ImranKhan: ఇమ్రాన్‌.. తోషఖానా స్కామ్‌ అంటే?

తోషఖానా అవినీతి కేసులో పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు అక్కడి న్యాయస్థానం 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది.. అసలేంటీ తోషఖానా స్కామ్‌..ఇందులో ఇంకెవరైనా ఉన్నారా?

Updated : 05 Aug 2023 19:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తోషఖానా అవినీతి కేసులో పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని, పాక్ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేస్తూ.. లక్ష పాకిస్థాన్‌ రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని చెల్లించకపోతే..మరో ఆరు నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏంటీ తోషాఖానా అవినీతి కేసు?ఈ కేసులో ఇరుక్కున్న నేతలు ఇంకెవరైనా ఉన్నారా?

ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలోనే కేసు నమోదైంది. పాక్‌ ప్రముఖులు ఎవరైనా ఉన్నత పదవుల్లో ఉండి విదేశాల నుంచి బహుమతులు అందుకుంటే.. పదవి నుంచి వైదొలగిన తర్వాత వాటిని తోషాఖానాలో జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే నిబంధనల ప్రకారం సగం ధర చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చు. కానీ, ఇమ్రాన్‌ఖాన్‌ మాత్రం చాలా తక్కువ ధర చెల్లించి వాటిని తన వద్దే ఉంచుకున్నారని, మరికొన్నింటిని తోషఖానాకు తెలియకుండా విదేశాల్లోనే అమ్మేశారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా దాదాపు 11.9 కోట్ల పాకిస్థాన్‌ రూపాయల విలువైన బహుమతులను చాలా తక్కువ మొత్తంలో చెల్లించి తీసుకున్నారన్నది పిటిషనర్ల వాదన. దీనిపైనే తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది.

రూ.15 లక్షల వాచీకి కేవలం రూ.2.94 లక్షలే.. 

ఇమ్రాన్‌ ఖాన్‌ తాను ప్రధానిగా ఉన్న సమయంలో దాదాపు 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. వాటిలో అత్యంత విలువైన 5 చేతి గడియారాలు కూడా ఉన్నాయి. వీటి ధర దాదాపు రూ.38 లక్షల పాకిస్థాన్‌ రూపాయలు ఉంటుందని అంచనా. కానీ వీటన్నింటినీ 2018 అక్టోబరులో ఇమ్రాన్‌ కేవలం రూ2.5 లక్షలు చెల్లించి తీసుకున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కేవలం ఇవే కాకుండా వివిధ సందర్భాల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ తన వద్ద ఉంచుకున్న వస్తువుల జాబితాను పాక్‌ ప్రభుత్వం విడుదల చేసింది. 2018, సెప్టెంబరులో రూ.8.5 కోట్ల విలువైన వివిధ గ్రాఫ్‌ వాచీలను కేవలం రూ.2కోట్లు చెల్లించి ఇమ్రాన్‌ తనవద్దే ఉంచుకున్నారు. వీటిలో రూ.56 లక్షల విలువైన కఫ్‌ లింక్స్‌, రూ.15 లక్షల విలువైన పెన్ను, రూ.80.75 లక్షల విలువైన ఓ ఉంగరం కూడా ఉన్నాయి. రూ. 15 లక్షల విలువైన రోలెక్స్‌ వాచీని ఇమ్రాన్‌ కేవలం రూ.2.94 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు.

‘అరెస్టు ఊహించిందే.. లండన్‌ ప్లాన్‌లో ఇది మరొక అడుగు!’

వీటితోపాటు 2018 నవంబరులో రూ.9 లక్షల విలువైన మరో రోలెక్స్‌ వాచీతోపాటు మరికొన్ని విలువైన వస్తువులకు ఇమ్రాన్‌ కేవలం రూ.3.38 లక్షలు మాత్రమే చెల్లించారు. 2019 అక్టోబరులో రూ.19 లక్షల విలువైన బాక్స్‌డ్‌ వాచీకి రూ.9.35 లక్షలు చెల్లించారు. సెప్టెంబరు 2020లో మరో రోలెక్స్‌ వాచీతోపాటు రూ.44 లక్షల విలువైన వస్తువులకు రూ.24 లక్షలు చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అదే నెలలో ఇమ్రాన్‌ భార్య బుర్షా బీబీ రూ. కోటి విలువైన ఓ నెక్లెస్‌ను, రూ.24 లక్షల విలువైన బ్రాస్‌లెట్‌ను, రూ.28 లక్షల విలువైన ఉంగరాన్ని, రూ.18.5 లక్షల విలువైన చెవిరింగులను కేవలం రూ.90 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. పాక్‌ నిబంధనల ప్రకారం 300 డాలర్ల కంటే ఎక్కువ విలువైన బహుమతిని పొందిన సమయంలో కచ్చితంగా తోషఖానాకి తెలియజేయాలి. కానీ, ఇమ్రాన్‌ మాత్రం చాలా బహుమతులను తోషఖానా దృష్టికి తీసుకురాలేదని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు.

అందరి చిట్టా వచ్చేసింది

తాజా పరిస్థితుల నేపథ్యంలో 2002 నుంచి 2022 మధ్య దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులు, ఫెడరల్ కేబినెట్ సభ్యులు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, రిటైర్డ్ జనరల్‌లు, న్యాయమూర్తులు, జర్నలిస్టులతో సహా ప్రభుత్వ కార్యాలయాల అధికారులు విదేశాల నుంచి అందుకున్న బహుమతుల వివరాలను పాకిస్థాన్‌ తాజాగా బహిరంగపరిచింది. ఈ జాబితాలో అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వి, ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, మాజీ ప్రధానులు నవాజ్‌ షరీఫ్‌, షౌకత్‌ అజిజ్‌, యూసఫ్‌ రాజా గిలానీ, రాజా పర్వేజ్‌ అర్షాఫ్‌, జఫ్రుల్లా ఖాన్‌తో పాటు మాజీ అధ్యక్షులు ఆసిఫ్‌ అలి జర్దారీ, పర్వేజ్‌ ముషారఫ్‌ తదితర ప్రముఖులు ఉన్నారు. 

నవాజ్‌ షరీఫ్‌

2008-2017 మధ్య కాలంలో మూడు సార్లు ప్రధానిగా ఎన్నికైన నవాజ్‌ షరీఫ్‌ దాదాపు రూ.11.95 కోట్ల విలువైన మెర్సిడెజ్‌ బెంజ్‌ వాహనం, ఏడు చేతి గడియారాలు, ఇతర బంగారు ఆభరణాలను రూ. 2.43 లక్షలు చెల్లించి తన వద్దే ఉంచుకున్నారు.

అసిఫ్‌ అలి జర్దారీ

మాజీ ప్రధాని అసిఫ్‌ అలీ జర్దారీ దాదాపు రూ. 10 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ, టయోటా లెక్సస్‌ తదితర ఖరీదైన వాహనాలతోపాటు ఇతర విలువైన బహుమతులను కేవలం రూ.1.6 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. 

ఇలా పలువురు పాక్‌ ప్రముఖులు తోషఖానా నిబంధనలకు విరుద్ధంగా తక్కువ మొత్తంలో చెల్లించి విదేశాల పొందిన బహుమతులను ఆధీనం చేసుకున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. తాజా తీర్పు నేపథ్యంలో వారందరిపైనా విచారణ చేపడతారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని