Imran Khan: ‘అరెస్టు ఊహించిందే.. లండన్‌ ప్లాన్‌లో ఇది మరొక అడుగు!’

తన అరెస్టును ముందే ఊహించినట్లు పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. తోషాఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ జిల్లా, సెషన్స్‌ కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

Published : 05 Aug 2023 18:03 IST

ఇస్లామాబాద్‌: తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)ను ఇస్లామాబాద్ జిల్లా, సెషన్స్‌ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అయితే, తన అరెస్టు ఊహించిందేనని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. ముందుగానే రికార్డు చేసి పెట్టుకున్న తన ప్రసంగాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ‘ఇదంతా లండన్‌ ప్లాన్‌లో భాగమే. దాని అమలులో ఇది మరొక అడుగు. అయితే.. పార్టీ (PTI) కార్యకర్తలు శాంతియుతంగా, దృఢంగా ఉండాలి. పాక్‌ ప్రజలు వచ్చే ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలి’ అని ఇమ్రాన్‌ పేర్కొన్నారు.

లాహోర్‌ హైకోర్టును ఆశ్రయించిన ఇమ్రాన్‌ పార్టీ..

ఇమ్రాన్‌ ఖాన్‌ను అక్రమ కస్టడీలో ఉంచారని ఆరోపిస్తూ ఆయన పార్టీ ‘పీటీఐ’.. లాహోర్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఇమ్రాన్‌ను అపహరించారని పిటిషన్‌లో పేర్కొంది. వెంటనే విచారణ చేపట్టి.. ఆయన్ను హైకోర్టు ముందు హాజరుపరచాలంటూ పంజాబ్ పోలీసులను, ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించింది. ‘దాదాపు 200 మంది పోలీసులు ఇమ్రాన్‌ ఇంట్లోకి చొరబడి తుపాకీతో బెదిరించి అపహరించారు. కోర్టు తీర్పును చూపించకుండానే కిడ్నాప్ చేశారు. ప్రభుత్వం ఆయన్ను అక్రమ కస్టడీలో ఉంచింది. ఈ నేపథ్యంలో.. భద్రత దృష్ట్యా ఇమ్రాన్‌ ఖాన్‌ను హైకోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించాలి’ అని పీటీఐ నేత ఉమైర్‌ నియాజీ కోరారు. తోషాఖానా కేసులో తీర్పునూ సవాల్‌ చేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇమ్రాన్‌ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష.. ఏంటీ తోషాఖానా కేసు

దేశంలో అప్రకటిత మార్షల్‌ లా అమల్లో ఉందంటూ అంతకుముందు రోజు సైతం ఇమ్రాన్‌ ఖాన్‌.. పాకిస్థాన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘వచ్చే ఎన్నికల్లో మా పార్టీ విజయం సాధిస్తుందని ప్రభుత్వం, సైన్యానికి భయం పట్టుకుంది. ఈ క్రమంలోనే నాతోపాటు నా మద్దతుదారులపై ప్రతీకార చర్యలు చేపడుతున్నాయి. కానీ, ఇవి మా పార్టీ ఓటు బ్యాంకును పెంచుతున్నాయి. ఇలా ఓటుబ్యాంకు పెరుగుతోన్న పార్టీని ఎలా అణచగలరు?’ అని ఇమ్రాన్‌ ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. ఆగస్టు 9న పాక్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తామంటూ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నడుమ ఇమ్రాన్‌ అరెస్టు కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని