Imran Khan: జైల్లో నాపై విష ప్రయోగం జరగొచ్చు..! పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌

జైల్లో తనపై విష ప్రయోగం జరగొచ్చని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు.

Published : 27 Oct 2023 18:33 IST

ఇస్లామాబాద్‌: తనపై మూడోసారి హత్యాయత్నం జరిగే అవకాశం ఉందని పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) ఆందోళన వ్యక్తం చేశారు. దేశం విడిచి వెళ్లేందుకు నిరాకరిస్తుండటంతో.. జైల్లో తనపై మరో హత్యాయత్నం జరగొచ్చని, అది విష ప్రయోగం (Slow Poisoning) రూపంలోనూ ఉండొచ్చని పేర్కొన్నారు. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసు (Cipher Case)లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యుల ద్వారా ‘ఎక్స్‌’ వేదికగా ఓ సందేశాన్ని విడుదల చేశారు. ఇటీవల స్వదేశానికి తిరిగివచ్చిన మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

‘దేశంలో చట్టాలను పూర్తిగా అపహాస్యం చేశారు. ఈరోజు జరుగుతున్నదంతా ‘లండన్‌ ఒప్పందం’లో భాగమే. పరారైన వ్యక్తికి.. ఓ అవినీతిపరుడు, అతడి సహాయకుల మధ్య కుదిరిన ఒప్పందం ఇది. శిక్ష పడిన ఓ నేరస్థుడు క్లీన్‌ చిట్‌తో తిరిగి రాజకీయాల్లోకి రావడానికి ఏకైక మార్గం.. ప్రభుత్వ సంస్థలను నాశనం చేయడమే. మన న్యాయ వ్యవస్థ పూర్తిగా పతనమైపోవడం చూస్తున్నాం కదా’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ (ఎన్‌) అధ్యక్షుడు, పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నాలుగేళ్ల తర్వాత ఇటీవల స్వదేశానికి చేరుకున్న క్రమంలో ఇమ్రాన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రహస్యపత్రాల దుర్వినియోగం కేసు.. ఇమ్రాన్‌కు ఎదురుదెబ్బ!

తనపై ఉన్న కేసులన్నీ బూటకపు, రాజకీయ ప్రేరేపితమైనవని ఇమ్రాన్‌ పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసే వరకు, లేదా ఆ తర్వాత కూడా చాలా కాలంపాటు తనను జైల్లో ఉంచేందుకే ఆ కేసులు మోపినట్లు ఆరోపించారు. దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించాలని, ఎప్పుడు ఎన్నికలు ప్రకటించినా.. ప్రచారాన్ని ప్రారంభించాలని తన పార్టీ (పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌) శ్రేణులను ఆదేశించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. అధికారిక రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో ఇమ్రాన్‌పై ప్రత్యేక కోర్టు ఇటీవల నేరాభియోగాలను మోపిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టేయాలని, బెయిల్‌ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్లనూ కోర్టు తిరస్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని