ప్లీజ్‌.. మా వాళ్లను సైన్యంలోకి తీసుకోవద్దు: రష్యాను కోరిన నేపాల్‌

రష్యా(Russia) సైన్యంలో పోరాడుతూ తన దేశీయులు ఆరుగురు మృతి చెందడంపై నేపాల్ ఆందోళన వ్యక్తం చేసింది. తమ వాళ్లను సైన్యంలో చేర్చుకోవద్దని రష్యాను కోరింది. 

Updated : 05 Dec 2023 16:22 IST

కాఠ్‌మాండూ: తన దేశీయులను సైన్యంలోకి తీసుకోవద్దని రష్యా(Russia)ను నేపాల్ కోరింది. ఇప్పటికే సైన్యంలో విధులు నిర్వర్తిస్తోన్న వారిని తిరిగి తమ దేశానికి పంపివేయాలని అభ్యర్థించింది. ఈ మేరకు నేపాల్‌ విదేశాంగశాఖ వెల్లడించింది.

నేపాల్‌(Nepal)కు చెందిన గూర్ఖాలకు ధైర్యసాహసాలు ఎక్కువంటారు. వారిని పోరాట యోధులుగా పిలుస్తారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నేపాలీ గూర్ఖా యువకులు రెండు పక్షాల తరఫునా పోరాడుతున్నారు. రష్యా ఆర్మీలో సేవలు అందిస్తోన్న ఆరుగురు గూర్ఖాలు మృతి చెందడంతో నేపాల్ నుంచి ఈ అభ్యర్థన వచ్చింది. ‘వెంటనే ఆ మృతదేహాలను స్వదేశానికి పంపించాలని మేం రష్యా ప్రభుత్వాన్ని కోరాం. అలాగే వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అడిగాం’ అని విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యా సైన్యంలో పనిచేస్తూ.. ఉక్రెయిన్‌ చేతిలో బందీగా మారిన నేపాల్‌ పౌరుడి విడుదలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పింది. యుద్ధంలో పాల్గొంటున్న ఏ దేశ సైన్యంలోనూ చేరొద్దని తన పౌరుల్ని కోరింది. నేపాల్‌ ప్రకటనపై ప్రస్తుతం రష్యా నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

హమాస్‌ సొరంగాలను నీటితో నింపేందుకు ఏర్పాట్లు..!

రష్యా సైన్యం తరఫున 150-200 మంది నేపాలీలు పోరాడుతున్నట్లు సమాచారం. నెలకు మూడు నుంచి నాలుగు లక్షల నేపాలీ రూపాయల వేతనం, ఏడాది పాటు పోరాడితే రష్యన్‌ పౌరసత్వం ఇస్తామంటూ అధ్యక్షుడు పుతిన్‌ ఇచ్చిన హామీ వారిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. పేద హిమాలయ దేశమైన నేపాల్‌ నుంచి గూర్ఖాలు 200 ఏళ్లుగా బ్రిటిష్‌, భారత సైన్యాల్లో సేవలందిస్తున్నారు. ఆ మేరకు మూడు దేశాల మధ్య ఒప్పందం ఉంది. అయితే రష్యాతో నేపాల్‌కు అలాంటి ఒప్పందమేమీ లేదు. అయితే స్వదేశంలో తగినన్ని ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్న నేపాలీ సర్కారు- విదేశీ అవకాశాలను వెతుక్కోవద్దని యువతకు చెప్పలేకపోతోంది.

కొవిడ్‌ సమయంలో, అనంతర కాలంలో నేపాలీ పర్యాటక రంగం కుదేలైంది. దాంతో యువత విదేశాల్లో ఉపాధి అవకాశాలు వెతుక్కుంటోంది. పశ్చిమాసియా, దక్షిణకొరియా, మలేసియా వంటి దేశాల్లో వారు కూలీలుగా పనిచేస్తున్నారు. మరోపక్క యుద్ధంలో మరణించిన నేపాలీలను ఖననం(వారిది దహనం చేసే సంప్రదాయం) చేస్తున్నారనే వార్తలు, హామీ ఇచ్చిన వేతనాల్లో నాలుగో వంతే చెల్లించడం వంటి కారణాలతో అక్కడి వారిని వెనక్కి తీసుకురావాలంటూ ప్రభుత్వంపై సైనికుల తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని