో లీటర్లను సరఫరా చేస్తున్నామని తెలిపారు.

కరెంట్‌ కోత లేనే లేదు: రవి కుమార్‌, ఎస్‌ఈ, సికింద్రాబాద్‌ సర్కిల్‌

ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్‌ మీటర్ల రికార్డులు పరిశీలించగా విద్యుత్‌ సరఫరాలో ఎక్కడా అంతరాయం ఏర్పడలేదని తేలిందని సికింద్రాబాద్‌ సర్కిల్‌ విద్యుత్‌ ఎస్‌ఈ రవి కుమార్‌ తెలిపారు. క్యాంపస్‌కు నిరంతరాయ కరెంట్‌ సరఫరా అందుతోందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని