Visa Free Countries: వీసా అవసరం లేదు..వచ్చేయండి!

కొవిడ్‌ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక రంగం క్రమక్రమంగా కోలుకోవడమే కాదు ఇప్పుడు పరుగులు పెడుతోంది.

Updated : 16 Dec 2023 09:32 IST

పర్యటనకు ఆహ్వానిస్తున్న పలు దేశాలు
రాష్ట్రం నుంచి భారీగా వెళ్తున్న పర్యాటకులు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక రంగం క్రమక్రమంగా కోలుకోవడమే కాదు ఇప్పుడు పరుగులు పెడుతోంది. భారతీయ పర్యాటకులకు వీసా అవసరం లేదు (Visa Free Countries).. వచ్చేయండి అంటూ మాల్దీవులు, మారిషస్‌, భూటాన్‌, నేపాల్‌, హాంకాంగ్‌, బార్బడోస్‌, సెర్బియా, కజక్‌స్థాన్‌, ఒమన్‌, ఖతార్‌ తాజాగా ఇరాన్‌ వంటి దేశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. సింగపూర్‌, థాయిలాండ్‌, మలేసియా, అజర్‌బైజాన్‌, టర్కీ, జోర్దాన్‌, వియత్నాం, మయన్మార్‌, శ్రీలంక, న్యూజిలాండ్‌, ఇండోనేసియా, కంబోడియా తదితర దేశాలు ఇక్కడి పర్యాటకులకు వీసా నిబంధనలను సడలిస్తూ ఆకర్షిస్తున్నాయి.

వీసా, వ్యయ ప్రయాసలు లేకపోవడంతో

విదేశీ పర్యటనకు వెళ్లాలన్న కోరిక ఉన్నా వీసా దొరకడం కష్టమయ్యేసరికి చాలామంది తమ ప్రయత్నాల్ని విరమించుకుంటారు. దీంతో భారతీయ పర్యాటకులకు అనేక దేశాలు వీసాను మినహాయించగా మరికొన్ని దేశాలు వీసా నిబంధనలను సడలిస్తున్నాయి. కజక్‌స్థాన్‌లో స్విట్జర్లాండ్‌ తరహా మంచు పర్వతాలుంటాయి. వీసా అవసరం లేని ఈ దేశానికి వెళ్లి రావడానికీ ఖర్చు తక్కువే. దిల్లీ నుంచి మూడున్నర గంటల ప్రయాణం కావడంతో రాష్ట్ర పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. భారతీయ పర్యాటకులకు వేసవి వరకు వీసా అవసరం లేదంటూ థాయ్‌లాండ్‌, మలేసియా, శ్రీలంక ప్రత్యేక వెసులుబాటును కల్పించాయి. విదేశీ టూర్లకు కుటుంబాలే కాకుండా పని చేసే సంస్థల తరఫు నుంచి కూడా బృందాలుగా వెళుతున్నారు. ‘ఈ ఏడాది మలేసియా, థాయ్‌లాండ్‌ వెళ్లి వచ్చా..’అని హైదరాబాద్‌కు చెందిన ఉరుకుంద్‌శెట్టి చెప్పారు. ‘లక్ష్యాలు పూర్తిచేసిన వారిని మా సంస్థ విదేశాలకు తీసుకెళుతోంది’ అని ఓ బీమా కంపెనీలో పనిచేసే రంజిత్‌ పేర్కొన్నారు. తాజాగా గచ్చిబౌలిలోని ఓ సంస్థ వంద మందిని దుబాయ్‌కి పంపించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం విదేశాలకు వెళ్లే రాష్ట్ర పర్యాటకుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది.


విదేశీ పర్యటనకు ఆసక్తి పెరిగింది

‘గతంలో విదేశీ పర్యటనకై రోజుకు మాకు 20 ఎంక్వైరీలు వచ్చేవి. ఇప్పుడు ఆ సంఖ్య 60-70కి చేరింది. పలు దేశాలు వీసా నిబంధన ఎత్తేయడంతో పాటు విదేశీ పర్యటనకు రాష్ట్ర ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కూడా వీసా నిబంధన ఎత్తివేయనుంది. దేశీయంగా కశ్మీర్‌కు భారీగా వెళుతున్నారు.

సుధా చంద్రమౌళి, డైరెక్టర్‌, రాయల్‌ టూరిజం


మన పర్యాటకులకు డిమాండ్‌ పెరుగుతోంది

చలికాలంలో మన పర్యాటకుల సంఖ్య బాగా పెరుగుతోంది. భారత్‌ పాస్‌పోర్టు ఉంటే చాలు వీసా అక్కర్లేదంటున్నాయి కొన్ని దేశాలు. కజక్‌స్థాన్‌కు ఓ జంట లక్షన్నరలోనే వెళ్లిరావచ్చు. ఈ ఏడాది కజక్‌స్థాన్‌కు 460 మంది, ఇతర దేశాలకు 630 మంది పర్యాటకుల్ని మేం పంపించాం.

వాల్మీకి హరికిషన్‌, ఛైర్మన్‌, ఫెడరేషన్‌ తెలంగాణ
ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ టూరిజం కమిటీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని