‘మృత్యు’ ప్రయాణం!

సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి.

Published : 30 Apr 2024 04:21 IST

హైవేలపై ఆగి ఉన్న వాహనాలతో ప్రమాద ఘంటికలు
మూడు రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 25 మందికి పైగా మృతి

ఈనాడు, హైదరాబాద్‌: సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో వరసగా జరుగుతున్న ప్రమాదాలు ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నాయి. అయినా నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాలు కొనసాగుతున్నాయి.

కోదాడ సమీపంలో గురువారం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. పటాన్‌చెరు వద్ద బాహ్యవలయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యాపారి సజీవ దహనమయ్యారు. అంతకు రెండు రోజులకు ముందు సూర్యాపేట వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను.. కారు ఢీకొట్టిన ఘటనలో యువ దంపతులు మృత్యువాతపడ్డారు. బుధవారం వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు ఇంటర్‌ విద్యార్థులు మరణించారు. మిగతా అన్ని ప్రమాదాలు కలుపుకొని రెండు రోజుల్లోనే రాష్ట్రంలో 25 మందికిపైగానే అర్ధంతరంగా తనువు చాలించారు. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా హైవేలపై నిలిపి ఉంచిన లారీలను..ఇతర వాహనాలు ఢీకొట్టడంతో జరిగినవే కావడం గమనార్హం.

నిద్దరోతున్న నిఘా..

జాతీయ రహదారులపై వాహనాలు నిలపకూడదు. ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆయా రహదారులపై గస్తీ లేకపోవడమే. వాస్తవంగా ఆయా రహదారుల పరిధిలోని పోలీస్‌స్టేషన్ల సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించాలి. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కేసులు నమోదుచేయాలి. డ్రైవర్లు వాహనంలో లేనిపక్షంలో వాటిని అక్కణ్నుంచి తొలగించాలి. ఇవేమీ జరగడం లేదు.

రహదారి భద్రతా మండలి ఉన్నా..

రాష్ట్రంలో ప్రత్యేకంగా రహదారి భద్రతా మండలి ఉంది. దానికి ప్రత్యేక సదుపాయాలు ఏవీ లేవు. గస్తీ కోసం వాహనాలు సమకూర్చాలన్న ఆ సంస్థ ప్రతిపాదన చాలాకాలంగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. కనీసం వాహనాలు, వాటికి అవసరమైన సిబ్బందిని కేటాయిస్తే తామే నిరంతరం గస్తీ నిర్వహిస్తామని, తద్వారా ఇలాంటి ప్రమాదాలు నివారించడం వీలవుతుందని రహదారి భద్రతా మండలి అధికారులు చెబుతున్నా.. పట్టించుకునే వారు కరవయ్యారనే విమర్శలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని