Israel: హమాస్‌ మారణహోమంలో ఐరాస ఉద్యోగుల పాత్ర..! ఇజ్రాయెల్‌ స్పందన ఇదే..

యుద్ధం ముగిసిన తర్వాత ‘ గాజా’లో యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరతామని ఇజ్రాయెల్‌ విదేశాంగశాఖ మంత్రి కాట్జ్ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

Updated : 27 Jan 2024 21:38 IST

జెరూసలెం: పాలస్తీనా యుద్ధబాధితుల అభివృద్ధి, సహాయం కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి (United Nations) ఏజెన్సీ ‘యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ’ (UNRWA ) విషయంలో ఇజ్రాయెల్‌ (Israel) కీలక అంశాన్ని లేవనెత్తింది. యుద్ధం ముగిసిన తర్వాత ‘గాజా’లో ఏజెన్సీ కార్యకలాపాలను నిలిపేయాలని కోరతామని ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి కాట్జ్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. అవసరమైతే అమెరికా (USA), యూరోపియన్‌ యూనియన్‌ (EU) దేశాల మద్దతు కూడగడతామని చెప్పారు. దీనిపై హమాస్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. పాలస్తీనియన్ల రక్షణ కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ ఏజెన్సీలను భయపెట్టాలని ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తోందని విమర్శించింది.

అక్టోబర్‌ 7న హమాస్‌ జరిపిన మారణహోమంలో ‘యూఎన్‌ఆర్‌డబ్ల్యూ’ ఏజెన్సీకి చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర ఉందని, అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఇజ్రాయెల్‌ ఆ ఏజెన్సీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో దాడి ఘటనలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న పలువురు ఉద్యోగులను తొలగించారు. మానవతా సాయం అందించే యూఎన్‌ ఏజెన్సీని రక్షించే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ కమిషనర్‌ జనరల్‌ ఫిలిప్‌ లజారిని పేర్కొన్నారు.

ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఏజెన్సీకి అదనపు నిధుల మంజూరును అమెరికా నిలిపివేసింది. పూర్తిస్థాయిలో సమీక్ష చేసిన తర్వాతనే ఆర్థిక సాయంపై ముందుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపింది. దాదాపు 12 మంది ఉద్యోగులకు హమాస్‌ దాడితో సంబంధం ఉన్నట్లు అనుమానాలున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా, కెనడా దేశాలు కూడా యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకి నిధుల విడుదలను ఆపేశారు. ఈ నేపథ్యంలో కాట్జ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి ఘటనలో సుమారు 1200 మంది చనిపోయారు. 250 మందిని హమాస్‌ బందీలుగా చేసుకుంది. దీంతో ఇజ్రాయెల్‌ బలగాలు హమాస్‌ లక్ష్యంగా గాజాపై వైమానిక, భూతల దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 26,083 మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 70 శాతం మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని