Maldives: ‘మాది చిన్న దేశం.. శతృత్వాలు పెట్టుకోలేం’: మాల్దీవులు కొత్త అధ్యక్షుడు

భారత్‌, చైనా సహా అన్ని దేశాలతో కలిసి పనిచేయాలనుకుంటున్నామని మాల్దీవులు కొత్త అధ్యక్షుడు మయిజ్జు అన్నారు. పొరుగు దేశాలతో రాజకీయ పరమైన ఘర్షణల్లో తాము చిక్కుకోలేమన్నారు.

Updated : 11 Jan 2024 14:07 IST

మాలే: అధికార బాధ్యతలు చేపట్టగానే తమ ద్వీప దేశం నుంచి భారత బలగాలను పంపిస్తామని చెప్పిన మాల్దీవుల (Maldives) కొత్త అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమది చాలా చిన్న దేశమని, పొరుగువారితో శతృత్వాలు పెట్టుకోలేమని అన్నారు. భారత్‌ (India), చైనా (China) సహా అన్ని దేశాలతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

నవంబరు 17న మయిజ్జు మాల్దీవుల కొత్త అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. ఇతర దేశాలతో విభేదాల గురించి స్పందించారు. ‘‘ఇతర దేశాలతో ఘర్షణల్లో చిక్కుకోవడానికి మాల్దీవులు చాలా చిన్న దేశం. ఇతర దేశాలతో ఘర్షణల కోసం మా విదేశాంగ విధానాన్ని వినియోగించుకునే ఆసక్తి లేదు’’ అని మయిజ్జు వ్యాఖ్యానించారు. తమ దీవుల్లో మోహరించిన భారత బలగాలను పంపిస్తామని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారత దళాల స్థానంలో చైనా దళాలను మయిజ్జు అనుమతిస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. దీనిపై మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

అంతేగాక, భారత దళాలను వెళ్లిపొమ్మనడం అంటే.. వాటి స్థానంలో ఇతర దేశాల బలగాలకు అనుమతిస్తామనే ఉద్దేశం కాదని మయిజ్జు మరోసారి స్పష్టం చేశారు. తమ భూభాగంలో చైనా, లేక ఇతర దేశాలు దళాలు మోహరించేందుకు అనుమతించబోమని తెలిపారు. తాము పూర్తి స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘‘భారత్‌, చైనా సహా మేం అంతర్జాతీయంగా అన్ని దేశాలతో కలిసి పనిచేస్తాం’’ అని మయిజ్జు ఈ సందర్భంగా వెల్లడించారు. చైనా అనుకూలవాదిగా పేరొందిన మాజీ అధ్యక్షుడు యామీన్‌కు మయిజ్జు సన్నిహితుడు. దీంతో మయిజ్జు రాకతో మాల్దీవులు.. చైనా వైపు మొగ్గుచూపేందుకు ప్రయత్నించవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారత పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్న లక్షదీవులకు కింద ఈ మాల్దీవులు ఉన్నాయి. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే  కీలకమైన సముద్రమార్గం ఇక్కడకు సమీపంలోనే ఉంది. మాల్దీవులు పలుదీవులతో కూడిన చిన్న దేశం కావడంతో భారత్‌ సాయంపైనే ఆధారపడుతోంది. ఈ క్రమంలోనే అక్కడ భారత బలగాలు మోహరించాయి. ఈ దళాలు.. భారత్‌ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తాయి. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్‌లో గస్తీకి సహకరిస్తున్నాయి. మాల్దీవుల్లో ప్రస్తుతం 50 నుంచి 75 మంది వరకు భారత సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.

ప్రమాణస్వీకారానికి కిరణ్‌ రిజిజు..

ఇదిలా ఉండగా.. మయిజ్జు ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్రమోదీకి ఆహ్వానం అందింది. అయితే, ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు ఆ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. మాల్దీవులతో తమ బంధం కొనసాగుతుందని, ఆ దేశానికి సహకారం అందించేందుకు భారత్‌ కట్టుబడి ఉందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని