Israel-Hamas Conflict: గాజాలో యూనివర్శిటీ భవనంపై ఇజ్రాయెల్‌ దాడి.. వివరణ కోరిన అమెరికా!

గాజాలో యూనివర్శిటీ భవనంపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడి చేసింది. దీనిపై అమెరికా వివరణ కోరినట్లు వార్తలు వెలువడ్డాయి.

Updated : 19 Jan 2024 18:03 IST

రఫా: హమాస్‌ స్థావరాలను నాశనం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దళాలు గాజాపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ గాజాలోని అల్‌-ఇస్రా విశ్వవిద్యాలయ భవనంపై దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ దాడిపై ఇజ్రాయెల్‌ను అమెరికా వివరణ కోరినట్లు పలు వార్తలు వెలువడ్డాయి. అమెరికా హోంశాఖ అధికార ప్రతినిధి డేవిడ్‌ మిల్లర్‌ దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న వీడియోకు సంబంధించి తమ వద్ద పూర్తి సమాచారం లేదని వ్యాఖ్యానించారు.

దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ పట్టణంలో ఉన్న యూనివర్శిటీ భవనాన్ని హమాస్‌ మిలిటెంట్ల స్థావరంగా ఉపయోగిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ అనుమానిస్తోంది. అందులో హమాస్‌ పెద్దఎత్తున ఆయుధాలను నిల్వ చేసి ఉంటుందని భావించి ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. కానీ, గతేడాది చివర్లో ఈ భవనాన్ని ఐడీఎఫ్‌ అధీనంలోకి తీసుకుని, కమాండ్‌ సెంటర్‌గా ఉపయోగించుకున్నట్లు పాలస్తీనా ఉన్నత విద్యావిభాగం ఆరోపించింది. ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో భవనం పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు చుట్టుపక్కల ప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించింది. యూనివర్శిటీలో పాలస్తీనా సంస్కృతి, కళలకు సంబంధించిన మ్యూజియం ఉన్నట్లు తెలిపింది.

ఇజ్రాయెల్‌-అమెరికా మధ్య అభిప్రాయభేదాలు..!

మరోవైపు హమాస్‌ నియంత్రణలోని గాజా నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలంటూ అమెరికా చేసిన అభ్యర్థనను ఇజ్రాయెల్‌ తిరస్కరించడంపై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు ప్రతిపాదననూ ఇజ్రాయెల్‌ వ్యతిరేకించడంతో ఇరు దేశాల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్లు వార్తలు వెలువడ్డాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని