భానుడు.. భీకరం

రాష్ట్రంలో మంగళవారం నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది.

Updated : 30 Apr 2024 05:35 IST

నల్గొండ, ములుగు జిల్లాల్లో 45 డిగ్రీల నమోదు
వడదెబ్బతో అయిదుగురు, పిడుగుపాటుకు ఒకరు మృతి
వచ్చే నాలుగు రోజులు వడగాలులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది. ఈ జిల్లాలకు ‘పసుపు’ రంగు హెచ్చరికలు జారీచేసింది. రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడటంతో ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని సూచించింది. సోమవారం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 45.1, నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం తిమ్మాపురంలో 45.1, మాడుగులపల్లిలో 45, త్రిపురారం మండలం కామారెడ్డిగూడెంలో 44.9 డిగ్రీల ఎండ కాసింది. ఖమ్మం, గద్వాల జిల్లాల్లోని పలు మండలాల్లో 44.9, నిజామాబాద్‌, మంచిర్యాల, సూర్యాపేట, జగిత్యాల, మహబూబాబాద్‌ జిల్లాల్లో 44.5 నుంచి 44.8 డిగ్రీల మధ్య నమోదైంది. నల్గొండ జిల్లా త్రిపురారం, దామరచెర్ల, మాడుగులపల్లి మండలాల్లో వడగాలులు వీచాయి.

ఆరుగురు మృత్యువాత..

ఏటూరునాగారం, బెజ్జూరు, కాగజ్‌నగర్‌, పెద్దఅడిశర్లపల్లి, ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం బూటారం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలోనే ఉంటూ టీచర్‌గా కొనసాగుతున్న రామగిరి ప్రేమలీల(70) ఆదివారం ఎండ వేడికి అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం కేంద్రానికి వచ్చిన పిల్లలు ఎంత పిలిచినా పలకకపోవడంతో.. చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు తెరిచి చూడగా మృతిచెంది కనిపించారు. కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలంలోని ఎల్కపల్లి గ్రామంలో ఎండదెబ్బకు గురైన చౌధరి రవి(23)ని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫాంపై గుర్తుతెలియని వృద్ధుడు వడదెబ్బతో మృతిచెందినట్లు ఆర్‌పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ సురేష్‌గౌడ్‌ తెలిపారు. శంషాబాద్‌లో భిక్షాటన చేస్తూ జీవించే 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి ఎండకు తాళలేక మృత్యువాతపడ్డారు. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురానికి చెందిన మాచర్ల రాజశేఖర్‌, భార్గవి దంపతుల కుమారుడు కౌషిక్‌(12) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు అంబులెన్సులో దేవరకొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఎక్కెల గ్రామానికి చెందిన దుబ్బ ఉపేందర్‌(26) స్థానిక ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఆరబోశారు. సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో గాలులు వీస్తుండటంతో వడ్లపై పరదా కప్పేందుకు మరో రైతు రమేశ్‌తో కలిసి వెళ్లారు. ఒక్కసారిగా వారి సమీపంలో పిడుగుపడటంతో ఇద్దరూ స్పృహ కోల్పోయారు. అక్కడున్న వారు వెంటనే సామాజిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఉపేందర్‌ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రమేశ్‌ కొద్దిసేపటికి తేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని