Imran khan: రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో ఇమ్రాన్‌పై అభియోగాలు.. నేరం రుజువైతే ఉరిశిక్ష

అధికారిక రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

Updated : 25 Oct 2023 07:35 IST

ఇస్లామాబాద్‌; లాహోర్‌: అధికారిక రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనపై ప్రత్యేక కోర్టు నేరాభియోగాలను మోపింది. ఇమ్రాన్‌తోపాటు పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీలపై వచ్చిన ఆరోపణలను ఇక్కడి ప్రత్యేక కోర్టు ధ్రువీకరించింది. గతేడాది ప్రధాని పదవి నుంచి దిగిపోయేముందు నిర్వహించిన ఓ బహిరంగ ర్యాలీలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇదిగోనంటూ ఇమ్రాన్‌ కొన్ని పత్రాలు ప్రదర్శించారు. అమెరికాలోని పాక్‌ ఎంబసీ నుంచి వాటిని సేకరించినట్లుగా అప్పట్లో ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అదే ఇమ్రాన్‌ మెడకు చుట్టుకుంది. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్న ఇమ్రాన్‌ను భద్రతా సమస్యలు నేపథ్యంలో అక్కడే విచారణ జరపాలని పాక్‌ న్యాయశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అబ్దుల్‌ హస్నత్‌ జుల్కర్నైన్‌.. అడియాలా జైలుకే వచ్చి విచారణ చేపట్టారు. నేరారోపణ తర్వాత.. విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. ప్రత్యేక కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాల్‌ చేయనున్నట్లు ఇమ్రాన్‌ తరఫు న్యాయవాది చెప్పారు. ఈ కేసులో నేరం రుజువైతే.. ఇమ్రాన్‌ ఖాన్‌కు ఉరిశిక్ష లేదా 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నవాజ్‌ షరీఫ్‌పై అల్‌-అజిజియా కేసు ఎత్తివేత

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడిన అల్‌-అజిజియా కేసును ఎత్తివేస్తున్నట్టు పంజాబ్‌ రాష్ట్రప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. మరో మూడు అవినీతి కేసుల్లో రెండు కోర్టులు కూడా ఆయనకు బెయిల్‌ మంజూరు చేశాయి. దీంతో ఇటీవలే పాక్‌కు చేరుకున్న షరీఫ్‌కు న్యాయపరమైన చిక్కుల నుంచి ఊరట లభించినట్లైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని