Telangana News: సర్కార్‌ స్థలాలకు మళ్లీ వేలం

రాష్ట్రంలోని సర్కారు స్థలాల అమ్మకాలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. ఆదాయార్జన కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ), హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి

Updated : 12 Feb 2022 04:56 IST

టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ, జిల్లాల పరిధిలోని భూముల అమ్మకం

మార్చి 14 నుంచి 17 వరకు 1,408 ప్లాట్లకు వేలం నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సర్కారు స్థలాల అమ్మకాలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. ఆదాయార్జన కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ), హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), జిల్లాల పరిధిలోని 1,408 ఖాళీ స్థలాల(ప్లాట్ల)కు వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే మార్చి 14, 15, 16, 17 తేదీల్లో జిల్లాల వారీగా వీటి వేలం(భౌతికంగా) జరుగుతుంది. పట్టణాల్లోని ముఖ్యప్రాంతాల మధ్యలో ఉన్న ఈ స్థలాలు వివాదరహితమైనవని, వాటిలో సత్వరమే నిర్మాణాలు చేపట్టవచ్చని పేర్కొంది. సమగ్ర మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఈ స్థలాల వద్ద వచ్చే డిసెంబరు వరకు అంతర్గత రహదారులు, వీధిదీపాలు ఏర్పాటు చేస్తామని, భూ వినియోగానికి ఎలాంటి మార్పులు అవసరం లేదని తెలిపింది. టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని స్థలాల సమాచారం, బ్రోచర్లు ఆయా సంస్థల వెబ్‌సైట్లలో, జిల్లాల్లోని ప్రభుత్వ భూముల వివరాలు సంబంధిత జిల్లాల అధికారిక వెబ్‌సైట్లలో ఉంటాయని వెల్లడించింది.

వేలం ప్రక్రియ ఇలా..

మొదటి సారి దరఖాస్తు చేసుకునేవారు రూ.10 వేల ధరావత్తు చెల్లించాలి. ఈ భూములకు సంబంధించిన ప్రిబిడ్‌ సమావేశాలు ఈ నెల 18న, మార్చి 7న జరుగుతాయి. ఈ సందర్భంగా జిల్లాల వారీగా వేలం వేదికల వివరాలు ప్రకటించి ఆయా జిల్లాల వెబ్‌సైట్లలో పొందుపరుస్తారు. కొనుగోళ్లకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 12 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు స్థలాలను సందర్శించవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని