అమెరికా జట్టు నాయిక... మన గీతిక!

అమెరికా అండర్‌-19 మహిళా జట్టుని కొత్తగా ఏర్పాటుచేశారు. దానికి సారథి తెలుగమ్మాయి కొడాలి గీతిక. తను 14 ఏళ్లకే అమెరికా మహిళా జట్టుకు ఆడి రికార్డు సృష్టించింది. ఈనాడు-ఈటీవీతో తన విశేషాలు పంచుకుందీ యువతేజం...

Updated : 16 Mar 2022 09:28 IST

అమెరికా అండర్‌-19 మహిళా జట్టుని కొత్తగా ఏర్పాటుచేశారు. దానికి సారథి తెలుగమ్మాయి కొడాలి గీతిక. తను 14 ఏళ్లకే అమెరికా మహిళా జట్టుకు ఆడి రికార్డు సృష్టించింది. ఈనాడు-ఈటీవీతో తన విశేషాలు పంచుకుందీ యువతేజం...

శయం.. అందుకు తగ్గ శ్రమ ఉంటే అవకాశాలకు హద్దులు ఉండవని నిరూపిస్తోంది గీతిక కొడాలి. 14 ఏళ్లకే అమెరికా మహిళా క్రికెట్‌ జట్టులో స్థానం దక్కించుకుంది. 17 ఏళ్ల గీతిక ప్రస్తుతం అండర్‌-19 జట్టు కెప్టెన్‌... ఆ హోదాలో తొలి సిరీస్‌లోనే విజయాన్ని అందుకుంది. విజయవాడకు చెందిన కొడాలి ప్రశాంత్‌, మాధవిల కుమార్తె గీతిక. ‘చిన్నప్పట్నుంచీ క్రీడలంటే ఇష్టం. బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు అమ్మానాన్నల సూచనతో కోచ్‌ రఘును కలిశా. శిక్షణ తీసుకుంటే క్రికెట్‌లో బాగా రాణిస్తానని చెప్పారు. 11 ఏళ్లపుడు మొదటిసారి క్రికెట్‌ బ్యాట్‌, బాల్‌ పట్టుకున్నా. 14 ఏళ్ల వయసులో అమెరికన్‌ మహిళా జట్టులో స్థానం దక్కింది. అక్కడ అందరిలోకీ నేనే చిన్నదాన్ని. ఆ సమయంలో సీనియర్ల నుంచి మెలకువలు నేర్చుకోవడంతోపాటు.. ఫిట్‌నెస్‌, బౌలింగ్‌ సామర్థ్యాలను మెరుగుపరుచుకున్నాను. కెనడా, మెక్సికో, జింబాబ్వే తదితర దేశాల్లో 20 మ్యాచ్‌లు ఆడాను’ అని తన క్రికెట్‌ ప్రయాణాన్ని వివరించింది గీతిక. తను క్రికెట్‌లో అడుగుపెట్టాక నార్త్‌కరోలినా అయితే మంచి సౌకర్యాలు ఉంటాయని కాలిఫోర్నియా నుంచి అక్కడికి నివాసం మార్చారు తల్లిదండ్రులు.

గీతిక నేతృత్వంలో 15 మందితో కూడిన అండర్‌-19 జట్టు తొలి పర్యటనలో భాగంగా కరేబియన్‌ దీవుల్లోని సెయింట్‌ విన్సెంట్‌ వెళ్లింది. అక్కడ నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచారు. బృంద సభ్యుల్లో విశ్వాసం నింపుతూ.. అందరికీ అవకాశాలు ఇస్తూ జట్టుని విజయ పథంలో నడిపిన గీతికను అక్కడి క్రికెట్‌ వర్గాలు ప్రశంసించాయి. మే నెలలో దుబాయ్‌లో జరిగే ఫెయిర్‌బ్రేక్‌ టోర్నమెంట్‌కు ప్రస్తుతం ఈమె జట్టు సిద్ధమవుతోంది. క్రికెట్‌ సమయపాలన నేర్పిందనీ, చదువునీ ఆటనూ జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటున్నానంటోన్న గీతిక... 12వ తరగతి చదువుతోంది. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌, ఇండియాలో ప్రారంభం కాబోయే మహిళల ఐపీఎల్‌లో ఆడటం, ప్రపంచకప్‌లో అమెరికా మహిళా జట్టుకి కెప్టెన్సీ వహించాలన్నవి తన లక్ష్యాలని చెబుతుంది ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. స్నేహితులతో సరదాగా బయటకు వెళ్లడం, సినిమాలు చూడటం గీతిక అభిరుచులు. క్రికెటర్‌ కాకపోయినా ఏదో ఒక క్రీడలోనే ఉండేదాన్నంటోంది తను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని