New Zealand: పోటెత్తిన వలసలు.. న్యూజిలాండ్‌ వీసా నిబంధనలు కఠినతరం!

వలసలతో సతమతమవుతోన్న న్యూజిలాండ్‌.. వాటిని నియంత్రించేందుకు సిద్ధమైంది. ఉపాధి వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించింది.

Published : 09 Apr 2024 00:09 IST

వెల్లింగ్టన్‌: పెద్ద ఎత్తున వలసలు(Migration)తో న్యూజిలాండ్‌ (New Zealand) సతమతమవుతోంది. గతేడాది ఏకంగా 1.73 లక్షల మంది ఆ దేశానికి పోటెత్తారు. వలసల విషయంలో స్థానికంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం.. వాటిని నియంత్రించేందుకు సిద్ధమైంది. ఉపాధి వీసా నిబంధనల విషయంలో తక్షణమే మార్పులు చేపడుతున్నట్లు ప్రకటించింది.

పెద్దగా నైపుణ్యం అవసరం లేని పనులను వెతుక్కుంటూ వచ్చేవారికి కూడా ఆంగ్ల భాష పరిజ్ఞానం ఉండటం, ఉద్యోగ వీసాల విషయంలో కనీస నైపుణ్యాలు, పని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవడం వంటివి కొత్తగా చేపడుతున్న మార్పుల్లో ఉన్నాయి. అదేవిధంగా తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో ఉన్నవారికి స్థానికంగా నిరంతర నివాస గడువును ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించనున్నారు.

వీసా అవసరం లేదు..వచ్చేయండి!

సెకండరీ టీచర్లు వంటి అత్యంత నైపుణ్యం కలిగిన వలసదారులను ఆకర్షించడం, అటువంటివారు ఇక్కడే కొనసాగేలా చూడటంపైనా దృష్టి సారించినట్లు న్యూజిలాండ్‌ వలసల శాఖ మంత్రి ఎరికా స్టాన్‌ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో నైపుణ్యాల కొరత లేని ఉద్యోగాల విషయంలో తమ దేశవాసులు ముందు వరుసలో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. న్యూజిలాండ్‌ జనాభా ప్రస్తుతం 51 లక్షలకుపైగా ఉంది. కొవిడ్‌ అనంతరం దేశంలోకి వలసలు విపరీతంగా పెరిగాయి. దీంతో గతేడాది ద్రవ్యోల్బణం పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. మరోవైపు.. పొరుగున ఉన్న ఆస్ట్రేలియా కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. దీంతో రానున్న రెండేళ్లలో వలసదారుల సంఖ్యను సగానికి తగ్గించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని