రూ.1600 కోట్ల విల్లాను కొనుగోలు చేసిన భారత వ్యాపారవేత్త.. ఆ విల్లాను చూస్తారా..?

Expensive Home: ప్రపంచంలోనే ఖరీదైన ఇళ్లలో ఒక దానిని భారత సంతతికి చెందిన ఓస్వాల్ కుటుంబం సొంతం చేసుకుంది. అందుకోసం వారు భారీ మొత్తం వెచ్చించారు.  

Published : 28 Jun 2023 18:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌కు చెందిన ఓ జంట ఓ ఖరీదైన ఇంటి( Expensive Home)ని సొంతం చేసుకుంది. స్విట్జర్లాండ్‌( Switzerland)లోని ప్రకృతి అందాలకు సమీపంలో నిర్మించిన ఆ భవంతికి వెచ్చించిన ఖర్చు సుమారు 200 మిలియన్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో 1,600 కోట్ల రూపాయల పైమాటే. ఆ కుటుంబం షేర్ చేసిన దృశ్యాల్లో ఆ ఖర్చు ఉట్టిపడుతోంది.

పంకజ్‌ ఓస్వాల్‌(Pankaj Oswal), రాధికా ఓస్వాల్( Radhika Oswal).. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని గింగిన్స్‌ గ్రామంలో విల్లాను కొనుగోలు చేశారు. అది  జెనీవాకు 15 నిమిషాల దూరంలో.. మంచుతో కప్పిఉండే ఆల్స్ప్‌ పర్వతశ్రేణికి సమీపంలో ఉంది. మొత్తం 4,30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవంతి ఖర్చు అక్షరాలా రూ.1,639 కోట్లు. ఈ ఇంటిని ప్రముఖ డిజైనర్ జెఫ్రీ విల్కెస్‌.. సుందరీకరించారు. ప్రైవేటు జిమ్‌, స్పా, వెల్‌నెస్‌ వింగ్ వంటి సౌలభ్యాలున్నాయి. ఇంట్లో వేలాడదీసిన షాండ్లియర్లను టర్కీ, మొరాకో దేశాల నుంచి తెప్పించారు. ప్రకృతి అందాలను, మంచు పర్వతాలను వీక్షించేందుకు భారీ ఫ్రెంచ్‌ విండోస్‌ను అమర్చారు. అంతకుముందు  గ్రీక్‌ షిప్పింగ్ మొగల్‌ అరిస్టాటిల్‌ ఒనాసిస్‌ కుమార్తె క్రిస్టినా ఒనాసిస్‌ ఈ ఇంటి యజమానిగా ఉన్నారు.

ఇంతటి ఖరీదైన ఇంటిని సొంత చేసుకున్న ఓస్వాల్‌ కుటుంబం.. 2013లో ఆస్ట్రేలియా నుంచి స్విట్జర్లాండ్‌( Switzerland)కు మకాం మార్చింది. ఓస్వాల్ గ్రూప్‌ గ్లోబల్‌(Oswal Group Global)కు పెట్రోకెమికల్స్‌, రియల్‌ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారాలున్నాయి. ఇక ఈ విల్లా పేరు.. వరి(Villa Vari). పంకజ్ తన ఇద్దరు కుమార్తెలు వసుంధర ఓస్వాల్‌, రిధి ఓస్వాల్‌ పేర్ల మీదుగా  భవంతికి ఆ పేరు పెట్టారు. వసుంధర.. పీఆర్‌ఓ ఇండస్ట్రీస్‌ పీటీఈ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, యాక్సిస్‌ మినరల్స్‌లో డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. చిన్నకుమార్తె లండన్‌లో కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నారు.

ఇటీవల రిధి.. ఇంటికి సంబంధించిన దృశ్యాలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ‘ఒక భారతీయురాలిగా విదేశాల్లో ఉన్నప్పుడు.. మన సంస్కృతికి సంబంధించిన కొన్ని విషయాలను మిస్‌ అవుతుంటాం. భారత్‌కు వెలుపల ఒక మినీ భారత్‌ను సృష్టించాలన్నది మా కుటుంబం కల. ఆ స్వప్నం సాకారమైనందుకు సంతోషంగా ఉంది’ అని ఆమె రాసుకొచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని